

* ఏఐఎన్ఆర్సీ, బీజేపీ కూటమికి సానుకూల పవనాలు
* ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే కూటమి ఎదురీత
* శ్రీ విజయ్ పార్టీ టీవీకే ప్రభావం ఏమిటో?
* పాలక కూటమిని గద్దె దించే ఆనవాయితీ ఈసారి తప్పిపోతుందా?
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు ఈసారి తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్నాయి. 1954 వరకూ ఫ్రెంచి పాలనలో ఉన్న ఈ కేంద్రపాలిత ప్రాంత శాసనసభలోని మొత్తం 30 నియోజకవర్గాలకు ఈ నెల 9న పోలింగ్ జరుగుతుంది. మిగిలిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు మాదిరిగానే మే 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఎన్నికల ఫలితాలు ప్రకటించాక ముగ్గురు సభ్యులను అసెంబ్లీకి కొత్త సర్కారు నామినేట్ చేస్తుంది. ప్రస్తుత సీఎం శ్రీ ఎన్.రంగసామి నాయకత్వంలోని ఆలిండియా ఎన్ రంగసామి కాంగ్రెస్ (ఏఐఎన్ఆర్సీ), బీజేపీ సంకీర్ణ సర్కారు 2021 ఎన్నికల నుంచి అధికారంలో ఉంది. ఈ ఎన్నికల్లో ఏఐఎన్ఆర్సీ, బీజేపీ, ఏఐఏడీఎంకే, లచ్చియ జననాయగ కచ్చి (ఎల్జేకే )తో కూడిన ఎన్డీఏతో ప్రతిపక్ష కాంగ్రెస్, డీఎంకే కూటమి తలపడుతోంది. 2006 ఎన్నికల తర్వాత పుదుచ్చేరిలో వరుసగా ఏ శాసనసభ ఎన్నికల్లోనూ ఒకే కూటమి అధికారంలోకి రాలేదు. పొరుగున ఉన్న పెద్ద తమిళ రాష్ట్రం తమిళనాడులో మాదిరిగానే ఐదేళ్లు పరిపాలించిన రాజకీయ కూటమిని ఓడించడం పుదుచ్చేరి ఓటర్లకు ఆనవాయితీగా మారింది. 2021 ఎన్నికల్లో ఏఐఎన్ఆర్సీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి (ఏఎన్ఆర్సీకి 10, బీజేపీకి 8 స్థానాలు రాగా, మరో భాగస్వామ్యపక్షం ఏఐఏడీఎంకేకు ఒక్క సీటూ దక్కలేదు) మెజారిటీ సీట్లు సాధించి అధికారంలోకి వచ్చింది. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు జరిగాక 2016–2021 మధ్య ఐదేళ్లూ కాంగ్రెస్ నేత, కేంద్ర మాజీ మంత్రి శ్రీ వి.నారాయణసామి ముఖ్యమంత్రిగా యూపీఏ సర్కారు (కాంగ్రెస్, డీఎంకే కూటమి) పుదుచ్చేరిని పరిపాలించింది. ముఖ్యమంత్రి శ్రీ ఎన్ రంగసామి ఇప్పటి వరకూ నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా (మొదటి రెండుసార్లు కాంగ్రెస్ తరఫున, తర్వాత సొంత పార్టీ ఏఐఎన్ఆర్సీ, బీజేపీ కూటమి తరఫున) దాదాపు 17 సంవత్సరాలు పనిచేసి రికార్డు సృష్టించారు. 2011లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి తన పేరుతోనే ప్రాంతీయపక్షాన్ని ప్రారంభించి సగం స్థానాలు (15) కైవసం చేసుకుని ఇతరుల మద్దతుతో మూడోసారి సీఎంగా ప్రమాణం చేశారు. గౌండర్ సామాజికవర్గానికి చెందిన శ్రీ రామసామికి జనాదరణ ఉన్న పాలకుడిగా మంచి పేరుంది. అయితే, పుదుచ్చేరికి రాష్ట్ర హోదాను కేంద్రం ఇవ్వాలన్న డిమాండ్ ఈ ఎన్నికల్లో మళ్లీ తెర మీదకు రావడంతో ఎన్డీఏ కూటమి మరోసారి గెలవడానికి అవకాశాలు తగ్గుతాయా? అనే అనుమానం కొందరికి వస్తోంది. పాలక సర్కారుపై సహజంగా జనంలో వచ్చే వ్యతిరేకత కూడా మూడు పార్టీల ఎన్డీఏ ఓటమికి దారితీయవచ్చనే అనుమానం వారిలో ఉంది. అయితే, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రజలను ఆకట్టుకున్న కారణంగా పాలక కూటమి వరుసగా రెండోసారి మెజారిటీ సాధించినా ఆశ్చర్యపడాల్సిన పనిలేదన్న వాదన బలంగా వినిపిస్తోంది.
*సీఎంతో తలపడుతున్న కాంగ్రెస్ మాజీ సీఎం శ్రీ వీ వైద్యలింగం
ప్రస్తుత పుదుచ్చేరి కాంగ్రెస్ లోక్‌సభ సభ్యుడు, గతంలో ఏడున్నర ఏళ్లకు పైగా కాంగ్రెస్ కూటమి తరఫున రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన శ్రీ వి.వైద్యలింగం ఈ ఎన్నికల్లో సీఎం శ్రీ రామసామితో తట్టన్‌చావడి స్థానంలో ఢీ కొంటున్నారు. రెండు ప్రత్యర్ధి కూటములకు చెందిన సీఎం, మాజీ సీఎం ఇలా ఒకే అసెంబ్లీ స్థానంలో తలపడడం ఇదే మొదటిసారి. కిందటి అసెంబ్లీ ఎన్నికల్లో తన సొంత స్థానం, పుదుచ్చేరి ప్రధాన భూభాగంలో ఉన్న తట్టన్చావడితో పాటు ఆంధ్రప్రదేశ్‌ను ఆనుకుని ఉన్న తెలుగు ప్రాంతం యానాం నియోజకవర్గం నుంచి కూడా శ్రీ రామసామి పోటీ చేశారు. అయితే, యానాంలో ఇండిపెండెంట్ అభ్యర్ధి శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ చేతిలో ఆయన ఓడిపోయారు. యానాం సీనియర్ నేత, మాజీ మంత్రి, మత్స్యకార వర్గానికి చెందిన శ్రీ మల్లాడి కృష్ణారావు సలహా మేరకు శ్రీ రామసామి యానాం నుంచి పోటీ చేశారు. ఇప్పుడు ముఖ్యమంత్రితో మాజీ సీఎం పోటీపడుతున్న కారణంగా తట్టన్‌చావడి స్థానం అందరి దృష్టిని ఆకట్టుకుంది. శ్రీ రంగసామి కిందటిసారి మాదిరిగానే రెండు చోట్ల పోటీచేసినట్టే ఈసారి కూడా అదనంగా మంగళం స్థానం నుంచి కూడా పోటీచేస్తున్నారు.
*80% దాటుతున్న ఓటింగ్
దాదాపు తొమిదిన్నర లక్షల ఓటర్లు ఉన్న పుదుచ్చేరిలో పదేళ్ల నుంచీ భారీ స్థాయిలో పోలింగ్ జరుగుతోంది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో 83.6% పోలింగ్ జరిగింది. అప్పుడు కాంగ్రెస్ 15, దాని మిత్రపక్షం డీఎంకే 2 స్థానాలు దక్కించుకున్నాయి. ఈ రెండు పార్టీల కూటమి కేంద్ర మాజీ మంత్రి శ్రీ వి.నారాయణసామి నేతృత్వంలో అధికారంలోకి వచ్చింది. ఎన్డీఏ కూటమిలోని ఏఐఎన్ఆర్సీ 8, ఏఐఏడీఎంకే 2 సీట్లు గెలుచుకోగా, వాటి మిత్రపక్షం బీజేపీ ఒక్క స్థానంలోనూ విజయం సాధించలేదు. 2021 ఎన్నికల్లో 84.8% ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ముందే చెప్పినట్టు ఏఐఎన్ఆర్సీ 10, బీజేపీ 6 సీట్లు కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చాయి. ప్రతిపక్ష కూటమిలోని డీఎంకే 6, కాంగ్రెస్ 2 సీట్లు గెలుచుకున్నాయి. ప్రధాన ప్రతిపక్షం హోదా డీఎంకేకు దక్కింది. రెండు ప్రధాన కూటములతోపాటు తమిళ స్టార్ శ్రీ విజయ్ పార్టీ తమిళగ వెట్రి కజగం (టీవీకే) కూడా రంగంలోకి దిగడంతో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోలింగ్ అత్యధికంగా ఉంటుందని అంచనా. పుదుచ్చేరిలో సాధారణ మెజారిటీకి ఏ కూటమికి అయినా 16 స్థానాలు అవసరం. కేవలం మూడు నాలుగు సీట్లలో ఫలితాలు తారుమారు అయినా అధికారంలోకి వచ్చే కూటమి మారిపోతుంది. ఐదేళ్లుగా అధికారంలో ఉన్న ఏఐఎన్ఆర్సీ, బీజేపీ కూటమి సర్కారుపై జనంలో పెరిగిన అసంతృప్తిని తమకు అనుకూలంగా మార్చుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్–డీఎంకే కూటమి ఆశిస్తోంది. పాలక ఎన్డీఏ కూటమి మాత్రం సీఎం శ్రీ రంగసామికి ఉన్న జనాకర్షణ శక్తిపై ఎక్కువ ఆధారపడుతోంది. ఆయన పాలనా సామర్ధ్యం మరోసారి విజయం సాధించి పెడుతుందనే అంచనాతో ఉంది. అయితే, టీవీకే కొత్త రాజకీయ శక్తిగా ఎన్నికల బరిలోకి దిగడం అన్ని అంచనాలను తలకిందులు చేసే అవకాశాలు లేకపోలేదు.
* ‘‘లాటరీ కింగ్’’ శ్రీ మార్టిన్ కొడుకు పార్టీకి సీట్లివ్వడంపై ఎన్డీఏలో కీచులాట
ఈసారి ఎన్డీఏలో పెద్ద పార్టీ ఏఐఎన్ఆర్సీ 15 స్థానాలకు, బీజేపీ 10 సీట్లకు, ఏఐఏడీఎంకే, ఎల్జేకే రెండేసి సీట్లకు పోటీ చేస్తున్నాయి. దక్షిణాదికి చెందిన ‘లాటరీ కింగ్’గా పేరొందిన శ్రీ శాంటియాగో మార్టిన్ కుమారుడు శ్రీ జోస్ చార్లెస్ మార్టిన్ నాయకత్వంలోని ఎల్జేకేకు రెండు సీట్లు కేటాయించడాన్ని మొదట శ్రీ రంగసామి వ్యతిరేకించారు. అయితే, బీజేపీతో చర్చలు జరిపాక సంతృప్తి చెందిన ముఖ్యమంత్రి ఎల్జేకేను తన కూటమిలో భాగస్వామిగా అంగీకరించారు. పుదుచ్చేరి నగరంలోని బాగా అభివృద్ధి సాధించిన కామరాజనగర్ స్థానం నుంచి శ్రీ జోస్ చార్లెస్ మార్టిన్ ఎన్నికల బరిలోకి దిగారు. రూ.597 కోట్ల సంపద ఉన్నట్టు ప్రకటించిన శ్రీ మార్టిన్‌పై కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ పీకే దేవదాస్ పోటీ చేస్తున్నారు. సినీ నటుడు శ్రీ విజయ్ పార్టీ టీవీకే మొదట మొత్తం 30 సీట్లకు పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. అయితే, తర్వాత శ్రీ జి.నెహ్రూ అలియాస్ కుప్పుసామి నాయకత్వంలోని నేయం మక్కల్ కజగం (ఎన్ఎంకే)కు రెండు సీట్లు ఇచ్చి 28 స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టింది. గతంలో స్వతంత్ర అభ్యర్ధిగా గెలిచిన శ్రీ నెహ్రూ ఈసారి ఓర్లియాన్పేట్ నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, ఈ పార్టీకే చెందిన నేత శ్రీ ఈ వినాయగం ఇద్దరు సీఎం అభ్యర్ధులు (శ్రీ రంగసామి, శ్రీ వైద్యలింగం) పోటీ చేస్తున్న తట్టన్చావడిలో బరిలో నిలిచారు. ఆరంభంలో టీవీకేతో పొత్తు పెట్టుకోవడానికి రెండు ప్రధాన కూటములలోని పార్టీలూ ఆసక్తి చూపించాయి. అభిమానులు, ఫ్యాన్ క్లబ్బులు చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉన్నాగాని రాజకీయ, విధానపరమైన అనుభవం, సంస్థాగత పునాదులు లేని శ్రీ విజయ్ పార్టీతో పొత్తు వల్ల సానుకూల ఫలితాలు ఎంత వరకు వస్తాయనే అనుమానంతో అవి వెనక్కి తగ్గాయి.
*కాంగ్రెస్ 16, డీఎంకే 14 సీట్లలో పోటీ
మొత్తం 30 స్థానాల్లో కాంగ్రెస్ 16, డీఎంకే 14 సీట్లలో పోటీ చేస్తున్నాయి. దళితుల్లో జనాదరణ ఉన్న విడుదలై చిరుతైగళ్ కచ్చి (వీసీకే) మొదట డీఎంకే, కాంగ్రెస్ కూటమితో పొత్తుకు సిద్ధమైనాగాని చివర్లో అది సాధ్యం కాలేదు. మొదట కాంగ్రెస్, డీఎంకే మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు విఫలం కావడంతో ఈ రెండు పక్షాలూ విడివిడిగా పోటీచేసే పరిస్థితి తలెత్తింది. చివర్లో రాజీ కుదిరింది. సుదీర్ఘకాలం పుదుచ్చేరిలో పాలక కూటమికి నాయకత్వం వహించిన కారణంగా రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్‌కు సంస్థాగత నిర్మాణం ఉంది. అయితే, దాదాపు పన్నెండేళ్లుగా జాతీయ స్థాయిలో, అనేక రాష్ట్రాల్లో హస్తం పార్టీ బలహీనం కావడంతో పుదుచ్చేరిలో కూడా ఇది పూర్వ వైభవం కోల్పోయింది. రాజకీయ పునాదులు దెబ్బదిన్నాయి. పాలక కూటమిగా ఉన్న కారణంగా ఏఐఎన్ఆర్సీ–బీజేపీ కూటమిపై జనంలో అసంతృప్తి ఉండొచ్చుగాని, ఎన్డీఏ ఈ ఎన్నికల్లో బలమైన కూటమిగా కనిపిస్తోంది.
*కీలక స్థానాలపై ఉత్కంఠ
పుదుచ్చేరిలోని మొత్తం 30 సీట్లలో 23 స్థానాలు ప్రధాన రాజధాని ప్రాంతమైన పుదుచ్చేరిలో ఉన్నాయి. తమిళనాడులోని తీర ప్రాంతమైన మైలదుత్తరై, నాగపట్నం మధ్యన ఉన్న కరైకల్ ప్రాంతంలో ఐదు, ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా సరిహద్దులోని యానాం, కేరళ తీరంలోని మాహిలో మిగిలిన రెండు అసెంబ్లీ స్థానాలున్నాయి. 1964లో యానాం అసెంబ్లీ స్థానం ఏర్పాటు చేసినప్పటి నుంచి 1985 వరకూ వరుసగా ఆరుసార్లు కాపు వర్గానికి చెందిన సీనియర్ నేత శ్రీ కామిచెట్టి శ్రీ పరసురామ వరప్రసాదరావు నాయుడు ఇక్కడ నుంచి ఎన్నికయ్యారు. రెండుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై, మరో మూడుసార్లు స్వతంత్ర అభ్యర్థిగా, ఒకసారి జనతాపార్టీ తరఫున ఆయన యానాం ప్రతినిధిగా చట్టసభకు ఎన్నికయ్యారు. 1990లో డీఎంకేకు చెందిన శ్రీ రక్షా హరికృష్ణ (మత్స్యకారవర్గం) తొలిసారి గెలవడంతో కొత్త నేతలకు అవకాశాలు వచ్చాయి. 1991లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ వెలగా రాజేశ్వరరావు ఎన్నికయ్యారు. 1996 నుంచి 2016 వరకూ వరుసగా ఐదు సార్లు (రెండుసార్లు స్వతంత్ర అభ్యర్ధిగా, మూడుసార్లు కాంగ్రెస్ టికెట్‌పై) మత్స్యకార వర్గానికి చెందిన శ్రీ మల్లాడి కృష్ణారావు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నియ్యారు. కొద్ది కాలం మంత్రిగా కూడా ఉన్నారు. కిందటి ఎన్నికల్లో పైన పేర్కొన్నట్టు శ్రీ రామసామిపై స్వతంత్ర అభ్యర్ధి శ్రీ గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ విజయం సాధించారు. రాజధాని ప్రాంతమైన పుదుచ్చేరిలోని రాజ్‌భవన్ స్థానంలో ఈసారి డీఎంకే నేత, హోంశాఖ మాజీ మంత్రి శ్రీ పి.కన్నన్ కుమారుడు శ్రీ విజ్ఞేశ్ కన్నన్ పోటీ చేస్తుండగా, ఆయనపై బీజేపీ పుదుచ్చేరి శాఖ అధ్యక్షుడు శ్రీ వీపీ రామలింగం బరిలోకి దిగారు. మరో కీలక నియోజకవర్గం లాస్‌పేటలో ఏఐఎన్ఆర్సీ నేత, మాజీ స్పీకర్ శ్రీ వీపీ శివకొలందు, టీవీకే నేత శ్రీ వి.సామినాథన్ పోటీ పడుతున్నారు. కేరళ తీరంలోని మాహి స్థానంలో బీజేపీ నేత శ్రీ ఎ.దినేశన్, కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ రమేశ్ పరంబత్ బరిలో ఉన్నారు.
*ఎన్డీఏకు మెజారిటీ చాన్స్: పీపుల్స్ పల్స్ సర్వే అంచనా
పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి అత్యధిక స్థానాలు వస్తాయని పీపుల్స్ పల్స్ అనే సర్వే సంస్థ విశ్లేషణలో తేలింది. మొత్తం 30 స్థానాల్లో ఏఐఎన్ఆర్సీ, బీజేపీ నాయకత్వంలోని కూటమికి 14 నుంచి 17 సీట్లు వచ్చే అవకాశాలున్నాయని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. కాంగ్రెస్, డీఎంకే కూటమికి 9–11 స్థానాలు, టీవీకేకు రెండు సీట్లు, ఇతరులకు ఒకటి నుంచి రెండు స్థానాలు దక్కవచ్చని ఈ సర్వే చెబుతోంది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికే విజయావకాశాలు ఎక్కువ ఉన్నాయని రాజకీయ, ఎన్నికల పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2006 నుంచి అన్ని ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తున్న కాంగ్రెస్, డీఎంకే కూటమికి ఈసారి పాత ఆనవాయితీ ప్రకారం అధికారం లభించే సూచనలు చాలా తక్కువని వారు విశ్లేషిస్తున్నారు. ఏదేమైనా మొత్తం పది లక్షల మంది కూడా లేని ఈ కేంద్ర పాలిత ప్రాంత అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఎప్పటిలాగానే తీవ్ర ఉత్కంఠ నెలకొని ఉంది.