
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందటం శుభపరిణామని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో ఆనందం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఉభయ సభలు అమరావతికి చట్టబద్ధత కల్పించడంతో రాష్ట్ర ప్రజలందరూ సంబరాలు చేసుకొనే ఆనందకర తరుణం వచ్చింది. ఇకపై రాజధానిగా అమరావతి అజేయం. ఈ బిల్లుకు మద్దతు పలికిన పక్షాలకు, రాజ్యసభ సభ్యులకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఎవరో వచ్చి ఏదో చేస్తారు అనే అనవసర అపోహలను రాష్ట్ర ప్రజలందరూ విడిచిపెట్టేయాలి. రాష్ట్రానికి రాజధాని నగరం ఉండటమే ఇష్టం లేని వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను ప్రజాలెవరూ పట్టించుకోవలసిన అవసరం లేదు. అలాంటి వ్యాఖ్యల ద్వారా సదరు వ్యక్తుల నైజం మరోమారు బయటపడింది. అమరావతిలో అభివృద్ధి కార్యకలాపాలు ఇప్పటికే వేగవంతం అయ్యాయి. ఈ రాజధానిని ప్రతి ఒక్కరూ తమదిగా భావించే విధంగా తీర్చిదిద్దే బాధ్యతను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తీసుకొంది. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును ముందుకు తీసుకువెళ్లడంతోపాటు, రాజధాని నగర అభివృద్ధికి బలమైన తోడ్పాటు ఇస్తున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి, గౌరవ కేంద్ర హోమ్ శాఖామాత్యులు శ్రీ అమిత్ షా గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. పార్లమెంట్ ఉభయ సభల్లో అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు ఆమోదం తరుణంలో రాష్ట్రంలో కూటమి పక్షాలు చేసే సంబరాల్లో భాగస్వాములు కావాలని జనసేన నాయకులు, శ్రేణులకు పిలుపునిస్తున్నాను. మన రాజధాని అమరావతి కోసం తోడ్పాటు ఇచ్చిన శ్రీ నరేంద్ర మోదీ గారికి, అపార అనుభవంతో రాజధాని నిర్మాణాన్ని ముందుకు తీసుకువెళ్తున్న శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ప్రతి ఒక్కరూ తమ ఇళ్ల ముందు, పార్టీ కార్యాలయాల వద్ద దీపాలు వెలిగించాలని శ్రీ పవన్ కళ్యాణ్ కోరారు.