

• తన శాఖల పరిధిలో నియోజకవర్గాలవారీగా చేపట్టిన అభివృద్ధి పనులతో బుక్ లెట్లు సిద్ధం చేసిన ఉప ముఖ్యమంత్రి
• అసెంబ్లీలో స్పీకర్, మంత్రులు, ఎమ్మెల్యేలకు బుక్ లెట్ లు అందజేసిన శ్రీ పవన్ కళ్యాణ్
• తొలి ప్రతిని శాసనసభ స్పీకర్ శ్రీ అయ్యన్నపాత్రుడికి అందజేసిన శ్రీ పవన్ కళ్యాణ్
• స్పీకర్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు రూ. 312 కోట్లు మంజూరు
• ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంకి రూ. 487 కోట్ల కేటాయింపులు
* పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం
* పల్లెల అభివృద్ధి… పచ్చదనం పెంపు… పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా ముందుకు సాగుతున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి త్వరలో రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న క్రమంలో తన పరిధిలోని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ పర్యావరణ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ద్వారా చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలతో ప్రత్యేక బుక్ లెట్ ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆవిష్కరించారు. నియోజక వర్గాలవారీగా నిధుల కేటాయింపు, పనుల పురోగతిని వివరించే నివేదిక పుస్తక రూపంలో రూపొందించి సంబంధిత నియోజక వర్గాల ఎమ్మెల్యేలకు అందజేసే కార్యక్రమం మొదలైంది. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిధులు మంజూరు చేసిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో… పల్లెల అభివృద్ధి… పచ్చదనం పెంపు… పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, ఆర్ డబ్ల్యూ ఎస్ అండ్ ఎస్, అటవీ పర్యావరణ శాఖలను ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముందుకు తీసుకువెళ్తున్నారు. శుక్రవారం శాసనసభలో ఈ బుక్ లెట్ ను మంత్రులు, ఎమ్మెల్యేలకు స్వయంగా అందజేశారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పల్లెపండగ 1.0, పల్లెపండగ 2.0, సాస్కీ తదితర పథకాల ద్వారా గ్రామాల్లో వేసిన సిమెంటు రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్, నీటి తొట్టెల వివరాలు, జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన రక్షిత మంచినీటి పథకాల వివరాలు పొందుపరిచారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు నియోజకవర్గాల వారీగా పంచాయతీలకు ఎంత మొత్తం విడుదల చేశామన్న అంశాన్ని కూడా బుక్ లెట్ లో పొందుపరిచారు. కూటమి పక్షాల ఎమ్మెల్యేలు మాత్రమే కాకుండా వైసీపీ విజయం సాధించిన 11 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులకు చేసిన కేటాయింపులకు కూడా పుస్తకరూపం ఇచ్చారు.
• స్పీకర్ శ్రీ అయ్యన్న పాత్రుడికి తొలి ప్రతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పేరిట రూపొందించిన ఈ బుక్ లెట్ తొలి ప్రతిని గౌరవ అసెంబ్లీ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్నపాత్రుడు గారికి అందజేశారు. అసెంబ్లీ ప్రాంగణంలోని స్పీకర్ ఛాంబర్ కు స్వయంగా వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, ఆయన నియోజకవర్గం నర్సీపట్నం పరిధిలో రూ. 312 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను వివరించారు. పల్లెపండగ 1.0కి రూ. 36.21 కోట్లు, పల్లెపండగ 2.0 ద్వారా రూ. 58.85 కోట్లు ఖర్చు చేసి సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, గోకులాలు, ఫారం పాండ్స్ తదితర అభివృద్ధి పనులు చేపట్టినట్టు తెలియజేశారు. జల్ జీవన్ మిషన్ కింద రూ. 43.83 కోట్లతో పనులు చేపట్టినట్టు, 15వ ఆర్ధిక సంఘం నిధులు మరో రూ. 173.53 కోట్లు విడుదల చేసినట్టు తెలిపారు. మలి ప్రతిని రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అందజేశారు. తెనాలి నియోజకవర్గం పరిధిలో మొత్తం రూ. 168 కోట్లుతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు వివరించారు. అందులో పల్లెపండగ 1.0 కింద రూ. 3.80 కోట్లతో 37 సీసీ రోడ్లు, 44 గోకులాలు, 4 ఫారం పాండ్స్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్టు తెలిపారు. అనంతరం అసెంబ్లీలోని తన ఛాంబర్ లో జనసేన ఎమ్మెల్యేలకు ప్రతులు అందజేశారు.
• ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో అభివృద్ధి పనులకు రూ. 487 కోట్లు
గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గం పరిధిలో రూ.487 కోట్ల విలువ చేసే అభివృద్ధి పనులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి శాఖల ద్వారా చేపట్టారు. అందులో పల్లెపండగ 1.0 ద్వారా రూ. 46.71 కోట్లు ఖర్చు చేశారు. పల్లెపండగ 2.0కి రూ. 138 కోట్లు, జల్ జీవన్ మిషన్ పనులకు రూ. 7.12 కోట్లు వెచ్చించారు. 15వ ఆర్ధిక సంఘం నిధులు రూ. 185.89 కోట్లు ఆ నియోజకవర్గ పరిధిలో పంచాయతీలకు బదిలీ చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణానికి మరో రూ. 110 కోట్లు ఇచ్చారు. ఈ ప్రక్రియలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తూ గిరిజన ప్రాంతాల్లోని నియోజకవర్గాలకు అత్యధికంగా కేటాయింపులు చేశారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన తొలి మాసాల్లోనే రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 13,326 పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి అభివృద్ధి పనులకు తీర్మానాలు చేయించారు. పల్లె పండగ 1.0 ద్వారా రూ. 4,500 కోట్ల నిధులతో గ్రామాల్లో 4,000 కిలోమీటర్ల అంతర్గత రహదారులు, 22,514 మినీ గోకులాలు, 1,02,000 ఫారం పాండ్స్, 15,000 నీటి తొట్టెల నిర్మాణం చేపట్టారు. 65 వేల ఎకరాల్లో పండ్ల తోటలు నాటించారు. పల్లెపండగ 2.0లో రూ. 5,715 కోట్ల నిధులతో గ్రామాల్లో 8,000 కిలోమీటర్ల మేర రోడ్లు, 15,000 మినీ గోకులాలు, 58 కిలోమీటర్ల మ్యాజిక్ డ్రెయిన్లు, ఫారం పాండ్స్, నీటితొట్టెల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు నాటే ప్రక్రియ పూర్తి చేశారు. రూ. 2,123 కోట్ల సాస్కీ నిధులుతో 4,122 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. అడవితల్లిబాట కార్యక్రమం ద్వారా రూ. 1,005 కోట్ల నిధులుతో గిరిజన గ్రామాల్లో 1,021 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టారు. తద్వారా 625 ఆవాసాలకు తొలిసారి రోడ్ల సౌకర్యం కల్పించనున్నారు. అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్, 50 శాతం గ్రీన్ కవర్ ప్రాజెక్టులతో పాటు మానవ వన్యప్రాణి సంఘర్షణను నివారించేందుకు హనుమాన్ లాంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకువెళ్తున్నారు.