జగన్ గారిలా కూర్చోపెట్టి ముద్దులు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు – జనసేనాని…

పోలవరంలో నిర్వహించిన బహిరంగ సభలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రసంగం : 

* ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములకు, ఆడపడుచులకు హృదయపూర్వక నమస్కారములు..

* పోరాటయాత్రలో భాగంగా ఈరోజున మీ ముందుకు నేను పోలవరం వచ్చాను. పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు, 7 లక్షల ఎకరాకు సాగునీరును పోలవరం ప్రాజెక్టు అందిస్తుంది. 

* ఇక్కడికి వచ్చేముందు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల దగ్గరకు వెళ్ళాను. లక్షల మంది ప్రజలు నిర్వాసితులు అవుతుంటే వారికి రావాల్సిన నష్టపరిహారం రావట్లేదు. 

* ముఖ్యమంత్రి గాని, రాజకీయ నాయకులు గాని త్యాగాలకు సిద్దమవ్వమని ప్రజలకు చెప్తారు కానీ వారి జీవితాలను త్యాగం చెయ్యరు. 

* ప్రస్తుతం వున్న నిర్వాసితులు ప్రాజెక్టులకు వ్యతిరేకం కాదు కానీ వాళ్ళు మాకు న్యాయం చెయ్యమని కోరుకుంటున్నారు. 

* గతంలో వైస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో గల మైసూరా రెడ్డి గారి ఇల్లు రోడ్డు ఎక్స్టెన్షన్ లో కొట్టేశారు. అప్పుడు మైసూరా గారికి కోపం వచ్చి చిన్న తువాలు కట్టుకుని నా ఇల్లు కూల కొట్టేశారంటూ రోడ్డు మీదకు వచ్చి స్నానం చేశారు.

* మైసూరా లాంటి కోట్ల ఆస్థిపరులకే అంత కోపం వచ్చినప్పుడు తరతరాల నుండి ఇక్కడే ఉంటూ జీవన విధానం కొనసాగిస్తున్న వీరి ఇళ్లకు కరెంట్ ఆపేసి, ఇల్లులు కాళీ చేసెయ్యమంటే వీరికి ఎంత కోపం ఉంటుంది? 

* నిర్వాసితుల తరపున ఎవరూ మాట్లాడరు, ఇంతకముందు నేను వెళ్ళినప్పుడు నేను వారితో జనసేన పార్టీ పెట్టింది మీకు అండగా పోరాటం చెయ్యడానికి అని చెప్పాను. 

* నాకు కన్నీళ్లు వున్నాయి, మీ కష్టాల మీద ఆవేదన వుంది. రాబోయే తరాలకు అండగా నిలబడేందుకు..ఈ తరంలో దోచేస్తున్న రాజకీయనాయకులను నిలదీసేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. 

* రాజకీయాన్ని వ్యాపారం చేసేసారు, నా దగ్గర వేల కోట్లు లేవు. నా దగ్గర ఉన్నదల్లా మీ గుండెల్లో నా మీద ఉన్న ప్రేమ, అదే నా ఆస్థి.

* వేల కోట్లు వున్న వాళ్ళు ముఖ్యమంత్రులు అవ్వలేరు, లక్షల కోట్లు వున్నవాళ్లు ప్రధానమంత్రులు కాలేరు. వ్యవస్థ అవినీతితో నిండిపోయింది.

* దళిత భూములను కబ్జా చేసిన భూ బకాసూరుడు దెందులూరు ఎమ్మెల్యే మీద చర్య తీసుకోవాలంటూ నాకు కొంతమంది లేఖ ఇచ్చారు. రౌడీ ఇజం, దోపిడీ ఇజం ఉండకూడదని నేను ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలిపాను. కాని అసెంబ్లీలో ఎమ్మెల్యేలను క్రమ శిక్షణలో పెట్టాల్సిన ఒక ప్రభుత్వ విప్ ఎన్నో దౌర్జన్యాలు చేస్తుంటే మాట్లాడే వారు ఎవరూ లేరు. 

* ఈరోజున జనసేన పార్టీ లేకుంటే దెందులూరు ఎమ్మెల్యే లాంటి వారు ఊరుకి ఒకరు ఉండేవారు. దెందులూరు ఎమ్మెల్యే పోలీసులను, మహిళలను కొడతారు..కులం పేరుతో దూషిస్తారు..ఇవన్నీ తట్టుకోలేక ప్రజలు విసుగుపోయారు.

* ఈరోజున నేను 2019లో గెలవడానికో, ముఖ్యమంత్రి అవ్వడానికో రాలేదు..మీ తరపున పోరాటం చెయ్యడానికి వచ్చాను.

* పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు రోడ్లు వెయ్యమంటే మీరు ఎలాగూ బయటకి పోయేవారేగా మీకు రోడ్లు ఎందుకు అని అధికారులు అన్నారంట, అంటే ఈలోపల ఇక్కడ ప్రజలు చనిపోవాలా? 

* పంచాయితీ వ్యవస్థను ముఖ్యమంత్రి గారు నిర్వీర్యం చేస్తే, వాళ్ళ అబ్బాయి లోకేష్ గారు నిర్జీవ్యం(జీవం లేకుండా) చేసేసారు. సర్పంచులను తీసేసి, ఎన్నికలను పెట్టకుండా ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు? అలాంటప్పుడు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి అయిన లోకేష్ గారిని కూడా తీసేసి ప్రత్యేక అధికారిని నియమించండి. 

* పంచాయితీ ఎన్నికలు పెడితే జనసేన బలపడిపోతుంది, యువత నుండి కొత్త నాయకులు వస్తారు అని ఆలోచించి వాళ్ళు ఎన్నికలు పెట్టడం లేదు. నేను డబ్బును సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు, ప్రజలకు నా జీవితాన్ని ఇవ్వడానికి వచ్చాను. 

* నాలో ఆవేదన వుంది, కొన్ని లక్షల మంది రోడ్ల మీద పడిపోతూవుంటే..గిరిజన తెగల మీద గొడవలు పెట్టి, శ్మశానాలకు భూములు లేకుండా…భూమికి భూమి అని చెప్పి రాళ్ళ భూమి ఇచ్చారు…వీటన్నిటి మీద మాట్లాడే వారు ఒక్కరు కూడా లేరు. 

* జగన్ గారిలా కూర్చోపెట్టి ముద్దులు పెట్టడానికి నేను రాజకీయాల్లోకి రాలేదు. యువతకు ఉద్యోగాలు కల్పించాలి, ఆడపిల్లలు బాగుండాలి, రాజకీయ ప్రక్షాళన జరగాలి అని ఆశించి రాజకీయాల్లోకి వచ్చాను. 

* నేను వచ్చే దారిలో తెలుగుదేశం బస్సులను చూసాను, పోలవరం ప్రాజెక్టును చూపించడానికి బస్సుల్లో తెలుగుదేశం ప్రజలను తీసుకొస్తున్నారు,సంతోషం.. అలాగే ఇక్కడి ప్రజలు మాకు అమరావతిని చూపించండి అని అడుగుతున్నారు..నిర్మాణం జరగని అమరావతిని ఇక్కడ ప్రజలకు ముఖ్యమంత్రి గారు చూపించాలి. 

* బస్సుల్లో వచ్చే తెలుగుదేశం ప్రజలు 10 కిలోమీటర్లు అటుగా వెళ్తే నిర్వాసితుల కష్టాలు తెలుస్తాయి. పోలవరంలో వున్న క్యాంటీన్ కూడా దేవినేని ఉమా గారిది అంట, పోలవరం చూపించడానికి వేసిన బస్సులకు ప్రభుత్వం డబ్బులు చెల్లించాలి. బస్సుల్లో వచ్చే వారికి తిండి పెట్టె క్యాంటీన్ మాత్రం తెలుగుదేశం వారిది, ఇలాంటివి వింటుంటే నిస్సహాయతతో కూడిన నవ్వు వస్తుంది. 

* అరకు, పాడేరు రోడ్డులో కొంత మంది యువత నన్ను ఆపేసి క్వారీలు పేల్చేస్తున్న ప్రాంతాన్ని చూడమన్నారు..ఈ విషయంపై నేను స్పందిస్తూ తక్షణమే ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరాను. నేను చెప్తే ప్రభుత్వం పట్టించుకోలేదు, ప్రజా పోరాటాల ద్వారా క్వారీ పేలుళ్లకు పాల్పడ్డ కొంతమందిని చంపేశారు.   

* తుపాకి పట్టాలని ఎవరికీ ఉండదు. ప్రజాస్వామ్య వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేస్తూ, ప్రభుత్వాలు సరిగ్గా పని చెయ్యకపోతే ప్రజల్లో అసహనం పెరిగిపోతుంది, దాని తాలూకు ప్రజా ఉద్యమాలు పుడతాయి.

* పోలీసు వ్యవస్థ గాని, రెవెన్యూ వ్యవస్థ గాని ఏ తప్పులు చెయ్యవు..వారి చేత రాజకీయ నాయకులు తప్పులు చేయిస్తారు. అందువల్ల రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చెయ్యాలి.   

* నిర్వాసితులు వున్న గ్రామాల్లో ముందుగా తెలుగుదేశం పార్టీ వారికి నష్ట పరిహారం ఇచ్చేస్తే మిగతావారికి జీవన విధానం ఎలా? గిరిజన తెగల్లో గొడవలు పెడుతున్నారు.

* విజయవాడ నుండి పోలవరం సందర్శించటానికి వచ్చిన వారిని ఒకసారి నిర్వాసితులు వుండే ప్రాంతానికి కూడా తీసుకెళ్లండి, నిర్వాసితుల కన్నీళ్లు చూడమని చెప్పండి. 

* పోలవరం నిర్వాసితులను కాపాడాల్సిన బాధ్యత నాది, ముఖ్యమంత్రి గారిది మాత్రమే కాదు..ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న ప్రతీ ఒక్కరిది. దేశం కోసం నిర్వాసితులవుతున్న వారికి అండగా నిలవాల్సిన బాధ్యత అందరికీ వుంది, ముఖ్యమంత్రి గారి మీద ఎక్కువ వుంది. 

* ప్రత్యేక టాస్క్ ఫోర్స్ వేసి నిర్వాసితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం బాధ్యతలు తీసుకోవాలి. పోలవరం నిర్వాసితుల కొరకు ఒక పరిరక్షణ కమిటీని జనసేన తీసుకొస్తుంది. 

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.