
• భవిష్యత్తు కార్యాచరణ, ప్రజా పోరాటాలే అజెండా
• నవంబర్ 1 నుంచి ఇంటింటికీ ఉమ్మడి మేనిఫెస్టో
• జిల్లా అధ్యక్షులతో టెలీ కాన్ఫరెన్స్ లో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
రాజమండ్రిల జరిగిన జనసేన – టీడీపీ సమన్వయ సమావేశం నిర్ణయం మేరకు 29, 30, 31 తేదీల్లో జిల్లా
స్థాయిలో ఇరు పార్టీల సమన్వయ సమావేశాలు ఏర్పాటు చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్
శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. పార్టీ తరఫున ఆయా జిల్లాల పరిధిలోని ఇంఛార్జులతో పాటు రాష్ట్ర కమిటీ
సభ్యులు, ముఖ్య నాయకులు 50 మంది సమావేశంలో పాల్గొనే విధంగా కార్యాచరణ రూపొందించినట్టు తెలిపారు. జిల్లా
స్థాయి జనసేన – టీడీపీ సమన్వయ సమావేశాలు విజయవంతం చేసేందుకు కలసికట్టుగా కృషి చేయాలని సూచించారు.
గురువారం జనసేన పార్టీ జిల్లాల అధ్యక్షులతో కాల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ మనోహర్ గారు జిల్లా
స్థాయి సమన్వయ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్ధేశం చేశారు. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ
“జనసేన – టీడీపీ సమన్వయ కమిటీ సమావేశాలు సుహృద్భావ వాతావరణం మధ్య నిర్వహించుకోవాలి. ఒకరికి ఒకరు
పరిచయం చేసుకోవడంతోపాటు భవిష్యత్తు ప్రజా పోరాటాలు, ఆందోళనల్లో కలసికట్టుగా ముందుకు వెళ్లే విధంగా
ప్రణాళికాబద్ధమైన కార్యాచరణ రూపొందించుకోవాలి. నవంబర్ 1వ తేదీ నాటికి ఉమ్మడి మేనిఫెస్టోసిద్ధం అవుతుంది.
జనసేన పార్టీ షణ్ముఖ వ్యూహంతో పాటు టీడీపీ సూపర్ సిక్స్ లో ప్రకటించిన అంశాలను కలిపి ఉమ్మడి మ్యానిఫెస్టో
రూపొందిస్తున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు, శ్రీ చంద్రబాబు నాయుడు గారి సంతకాలతో ముద్రించిన కరపత్రాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.
• వాళ్ల ఉచ్చులో పడొద్దు
రెండు పార్టీలు కలవకూడదన్నఉద్దేశంతో ప్రత్యర్థి పార్టీ వ్యక్తులు కుట్రలు పన్నుతున్నారు. వారి ప్రచారం, అనుచిత వ్యాఖ్యల ఉచ్చులో పడవద్దు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తిన
అంశాలను మాత్రమే ముందుకు తీసుకువెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీతో కలసి వెళ్లాలని నిర్ణయించుకున్నాం. రాష్ట్ర శ్రేయస్సుని దృష్టిలో పెట్టుకునే శ్రీ పవన్ కళ్యాణ్ గారు
ఈ నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ కూడా కలసి రావాలని కోరుకుంటున్నాం. జనసేన పార్టీ వరకు మన కార్యాచరణ స్పష్టంగా ఉంది. మొదటి అంశంగా రైతులు తీవ్రమైన నీటి కొరత
సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. క్షేత్ర స్థాయిలో రైతుల వద్దకు వెళ్లి ఫీల్డు రిపోర్టులు ఎలా సిద్ధం చేయాలి అనే అంశం మీద కార్యాచరణ రూపొందిస్తున్నాం. భవిష్యత్తులో సమస్యలపై
కలసి ముందుకు వెళ్లే అంశం మీద దృష్టి సారించాలి” అన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్స్ లో వివిధ జిల్లాల అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, శ్రీ కొటికలపూడి గోవిందరావు, శ్రీ పంచకర్ల రమేష్
బాబు, శ్రీ షేక్ రియాజ్, డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, శ్రీ టి.సి. వరుణ్, శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీ బండ్రెడ్డిరామకృష్ణ, శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు.
• అయిదు జిల్లాలకు సమన్వయకర్తలు
జిల్లా అధ్యక్షుల నియామకం చేపట్టని అయిదు జిల్లాలకి ఈ సమావేశాల నిమిత్తం సీనియర్ నాయకులను కో ఆర్డినేటర్లుగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం
తీసుకున్నారు. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాకు శ్రీమతి పాలవలస యశస్వి, ఉమ్మడి విజయనగరం జిల్లా శ్రీమతి లోకం నాగమాధవి, ఉమ్మడి కడప జిల్లా శ్రీ సుంకర శ్రీనివాస్, ఉమ్మడి
కర్నూలు జిల్లా శ్రీ చింతా సురేష్.. విశాఖ అర్బన్ కి శ్రీ కోన తాతారావు కో ఆర్డినేషన్ బాధ్యతలు చూస్తారు.