
ప్రకాశం జిల్లా: ప్రజా సమస్యల పరిష్కార కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను సమగ్రంగా పరిశీలించి, వేగవంతంగా పరిష్కారం అందించడం ప్రధాన లక్ష్యమని జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తెలిపారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం (మీకోసం)” నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ లిఖితపూర్వక అర్జీలను సమర్పించి సమస్యలను వివరించారు. ఎస్పీ మరియు పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వారి సమస్యల పూర్వాపరాలను తెలుసుకుని చట్టపరంగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
మొత్తం 80 ఫిర్యాదులు అందిన ఈ కార్యక్రమంలో, వాటిపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన ఎస్పీ, తక్షణ విచారణ చేపట్టి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. ఫిర్యాదులపై అలసత్వం వహించకుండా నిర్ణీత గడువులో పరిష్కరించాలని స్పష్టం చేశారు.
ప్రత్యేకంగా వృద్ధులు, నడవలేని స్థితిలో ఉన్నవారి ఫిర్యాదులను ప్రాధాన్యంగా తీసుకుని, అవసరమైతే సంఘటన స్థలాన్ని సందర్శించాలని సూచించారు. జిల్లా కార్యాలయానికి రాలేని వారు స్థానిక పోలీస్ స్టేషన్లు, సర్కిల్, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా ఫిర్యాదులు ఇవ్వవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎక్కువగా భూ వివాదాలు, ఆర్థిక తగాదాలు, అత్తరింటి వేధింపులు, ఉద్యోగ మోసాలకు సంబంధించిన ఫిర్యాదులు నమోదయ్యాయి. కార్యక్రమంలో డీఎస్పీ వి.వి. రమణకుమార్, సీఐలు డి. ప్రసాద్, సుబ్బరాజు, ప్యానెల్ అడ్వొకేట్ బి. బాలాజీ సింగ్, ఎస్సై జనార్దన్ రావు తదితరులు పాల్గొన్నారు.