
* క్రియాశీలక సభ్యత్వాలు పార్టీకి ప్రతిష్టాత్మకం
* సాధ్యమైనన్ని ఎక్కువ నమోదు చేసి శ్రీ పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇద్దాం
* ఉత్తరాంధ్ర నాయకులతో వర్చువల్ సమావేశంలో ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు
జనసేన సభ్యత్వాలు నమోదు చేసే “సాధక్”లకు స్థానికంగా ఉండే నాయకులు, ప్రజా ప్రతినిధులు సహకరించాలని శాసన మండలి సభ్యులు శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. ఆదివారం జరిగిన వర్చువల్ సమావేశంలో ఉత్తరాంధ్ర పార్టీ ప్రతినిధులతో ఎమ్మెల్సీ శ్రీ కె. నాగబాబు గారు మాట్లాడారు. జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ తాళ్లూరి రామ్, ఉత్తరాంధ్రకు చెందిన ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పీఏసీ సభ్యులు, వివిధ విభాగాల చైర్మన్లు, రాష్ట్ర కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, వీర మహిళ విభాగం రీజియన్ కో ఆర్డినేటర్లు, నియోజకవర్గాల ఇంచార్జీలు, పీఓసీలు, కార్పొరేటర్లు, ఎంపీటీసీలు, సర్పంచులు, మండల అధ్యక్షులు, ఆయా విభాగాల డైరెక్టర్లు, కేంద్ర కార్యాలయం ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ ఏడాది క్రియాశీలక సభ్యత్వాలు పార్టీకి అత్యంత ప్రతిష్టాత్మకమని, సాధ్యమైనంత ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు నమోదు చేసి అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇద్దామనే అభిప్రాయాన్ని శ్రీ కె. నాగబాబు గారు వ్యక్తం చేశారు. సభ్యత్వ నమోదు తేదీని పొడిగించే ప్రయత్నం కూడా చేస్తున్నామని అన్నారు. గతంలో చేసిన సభ్యత్వాలు రెన్యువల్ చేసే విషయంలో చొరవ తీసుకోవాలని, ఎక్కువ సంఖ్యలో టార్గెట్ పెట్టుకోవడం ద్వారా ఆశించిన ఫలితాలు వస్తాయని అన్నారు. పార్టీ ఆవిర్భావం నుండి అత్యంత క్రియశీలక పాత్ర పోషిస్తున్న మహిళలకు సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. త్వరలో ఉత్తరాంధ్రలో పర్యటించి సభ్యత్వ నమోదు సంఖ్య పెంపొందించేందుకు నా వంతు కృషి చేస్తానని శ్రీ కె. నాగబాబు గారు వెల్లడించారు.