
తెలుగువారి ఆత్మ గౌరవం అనే నినాదంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ సంచలనం సృష్టించిన పార్టీ తెలుగుదేశం. దివంగత ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీ- నాలుగు దశాబ్దాల పైబడి ప్రజా క్షేత్రంలో బలంగా నిలబడింది. నేడు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకుంటున్న సందర్భంగా టీడీపీ జాతీయ అధ్యక్షులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారికి, జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారికి, టీడీపీ నాయకులు, కార్యకర్తలకు శుభాకాంక్షలు అంటూ జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. టీడీపీ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు, క్లిష్ట పరిస్థితులు, పోరాటాలు ఉన్నాయి. శ్రీ చంద్రబాబు నాయుడు గారు తన అపార రాజకీయ అనుభవంతో వాటన్నింటినీ అధిగమించి, ఆ పార్టీ శ్రేణుల్లో స్థైర్యం నింపారు. రాజకీయ లక్ష్యాలతోపాటు రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం అజెండాగా నిర్దేశించి పార్టీని ముందుకు నడిపించారు. ఉభయ తెలుగు రాష్ట్రాల అభివృద్ధిలో, ప్రజా పక్షం వహిస్తూ చేపట్టిన రాజకీయ పోరాటాల్లో శ్రీ చంద్రబాబు గారి ముద్ర ఉంది. కూటమి ఐక్యతతోనే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి సాధ్యం. ఆ స్ఫూర్తిని మరింత బలోపేతం చేద్దాము అని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.