గుంటూరులో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ కార్యాలయాన్ని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో జనసేన కార్యాలయానికి చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పండితులు వేద మంత్రాలతో స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో పూజలు నిర్వహించి లాంఛనంగా ప్రారంభోత్సవం చేశారు.
మతపెద్దలు సర్వమత ప్రార్థనలు నిర్వహించి, పవన్ కల్యాణ్ గారిని ఆశీర్వదించారు. అనంతరం అధునాతన శైలిలో తీర్చిదిద్దిన నాలుగస్తుల నూతన కార్యాలయంలో ప్రతి అంతస్తు పరిశీలించారు. గుంటూరు జిల్లా సమస్యల పరిష్కారానికి ఈ నూతన కార్యాలయం వేదిక కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమానికి జనసేన ముఖ్యనేతలు శ్రీ నాదెండ్ల మనోహర్, శ్రీ తోట చంద్రశేఖర్, మాజీమంత్రి శ్రీ రావెల కిశోర్ బాబు, శ్రీ మాదాసు గంగాధరంతో పాటు పలువురు నాయకులు, పాల్గొన్నారు.
అంతకు ముందు విజయవాడ నుంచి గుంటూరులో పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి బయల్దేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి కాన్వాయ్ వెంట అభిమానులు పెద్ద సంఖ్యలో బైకులతో ర్యాలీగా తరలి వచ్చారు. జోరువానలో సైతం దారి పొడవునా కేరింతలు కొడుతూ స్వాగతం పలికారు. గుంటూరు నూతన కార్యాలయం వద్ద తమ అభిమాన నాయకుడిపై పూల వర్షం కురిపించారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు కార్యకర్తలు, అభిమానాలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు.