
- మీ ఆలోచనలు భావోద్వేగాలతో కాకుండా వాస్తవికంగా ఉండాలి
- దేశ భవిష్యత్తుకి విద్యార్ధులే నావికులు
- మీ ప్రతిభ, జ్ఞానం… సమాజానికి, దేశానికి ఉపయోగపడాలి
- మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే మూడు స్థంభాలపై నిర్మితమైంది
- శతాబ్ద కాలంగా వేలాది మంది మేధావులను సమాజానికి అందించింది
- వారి స్ఫూర్తితో మీరంతా సమాజాన్ని మార్చే బలమైన శక్తులుగా ఎదగాలి
- నా ఆఖరిశ్వాస వరకు భవిష్యత్ తరాల కోసమే పని చేస్తా
- ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల మెగా కల్చరల్ ఫెస్ట్ ముగింపు వేడుకల్లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా నిర్వహించిన మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. యువత ఏ భావజాలాన్నీ గుడ్డిగా నమ్మకూడదని, భావోద్వేగాలకు లోను కాకుండా వాస్తవికత, తర్కంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.
విద్య ప్రపంచాన్ని మార్చగల శక్తివంతమైన ఆయుధమని, విద్యార్థులు దేశ భవిష్యత్తుకు నావికులని ఆయన పేర్కొన్నారు. తమ జ్ఞానం, ప్రతిభ సమాజానికి, దేశానికి ఉపయోగపడేలా వినియోగించాలని పిలుపునిచ్చారు. సమాజ సేవ కూడా యువత లక్ష్యంగా ఉండాలని అన్నారు.
ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలంగా వేలాది మేధావులను తయారు చేసి సమాజానికి అందించిందని, ఇది భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచిందని చెప్పారు. మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే మూడు స్థంభాలపై నిర్మితమైన ఈ విద్యాసంస్థ అనేక తరాలకు దిశానిర్దేశం చేసిందన్నారు.
ప్రస్తుత కాలంలో ఏ సిద్ధాంతాన్నైనా అనుసరించే ముందు అది సమాజానికి, రాజ్యాంగ విలువలకు అనుగుణంగా ఉందా లేదా అనేది పరిశీలించాలని సూచించారు. ఒక వర్గానికే ఉపయోగపడే భావజాలం సరైనది కాదని, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా ఉండే ఆలోచనలను మాత్రమే స్వీకరించాలని చెప్పారు.
దేశ అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని, వారి శక్తి, సృజనాత్మకతతో సమాజంలో మార్పు తీసుకురాగలరని పేర్కొన్నారు. నిరంతర కృషి, నిబద్ధతతో ముందుకు సాగి, భవిష్యత్ తరాల కోసం పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.