పిఠాపురం నియోజకవర్గ పట్టణాభివృద్ధికి సమగ్ర ప్రణాళిక

* పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీల్లో చేయాల్సిన పనుల గుర్తింపు
* గత పర్యటనలో శ్రీ పవన్ కళ్యాణ్ దృష్టికొచ్చిన సమస్యలను పరిశీలించిన పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ అధికారుల బృందం
* ఉప ముఖ్యమంత్రి సూచనలతో నియోజకవర్గంలో విస్తృత పర్యటన
* ప్రాధాన్యాలవారీగా త్వరలో అభివృద్ధి పనులు ప్రారంభం

పిఠాపురం నియోజకవర్గంలోని పిఠాపురం మున్సిపాలిటీ , గొల్లప్రోలు నగర పంచాయతీల సమగ్రాభివృద్ధికి ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రణాళికలు సిద్ధం చేయిస్తున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చేలా, పెండింగ్ లో ఉన్న పనులను పట్టాలెక్కించేలా ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. పారిశుద్ధ్యం, ముంపు సమస్య, సౌకర్యాల కల్పన, స్థానిక సంస్థల ఆదాయం పెంపు, మౌలిక వసతుల కల్పన మీద ప్రధానంగా దృష్టి సారించారు. దీనికి సంబంధించి క్షేత్రస్థాయి పరిస్థితులను స్వయంగా పరిశీలించేందుకు, అవసరం అయిన పనులను గుర్తించేందుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు మంగళవారం క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. అందుబాటులో ఉన్న అవకాశాలను ఉపయోగించుకొని స్థానిక సంస్థలకు ఆర్థిక బలం చేకూర్చడం, అభివృద్ధి పనులను వివిధ పథకాల నిధులతో అనుసంధానం చేసి మొదలుపెట్టేందుకు ఉన్న అవకాశాలపై అధికారులు సమగ్ర అధ్యయనం చేశారు. పిఠాపురం మున్సిపాలిటీ, గొల్లప్రోలు నగర పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు, పనులను ప్రాధాన్యతలను తెలుసుకున్నారు.
• ఏలేరు కాలువ సమస్య పరిశీలన
పిఠాపురం నియోజకవర్గంలో ఏలేరు కాలువ మూడు పాయలుగా విడిపోయి ప్రవహిస్తోంది. దీనిలో ప్రధానంగా చెరుకుల కాలువ ముంపు సమస్య అధికంగా ఉంది. సంక్రాంతి సంబరాల కోసం జనవరి 10వ తేదీన పిఠాపురంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నియోజకవర్గ ప్రజలు క్షేత్రస్థాయిలో చెరుకుల కాలువ ముంపు గురించి తెలియజేశారు. కాలువ స్వరూపం పరిశీలించి, సమస్యను అర్ధం చేసుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమస్యకు పరిష్కారం వెతకాలని మున్సిపల్, అర్బన్ డవలప్మెంట్ అధికారులకు సూచనలు చేశారు. దీంతో ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రణాళికలు రూపొందుతున్నాయి. ప్రత్యేకంగా కల్వర్టు నిర్మాణం చేయడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చని, అయితే ఇక్కడే రైల్వే పై వంతెన నిర్మాణానికి ప్రతిపాదనలు ఉన్న దృష్ట్యా మరో ప్రత్యామ్నయం కూడా ఆలోచించేలా అధికారులు ప్రణాళిక వేస్తున్నారు.
• మురుగు నీటి ట్రీట్మెంట్ ప్లాంట్లను ముందుకు తీసుకెళ్లేలా…
పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో రెండు మురుగు నీటి ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉన్నాయి. లారీల యార్డు, మసీదు మన్యం ప్రాంతాల్లో మురుగునీటి ట్రీట్మెంట్ ప్లాంట్లను ప్రతిపాదించారు. స్థలం అందుబాటులో ఉన్నప్పటికీ గత ప్రభుత్వంలో ఈ పనులు ముందుకు సాగలేదు. నిధులు రాలేదు. వీటిని మళ్లీ మొదలుపెట్టేలా, పిఠాపురం పట్టణ మురుగునీటిని శుద్ధి చేసేందుకు వినియోగించేలా నిర్మించాలని అంచనాలు రూపొందిస్తున్నారు. దీంతోపాటు ఆర్ఆర్బీబీహెచ్ఆర్ కళాశాల స్థలంలో మధ్యలో నిలిచిపోయిన ఇండోర్ స్టేడియం నిర్మాణ పనులను అధికారుల బృందం పరిశీలించింది. పనులు జరిగిన తీరు, నిధుల లభ్యత, మళ్లీ ఖేలో ఇండియా పథకంలో స్టేడియం నిర్మించేందుకు ఉన్న అవకాశాలను చర్చించారు. అనంతరం తుక్కుపోగుల మున్సిపల్ సైట్ పరిశీలించి అక్కడ నగరవనానికి అనుసంధానంగా మున్సిపల్ ఆదాయం వచ్చేలా మున్సిపల్ స్థలంలో షాపింగ్ క్లాంప్లెక్స్ నిర్మాణం గురించి ప్రతిపాదనలు చేశారు. అనంతరం పలు కూడళ్లను పరిశీలించి వెడల్పు చేసేందుకు ఉన్న అవకాశాలు, ఆయా ప్రాంతాల్లో మున్సిపల్ కాంప్లెక్సుల నిర్మాణం వల్ల మున్సిపాలిటీకి పెరిగే ఆదాయం మీద అంచనాలు రూపొందించారు.
• గొల్లప్రోలుకు డంపింగ్ యార్డు సమస్య కీలకం
నగర పంచాయతీగా ఉన్న గొల్లప్రోలు నగర పంచాయతీకి డంపింగ్ యార్డు సమస్య వేధిస్తోందని అధికారుల బృందం గుర్తించింది. దీంతోపాటు నగర పంచాయతీ భవనం పూర్తిగా శిథిలావస్థలో చేరుకున్న వైనాన్ని స్వయంగా పరిశీలించారు. నగర పంచాయతీకి చాలా ఏళ్లుగా డంపింగ్ యార్డు సమస్య ఉందని స్థానిక అధికారులు తెలిపారు. నగర పంచాయతీకి స్థలాల లభ్యత సమస్య ఉందని, దీంతో ప్రైవేటు వ్యక్తుల నుంచి డంపింగ్ యార్డు కోసం స్థలం కొనుగోలుకు సుమారు రూ.2.50 కోట్ల నిధులు అవసరం అవుతాయని చెప్పారు. ప్రస్తుతం పిఠాపురం మున్సిపాలిటీ స్థలంలో చెత్త పారబోత చేస్తున్నామని, ఆయిల్ కు నిధులు చాలా అవుతున్నాయని వాపోయారు. స్థల కొనుగోలు విషయాన్ని ఉన్నతాధికారులకు ప్రత్యేకంగా తెలియజేస్తామని, అలాగే ఇతర శాఖల అందుబాటులో ఉంటే ఆ వివరాలు అందించాలని మున్సిపల్, అర్బన్ డవలప్మెంట్ అధికారులు కోరారు. గొల్లప్రోలు చెరువుకు ఆనుకొని షాపింగ్ క్లాంప్లెంక్స్ నిర్మాణం చేస్తే ఎలా ఉంటుందని ఆరా తీశారు. రోడ్లు, పార్కులు, డ్రైన్ల నిర్మాణం మీద ప్రతిపాదనలు సిద్ధం చేయాలని స్థానిక అధికారులకు సూచించారు.
రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల అధికారులు మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలు, గుర్తించిన పనులు, ఆయా ప్రాంతాల్లో చేయాల్సిన అభివృద్ధి విషయాల మీద సమీక్షించేందుకు బుధవారం రాష్ట్ర మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ సంచాలకులు డాక్టర్ సంపత్ గారు స్వయంగా పిఠాపురం రానున్నారు. ‘‘పాడ’’ కార్యాలయంలో జరిగే ఈ సమీక్షకు పిఠాపురం, గొల్లప్రోలు మున్సిపాలిటీల అధికారులు, సిబ్బంది హాజరుకానున్నారు. మున్సిపాలిటీ, నగర పంచాయతీలో చేయాల్సిన పనులు, వాటి ప్రాధాన్యం, నిధుల కేటాయింపు, ఆదాయ అర్జన మీద డైరెక్టర్ సమీక్షించి దిశానిర్దేశం చేయనున్నారు. ముందుగా ఏ పనులను మొదలుపెట్టాలి.. వాటి ప్రాధాన్యం మీద సమీక్షలో అధికారుల వివరణ తీసుకోనున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలను, చేయాల్సిన పనులను మున్సిపల్, అర్బన్ డెవలప్మెంట్ అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా డైరక్టర్ కు వివరించనున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.