

• ఆ మహనీయుని స్ఫూర్తిని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తుంది
• ఆంధ్ర గడ్డపై నీరు తాగుతున్న ప్రతీ ఒక్కరికీ ఆయన త్యాగం గుర్తుకు రావాలనే… జల్ జవన్ మిషన్ ప్రాజెక్టులన్నింటీకీ అమరజీవి పేరు
• శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సభలో ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్
‘భాషాప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆద్యుడు… తెలుగు జాతి ఉనికి కోసం, ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని స్మరించుకోవడం ప్రతి ఆంధ్రుడి కర్తవ్యం. అలాంటి మహనీయుడి చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా మన రాజధాని నడిబొడ్డున ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం గర్వంగా ఉంద’ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టం చేశారు. ఆయన ఆత్మబలి దానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై నీరు తాగుతున్న ప్రతి ఒక్కరికీ ఆయన త్యాగం గుర్తుకు రావాలి…ఆ ఉద్దేశంతోనే జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన తాగునీటి పథకాలకు అమరజీవి జలధార అని నామకరణం చేసినట్టు తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తిని ముందుకు తీసుకు వెళ్తుందని చెప్పారు. సోమవారం శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా అమరావతిలో ఏర్పాటు చేసిన 58 అడుగుల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారితో కలసి పాల్గొన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి పేరిట ముద్రించిన పోస్టల్ కవర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తెలుగు జాతి కోసం ఆత్మార్పణ చేసిన అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాను. ఎవరి ప్రాణ త్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహ త్యాగం మీద ఈ రోజున తెలుగువారంతా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం, ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు సుదీర్ఘ కాలం ఆమరణ దీక్ష చేశారు. ఆయన ఆత్మబలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకి దారి చూపింది. ఆంధ్ర రాష్ట్రం తర్వాత 1956లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 1966లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపదికన ఏర్పడ్డాయంటే అది శ్రీ పొట్టి శ్రీరాములు గారి పుణ్యమే.
• ప్రతి ఆంధ్రుడు అమరజీవి త్యాగాన్ని స్మరించుకోవాలి
ఆ మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా ఆంధ్రుల రాజధాని అమరావతిలో విగ్రహం ఏర్పాటు చేసేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమి కేటాయించింది. ఆయన చేసిన 58 రోజుల ఆమరణ దీక్షకు గుర్తుగా 58 అడుగుల విగ్రహాన్ని ట్రస్ట్ ఇక్కడ ఏర్పాటు చేసింది. అంతకు ముందే శ్రీ పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగానికి నివాళిగా కూటమి ప్రభుత్వం తరఫున జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన మల్టివిలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి “అమరజీవి జలధార” అని పేరు పెట్టాం. దేశవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసించే ప్రజలందరికీ రోజుకి 55 లీటర్ల చొప్పున స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో ఈ పథకాన్ని పకడ్బందీగా అమలు చేస్తున్నాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆత్మబలిదానంతో ఏర్పడిన ఈ గడ్డపై నీరు తాగిన ప్రతిసారి ఆయన త్యాగం గుర్తుకు రావాలి. ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలన్న ఉద్దేశంతో పథకానికి ఆయన పేరు పెట్టాం.
• రాష్ట్రవ్యాప్తంగా అమరజీవి జలధారలు
జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా ఇప్పటికే ఐదు జిల్లాల పరిధిలో రూ. 7,910 కోట్లు ఖర్చు చేసి ఐదు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టులను ప్రారంభించాం. తద్వారా వచ్చే 30 ఏళ్లలో ఒక కోటీ 21 లక్షల మంది దాహార్తి తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. రూ. 9,355 కోట్లతో మరో ఏడు మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుల నిర్మాణానికి త్వరలో శ్రీకారం చుట్టనున్నాం. తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3 వేల ఆవాసాలను గుర్తించి 3 వేల పనులను సింగిల్ విలేజ్ స్కీం కింద చేపట్టనున్నాం. రూ. 1,814 కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టుని ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అన్ని తాగు నీటి పథకాలను అమరజీవి జలధార పేరిట ముందుకు తీసుకువెళ్తాం.
• పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం
శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఒక గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర్య సమరయోధుడు కూడా. ఈ సందర్భంగా క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఔన్నత్యాన్ని గురించి మహాత్ముడు మాట్లాడిన మాటలు మనం స్మరించుకోవాలి. శ్రీరాములు లాంటి వారు మరో 11 మంది నాతో ఉంటే ఏడాదిలో స్వాతంత్ర్యం తీసుకువస్తానన్న గాంధీజీ మాటలు అమరజీవి పోరాట స్ఫూర్తికి నిదర్శనం. ఆ స్ఫూర్తిని కొనసాగిస్తూ.. యావత్ ప్రపంచం తెలుగువారి ఔన్నత్యాన్ని, ఔచిత్యాన్ని గుర్తించేలా కృషి చేస్తామని మాటిస్తున్నాం. నేడు ఆయన కుటుంబ సభ్యుల పక్కన కూర్చునే అవకాశం, వారిని చూస్తూ ఆయన త్యాగాన్ని గుర్తు చేసుకునే అవకాశం లభించింది. మనకంటూ ఒక రాజధాని ఏర్పరుచుకుని, ఆ రాజధాని నడిబొడ్డున అమరజీవి విగ్రహం ఏర్పాటు చేసేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను” అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు శ్రీ పి.వి.ఎన్. మాధవ్ గారు, కేంద్ర మంత్రి శ్రీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, రాష్ట్ర ఐటీ, మానవ వనరులశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు, ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, మంత్రులు శ్రీ కందుల దుర్గేష్ గారు, శ్రీమతి సవిత గారు, పలువురు శాసన సభ్యులు, ఆర్య వైశ్య కార్పోరేషన్ ఛైర్మన్ శ్రీ డూండి రాజేష్ గారు, శ్రీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులు, ఆర్య వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు.