పాలక మండళ్లు బాధ్యతగా ఉంటే ఆలయాల్లో అపచారాలు జరగవు

• గత పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తిరుమలలో అపచారాలు జరిగేవి కాదు
• గతంలో జరిగిన తప్పులు పునరావృతం కారాదు
• ⁠రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాలి
• కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ది, ధర్మ పరిరక్షణకు కట్టుబడి ఉంటుంది
• శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గాన్ని వర్చువల్ గా ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్

పాలక మండళ్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహిస్తే దేవాలయాల్లో అపచారాలు జరగవని, రాజకీయాలకు అతీతంగా దేవాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పాలక మండళ్లపై ఉందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో తిరుమలలోనే ఎన్నో అపచారాలు జరిగాయన్నారు. నాటి పాలక మండలి బాధ్యతగా వ్యవహరిస్తే తప్పులు జరిగేవి కాదని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఆలయ పాలక మండళ్లు గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు, అపచారాలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. నూతనంగా నిర్మించిన శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ రోడ్డును వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ గా శుక్రవారం ఉదయం ప్రారంభించారు. సుమారు రూ. 10 కోట్ల అంచనా వ్యయంతో గిరి ప్రదక్షణ రోడ్డును నిర్మించారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీ ఆనం రామనారాయణరెడ్డి గారు, శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బొజ్జల సుధీర్ రెడ్డి గారు, తిరుపతి ఎమ్మెల్యే శ్రీ ఆరణి శ్రీనివాసులు గారు, దేవాదాయ శాఖ కార్యదర్శి డాక్టర్ హరి జవహర్ లాల్ గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “మన ఆలయాలు నాగరికతకు చిహ్నాలు. మన కళలు, మన వారసత్వం, మన సంస్కృతి, ధర్మ పరిరక్షణ ఆలయాలతో ముడిపడి ఉన్నాయి. అరుణాచలంలో గిరిప్రదక్షణ చేస్తారు అని తెలుసు. నాకు గిరిప్రదక్షణ చేయాలని చాలా కోరిక ఉంది. దేవాదాయ మంత్రి శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారి ఆహ్వానం మేరకు, భక్తుల కోరిక మేరకు త్వరలో శ్రీకాళహస్తి క్షేత్రాన్ని సందర్శించి కచ్చితంగా స్వామి, అమ్మవార్లను దర్శించుకుంటాను. శివరాత్రికి రెండు రోజుల ముందు ఈ శ్రీకాళహస్తి గిరి ప్రదక్షణ మార్గాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉంది. గత ప్రభుత్వం ఆలయాల పరిరక్షణ అంశాన్ని చాలా నిర్లక్ష్యం చేసింది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత దేవాదాయ మంత్రిగా శ్రీ రామనారాయణ రెడ్డి గారు బాధ్యతలు స్వీకరించాక ఆలయాల పరిరక్షణను ఎంతో బాధ్యతగా ముందుకు తీసుకువెళ్తున్నాం. నిరాదరణకు గురైన ఎన్నో ఆలయాలను అభివృద్ధి చేస్తున్నారు. భక్తులు కోరుకుంటే ఏజెన్సీలో కూడా ఆలయాలు నిర్మించాలన్న ఆయన గొప్ప సంకల్పానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
• శివరాత్రి తర్వాత గిరిప్రదక్షణ మార్గంలో మొక్కలు నాటుతాం
శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ మార్గంలో గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రూ. 10 కోట్లు వెచ్చించి సిమెంటు రోడ్డు నిర్మించాం. 22 కిలోమీటర్ల గిరి ప్రదక్షణ మార్గాన్ని మరింత ఆహ్లాదకరంగా తీర్చిదిద్దే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. అటవీ శాఖ ఆధ్వర్యంలో గిరిప్రదక్షణ మార్గానికి ఇరు వైపులా మొక్కలు నాటే కార్యక్రమానికి శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం శ్రీకారం చుట్టబోతున్నాం. శ్రీకాళహస్తి గిరిప్రదక్షణ ద్వారా ప్రతి భక్తుడికి కైలాసగిరి ప్రదక్షణ చేసిన ఫుణ్యఫలం దక్కాలని ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
• రూ. 40 కోట్లతో 22 ప్రధాన ఆలయాలకు రోడ్లు
గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గ నిర్దేశకత్వంలో, ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతి అడుగులో మన సనాతన ధర్మ ఔన్నత్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేస్తూ.. ఆలయాలు, ఆలయాలకు వెళ్లే రోడ్లను అభివృద్ధి చేస్తున్నాం. ఆ ప్రక్రియలో భాగంగా దేవాదాయశాఖ సహకారంతో ఏలూరు జిల్లా ఐ.ఎస్. జగన్నాథపురంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉన్న కొండపైకి వెళ్లే ఘాట్ రోడ్డు రూ. 3 కోట్ల 70 లక్షల వ్యయంతో నిర్మాణం చేపట్టాం. ప్రముఖ శైవ క్షేత్రం కోటప్పకొండ పరిసరాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టాం. ఇటీవల కోటప్పకొండ నుంచి కొత్తపాలెం గ్రామం వైపు వెళ్లే రోడ్డును సుమారు రూ. 4 కోట్లతో తో నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం. వాడపల్లి ఏడువారాల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్ధం గోదావరి కరకట్ట వెంబడి రోడ్డు నిర్మాణానికి రూ. 6 కోట్ల సాస్కీ నిధులు మంజూరు చేశాం. ఉపాధి హామీ పథకం, పంచాయతీరాజ్, సాస్కీ నిధులతో రూ. 40 కోట్లకు పైగా వెచ్చించి సుమారు 22 ప్రధాన దేవాలయాలకు రోడ్డు వసతి కల్పిస్తున్నాం. మరెన్నో చిన్న ఆలయాలకు రవాణా సౌకర్యాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నాం. నూతన శ్రీకాళహస్తి ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో అరుణాచలం మాదిరి ప్రతి పౌర్ణమికీ ప్రత్యేకంగా శ్రీకాళహస్తి కైలాసగిరి ప్రదక్షణ నిర్వహించాలని సూచిస్తున్నాం. కూటమి ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికీ, సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు కట్టుబడి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నుంచి వర్చువల్ గా తిరుపతి జిల్లా కలెక్టర్ శ్రీ వెంకటేశ్వర్లు, శ్రీకాళహస్తి ఆలయ పాలక మండలి ఛైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్, రాష్ట్ర హస్త కళల నైపుణ్యాభివృద్ధి సంస్థ ఛైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ కోలా ఆనంద్, తిరుపతి ఫారెస్ట్ కన్జర్వేటర్ శ్రీ సెల్వం, డీఎఫ్ఓ శ్రీ సాయిబాబా, శ్రీకాళహస్తి ఆలయ ఈవో శ్రీ బాపిరెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.