
• పోరాట పటిమ… సంస్కృతి సంప్రదాయాల శక్తి నింపుకున్న తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక పాదాభివందనం
తెలంగాణలో ఉద్భవించిన పార్టీ జనసేన. ఈ రోజు విజయలక్ష్మి రూపంలో తొలి అడుగుపడింది అని జనసేన అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ తొలినాళ్ళు గుర్తు చేసుకొంటే – దారంతా గతుకులు… భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న. చిన్నపాటి ఆసరా కూడా లేదు. అయినా మిణుకుమిణుకుమనే ఆశ. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన- వీర మహిళలు ఝాన్సీ లక్ష్మీ భాయి స్ఫూర్తిని నింపుకొని… ఉద్యమ స్ఫూర్తితో జనసైనికులు ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకొనేందుకు సంసిద్ధులయ్యారు. తెలంగాణలోని వీర మహిళలు, జనసైనికులు పురపాలక ఎన్నికలకు సన్నద్ధమయ్యారు. 2998 స్థానాలున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనసేన 332 చోట్ల పోటీ చేసింది. ఒక కౌన్సిలర్ స్థానం, ఒక కార్పొరేటర్ స్థానం జనసేనకు దక్కాయి. మహా వృక్షమైనా చిన్న విత్తు నుంచే నేల పొరలను చీల్చుకొని మొలక వేస్తుంది. విశ్వ విజేత కూడా తల్లి గర్భంలో అణువంతే ఉంటాడు. కోటి రతనాల వీణ తెలంగాణలో జనసేన విజయ ప్రయాణం లేలేత అడుగులతో మొదలైంది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో శ్రీమతి ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాల కార్పొరేషన్ లో శ్రీ అగ్గు సాగర్ జనసేన అభ్యర్థులుగా సాధించిన విజయాలు భవిష్యత్తు ప్రస్థానానికి బలమైన స్ఫూర్తిని అందిస్తాయి. శ్రీమతి విజయలక్ష్మి, శ్రీ సాగర్ లకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలియచేస్తున్నాను. జనసేన తెలంగాణ వీర మహిళలు, జనసేన సైనికులు, నాయకులకు అభినందనలు. పార్టీ ఉద్భవించిన నేలపై దక్కిన తొలి విజయం ఇది. పోరాట పటిమను… సంస్కృతి సంప్రదాయాల శక్తిని… సాహితీ సౌరభాన్ని… అణువణువునా నింపుకున్న తెలంగాణ నేల తల్లికి హృదయపూర్వక పాదాభివందనాలు అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.