

* చెప్పులు, బూట్లు వేసుకొని శ్రీవారి చిత్రపటాలతో నిరసన తెలపడం అనైతికం
* ఫోటోలను ప్లకార్డులా వాడి విసిరేయడం క్షమించరాని పాపం
* హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తించిన తీరుపై మండలి ఛైర్మన్ చర్యలు తీసుకోవాలి
* వైసీపీ తీరును హిందూ సమాజం ఖండించాలి
* అసెంబ్లీ మీడియా పాయింట్ లో మాట్లాడిన ప్రభుత్వ విప్ శ్రీ బొమ్మిడి నాయకర్
‘శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు మహారాధానికి పాల్పడ్డారు. చెప్పులు, బూట్లు వేసుకొని శ్రీవారి చిత్రపటాలను తీసుకెళ్లడమే కాకుండా… వాటిని ప్లకార్డుల మాదిరిగా వాడటం, వాటిని విసిరేసి మహా పాపానికి ఒడిగట్టార’ని ప్రభుత్వ విప్, నరసాపురం శాసనసభ్యులు శ్రీ బొమ్మడి నాయకర్ గారు ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రవర్తించిన వైసీపీ పార్టీ ప్రజా క్షేత్రంలో ఉండే అర్హత కోల్పోయిందని మండిపడ్డారు. వాళ్లకు దేవుడంటే భయం, భక్తి లేదని, ప్రజల ధార్మిక విశ్వాసాలపై అసలు గౌరవమే లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ అనైతిక తీరుపై మండలి ఛైర్మన్ శ్రీ కొయ్యే మోషేన్ రాజు గారికి ఫిర్యాదు చేశామని, స్వామివారి ఫోటోలతో రాజకీయo చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరామని వెల్లడించారు. శుక్రవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద ప్రభుత్వ విప్, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారితో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ బొమ్మిడి నాయకర్ గారు మాట్లాడుతూ “చెప్పులు, బూట్లు వేసుకొని స్వామి వారి ఫోటోలతో వైసీపీ ఎమ్మెల్సీలు నిరసనకు దిగడం మహాపాపం. వైసీపీ అధినేత జగన్ కళ్ళలో ఆనందం కోసం వారు ఈ విధంగా ప్రవర్తించడం అత్యంత దారుణం. జగన్ కు, ఆయన కుటుంబానికి హిందూ ధర్మం అన్నా, దేవుళ్ళన్నా గౌరవం లేదు. మండలిలో స్వామివారి చిత్ర పటాలను విసిరికొట్టడం దుర్మార్గం. హిందువుల మనోభావాలు దెబ్బ తీసేలా వైసీపీ చర్యలు ఉన్నాయి. హిందూ సమాజానికి జగన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలి. హిందూ సమాజం వైసీపీ చర్యలను తీవ్రంగా ఖండించాలి.
తిరుమలను జగన్ ఏనాడూ పవిత్ర క్షేత్రంగా చూడలేదు
వైఎస్సార్ హయాంలో భూమన కరుణాకరరెడ్డి అనే నాస్తికుడు, హిందూ ద్వేషిని టీటీడీ ఛైర్మన్ గా చేసి ద్రోహం చేశారు. ఆ ద్రోహాన్నే మరోమారు జగన్ చేశారు. భూమన ఇంట్లో అన్యమత సంప్రదాయాలు పాటిస్తారు. భూమన కుమార్తె వివాహం అన్యమత విధానాల ప్రకారం జరిగింది. తిరుమలలో అపవిత్ర కార్యకలాపాలకు, అన్యమత ప్రచారాలకు మద్దతు ఇచ్చిన వ్యక్తులు వైఎస్సార్, జగన్. ఇప్పుడు అన్నీ అబద్దాలు చెబుతున్నారు.
మా నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.. మాకు అన్ని మతాలను గౌరవించాలని చెప్పారు. అదే సమయంలో మన ధర్మాన్ని కాపాడేందుకు బలంగా నిలబడాలని చెప్పారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి ధర్మాన్ని గౌరవిస్తారు కాబట్టే పొరుగున మహారాష్ట్రలో సిక్కులు తమ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఆ విశ్వాసాల పట్ల తన గౌరవాన్ని వ్యక్తం చేశారు. ఎన్నో మసీదులకు విరాళాలు ఇచ్చారు.
పెన్షన్లపై వైసీపీది కాకిగోల
పెన్షన్లు తగ్గించేశారు అని వైసీపీ నాయకులు గోల చేస్తున్నారు. వైసీపీ హయాంలో వెయ్యి రూపాయలు పెన్షన్ పెంచడానికి ఐదేళ్లు పట్టింది. అదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి వెయ్యి పెంచి ఇచ్చాము. పెన్షన్లపై నానా యాగి చేస్తున్న వైసీపీ నాయకులు ఒకసారి ప్రతి నెలా 1వ తేదీన వీధుల్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది. పెన్షన్లు ఏ విధంగా పక్కాగా పంపిణీ చేస్తున్నారో.. దేశంలో ఎక్కడా లేని విధంగా అత్యధిక పెన్షన్ మొత్తాన్ని అందిస్తోంది కూటమి ప్రభుత్వం. రూ.4 వేలు నుంచి రూ.15 వేలు వరకూ పెన్షన్ అందిస్తోంది. ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పెన్షన్ అందిస్తున్నారు.
చట్ట సభలు అంటే వైసీపీకి గౌరవం లేదు
చట్ట సభలంటే వైసీపీ నాయకులకు అసలు గౌరవమే లేదు. మనల్ని ప్రజలు గెలిపించింది అసెంబ్లీలోకి వెళ్లి ప్రజా సమస్యలపై చర్చలు చేసి సమస్యలు పరిష్కరించడానికి. మా కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన చేయడమే కాకుండా… ప్రజలకు జవాబుదారీగా ఉంటుంది కాబట్టే బాధ్యతగా అసెంబ్లీలో జరుగుతున్న చర్చలకు హాజరవుతున్నాము. వైసీపీ నాయకులకు ఆ బాధ్యత లేదు కాబట్టి అసెంబ్లీలో జరుగుతున్న చర్చలకు రావడం లేదు. గవర్నర్ ప్రసంగం సమయంలోనూ కాగితాలు చింపుతూ, పోడియం వద్ద నిరసనలు తెలిపి వైసీపీ నాయకులు సభను అగౌరవ పరిచార”న్నారు.