బార్బడోస్ నుంచి అహ్మదాబాద్ వరకు – టీమ్ ఇండియా దూకుడు!

చాలా సంవత్సరాలుగా ఐసీసీ ట్రోఫీల కోసం ఎదురుచూసిన భారత క్రికెట్ అభిమానుల కల 2024 టీ20 ప్రపంచకప్‌తో నెరవేరింది. వెస్టిండీస్‌లోని బార్బడోస్‌లో జరిగిన ఫైనల్లో విజయం సాధించిన భారత్ దాదాపు 13 సంవత్సరాల తర్వాత మరో ఐసీసీ ట్రోఫీని సొంతం చేసుకుంది. ఆ విజయంతో టీమ్ ఇండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ప్రత్యేకంగా టీ20 ఫార్మాట్‌లో మరింత ఆధిపత్యం ప్రదర్శిస్తోంది.

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా వంటి సీనియర్ ఆటగాళ్లు టీ20లకు వీడ్కోలు పలికినప్పటికీ యువతతో కూడిన జట్టు ప్రపంచ క్రికెట్‌లో భారత ప్రతిష్టను మరింత పెంచుతోంది. గతంలో 1970–80 దశకాల్లో వెస్టిండీస్, 2000లలో ఆస్ట్రేలియా ప్రపంచ క్రికెట్‌ను శాసించినట్లే ఇప్పుడు టీమ్ ఇండియా కూడా అదే స్థాయి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నట్లు క్రికెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

2024 తర్వాత భారత్ ఆడిన ఎనిమిది టీ20 సిరీస్‌ల్లో ఒక్కదానిలో కూడా ఓడిపోలేదు. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా వంటి బలమైన జట్లను వారి స్వదేశాల్లోనే ఓడించడం భారత జట్టు స్థాయిని తెలియజేస్తోంది. 2023 అక్టోబర్ నుంచి ఇప్పటివరకు భారత్ ఆడిన 56 మ్యాచ్‌ల్లో కేవలం 8 మాత్రమే ఓడింది. గంగూలీ ప్రారంభించిన దూకుడు ధోనీ, కోహ్లీ ద్వారా మరింత బలపడగా రోహిత్ నాయకత్వంలో అది కొత్త స్థాయికి చేరింది. 2023 వన్డే ప్రపంచకప్‌లో ఫైనల్‌లో ఓటమి ఎదురైనా, తరువాతి ఐసీసీ టోర్నీల్లో భారత్ తిరిగి బలంగా నిలిచింది.

2025 చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ విజయాలు, అలాగే మహిళల వన్డే ప్రపంచకప్, అండర్-19 ప్రపంచకప్ విజయాలతో భారత క్రికెట్‌కు సువర్ణయుగం ప్రారంభమైంది. ఈ విజయ పరంపర కొనసాగితే భవిష్యత్తులో ఒలింపిక్స్‌లో క్రికెట్‌లో కూడా స్వర్ణ పతకం సాధించడం సాధ్యమేనని క్రీడా విశ్లేషకులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.