సాగుకు సాంకేతికత సోకు!

* రైతు సేవలో ఏఐ యాప్
* ఇప్పటికే 5.50 లక్షల డౌన్‌లోడ్‌లు
* చిటికలో చీడపీడల నివారణ, ఎరువుల వాడకంలో సూచనలు
* అనుబంధ శాఖల్నీ అనుసంధానిస్తే మరింత మేలు

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)అన్ని రంగాల్లో ప్రవేశిస్తోంది. ఈ కోవలో ఏఐ సేవలు వ్యవసాయ రంగానికి కూడా విస్తరించాయి. చీడపీడల నివారణకు రైతులు అడిగే ప్రశ్నలకు ఏఐ చాట్ బాట్ చక్కటి పరిష్కార మార్గాలను చూపుతోంది. పంటల ఫోటోలు అప్‌లోడ్ చేస్తే చాలు…. వాటిని విశ్లేషణించి ఏ మందులు పిచికారి చేయాలి, ఎంత మోతాదు ఉపయోగించాలో ఏఐ వివరిస్తోంది. నేల స్వభావం చెబితే చాలు…. ఆ భూమి ఏ పంటలకు అనుకూలమో కూడా ఏఐ వివరంగా రైతులకు చెబుతోంది. పెద్దగా చదువు లేని వారు కూడా దీన్ని ఉపయోగించవచ్చు. వాయిస్ ద్వారా అడిగే ప్రశ్నలకు వాయిస్ సమాధానాలు అందిస్తోంది. దీంతో నిరక్షరాస్యులు కూడా దీన్ని చక్కగా ఉపయోగించుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఏఐఎంఎస్) యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే చాలు… యంత్ర పరికరాలు, డ్రోన్లు, ట్రాక్టర్లు అద్దెకు బుక్ చేసుకోవచ్చు. ఇటీవల అమరావతిలో పర్యటించిన శ్రీ బిల్ గేట్స్ కూడా యాప్ సేవలను కొనియాడారు. ఏపీ వ్యాప్తంగా ఇప్పటికే 5.50 లక్షల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారు. వారు ఏఐ సేవలు పొందుతున్నారు. వ్యవసాయ అనుబంధ శాఖలను కూడా అనుసంధానం చేస్తే మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
* యాప్ డౌన్‌లోడ్ చేసుకోవడం ఎలా?
ప్లేస్టోర్‌లో ఏపీఏఐఎంఎస్ అని టైప్ చేయగానే యాప్ ప్రత్యక్షం అవుతుంది. దాన్ని డైన్‌లోడ్ చేసుకుని ఇనస్టాల్ బటన్‌పై క్లిక్ చేయాలి. యాప్ ఓపెన్ చేసి రైతు విభాగంలో ఆధార్ నెంబరు నమోదు చేయాలి. ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాలి. అంతే యాప్ పనిచేయడం ప్రారంభం అవుతుంది. గ్రామం, ఎల్పీఎం నంబర్లు, సాగు విస్తీర్ణం వారీగా రైతుకు సొంతంగా వున్న భూమి వివరాలు కనిపిస్తాయి. రైతులు వారు సాగు చేసే భూమి వివరాలను ఆర్ఓఆర్‌లో అప్ డేట్ చేసుకోవచ్చు. మీ భూమి వెబ్‌సైట్ లింకు కూడా అందుబాటులో వుంచారు. నేరుగా రెవెన్యూ శాఖకు కూడా అనుసంధానం అవుతుంది. గ్రామం వారీగా పొలంపై క్లిక్ చేయగానే ఈ- పంటలో నమోదైందా లేదా అనే వివరాలు వస్తాయి. నమోదు కాకుండే మీ పంటను బుక్ చేయండిపై క్లిక్ చేయాలి. వివరాలు వస్తాయి. అందులో పంట వివరాలు, సాగు విస్తీర్ణం, విత్తనాలు వేసిన తేదీ, నీటి సదుపాయాలు, వర్షాధారం, సాగు విధానం వివరాలు నమోదు చేయాలి. ఫోటో తీసుకుని అప్ లోడ్ చేసుకోవచ్చు. తరువాత వ్యవసాయ శాఖ సహాయకులు పొలానికి వెళ్లి పరిశీలించి ధ్రువీకరిస్తారు. డ్యాష్ బోర్డులో పంట నష్టంపై క్లిక్ చేస్తే పొలాల వారీగా సమాచారం లభిస్తుంది. ఇది త్వరలో అందుబాటులోకి రానుంది.
* వాతావరణం…. ఇతర వివరాలు
యాప్ కింది భాగంలో హోమ్, ఏఐ సహాయత, కొన్ని వీడియోలు వుంటాయి. ఏఐ సహాయతపై క్లిక్ చేయగానే ప్రభుత్వ పథకాలు, వాతావరణ పరిస్థితులు, ఈ సీజన్‌లో దిగుబడి ఎలా పెంచుకోవాలి? భూ సారం ఎలా వుంది, తదితర వివరాలుంటాయి. వాతావరణంపై క్లిక్ చేస్తే వచ్చే వారం రోజుల్లో మీ గ్రామంలో వాతావరణ రిపోర్టు అందుబాటులోకి వస్తుంది. వర్షాల వివరాల ఆధారంగా రైతులు పంటలు విత్తడం, పంటలకు నీరు పారించడం, నూర్పిడి విషయంలో జాగ్రత్త పడటం చేయవచ్చు.
* డ్యాష్ బోర్డులోనే….
యాప్ డ్యాష్ బోర్డులోనే వ్యవసాయ శాఖ నోటిఫికేషన్లు, వ్యవసాయశాఖ అధికారుల ఫోన్ నెంబర్లు, చీడపీడలు వాటి నివారణ సమాచారం, మార్కెట్ ధరలు, సర్వేలు, ప్రభుత్వ రాయితీల వివరాలు అందుబాటులో వుంటాయి. ప్రభుత్వం అందిస్తున్న కొన్ని పథకాల వివరాలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. మరికొన్ని వివరాలు పొందుపరచాల్సి వుంది. రైతు సేవా కేంద్రం, మండల వ్యవసాయ శాఖ అధికారి, డివిజన్, జిల్లా స్థాయి అధికారులతోపాటు, డాట్ కేంద్రాలు, జిల్లా వనరుల కేంద్రం, ప్రయోగశాలలు, పరిశోధన స్థానాలు, రీజనల్ కోడింగ్ కేంద్రాల సమాచారం అందుబాటులో వుంచారు. మార్కెట్ ధరలు తెలుసుకోవచ్చు. రాష్ట్రంలోని ప్రధాన మార్కెట్లలో రైతుకు వివిధ పంటలకు లభిస్తున్న ధరల వివరాలు అందుబాటులో వుంచారు. అన్నదాత సుఖీభవ కింద ఇప్పటి వరకు మీకు ఎంత సాయం అందింది అనే వివరాలు కూడా అందుబాటులోకి వచ్చాయి.
* ఏఐ సేవలు విస్తరించాలంటే….
వ్యవసాయరంగంలో ఏఐ సేవలు మరింత విస్తరించాలంటే అనుబంధ శాఖలను అనుసంధానం చేయాలి. ప్రస్తుతం వ్యవసాయశాఖ వివరాలు మాత్రమే అందుబాటులో వున్నాయి. ఆయా గ్రామాలకు సమీపంలో ఎరువులు, పురుగుమందుల దుకాణాల వివరాలు, నిల్వలు, ధరలు, ఏ కంపెనీల మందులు ఎంత ధరకు అందుబాటులో వున్నాయి అనే వివరాలు కూడా అందుబాటులోకి తీసుకురావచ్చు. రైతులు ఇంటి వద్ద నుంచే వారికి కావాల్సిన ఎరువులు, పురుగుమందులను బుక్ చేసుకునే వెసులుబాటు కల్పించవచ్చు. రైతు భరోసా కేంద్రాలకు వెళ్లే పనిలేకుండానే పంటలను అమ్ముకునే వీలు కల్పించాలి. యాప్‌లో ఈ సదుపాయాలు అందుబాటులోకి తీసుకురావాలి. ఉద్యానపంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అందిస్తోన్న సూక్ష్మ సేద్యం రాయితీలు, మొక్కలు దొరికే నర్సరీలు, బుకింగ్ చేసుకునే సదుపాయాలను కల్పించాలి. రైతులకు సహకార శాఖ, మత్స్య శాఖలు అందించే సేవలను యాప్ ద్వారా అందుబాటులోకి తీసుకురావాలి. చేపలు, రొయ్యల ధరలు ప్రతి రోజూ అందుబాటులో వుంచడం ద్వారా రైతుకు మేలు జరుగుతుంది. సహకార శాఖను అనుసంధానం చేయడం ద్వారా రైతులకు లభించే రుణాలు, వాటిపై ప్రభుత్వం అందించే వడ్డీ రాయితీ వివరాలు కూడా యాప్ ద్వారా తెలుసుకునే వీలు కల్పించాలి.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.