
- కుల వివక్షపై పోరాడిన ధీశాలి
- జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
- టీడీపీ ఎస్సీ ఆధ్వర్యంలో ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
చిలకలూరిపేట: కార్మికుల హక్కులు, రైతుల సంక్షేమం, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చివరి శ్వాస వరకు పనిచేసిన తొలి దళిత ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు టీడీపీ ఎస్సీ సెల్ నేతల కొండా వీరయ్య, కుల్లి చినబాబు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. కార్యక్రమం ప్రారంభంలో జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.
జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజీ మాట్లాడుతూ, బాబు జగ్జీవన్ రామ్ చిన్నతనం నుంచే కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడి, కష్టపడి పనిచేయడం, నిబద్ధతకు మారుపేరుగా నిలిచారని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు ఉండేలా కృషి చేసిన మహనీయుడని, విద్య ద్వారానే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని, యువత ఆయన చూపిన మార్గంలో నడిచి సమానత్వ సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
బాబు జగ్జీవన్ రామ్ సమాజంలో పేదల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని, కేంద్ర మంత్రిగా దేశాభివృద్ధికి కృషి చేశారని కొనియాడారు. “ప్రతి మనిషికి సమాన హక్కులు ఉండాలి” అనే ఆయన సిద్ధాంతం నేటి సమాజానికి మార్గదర్శకమని, కూటమి ప్రభుత్వం ఆయన చూపిన మార్గాన్ని అనుసరిస్తూ సమానత్వ సమాజ నిర్మాణంపై దృష్టి పెట్టిందని బాలాజీ పేర్కొన్నారు.
కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ కరీముల్లా, మున్సిపల్ చైర్మన్ రఫాని, నియోజకవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వీరయ్య, పట్టణ అధ్యక్షులు కుల్లి చినబాబు, మార్కెట్ యార్డ్ వైస్ ప్రెసిడెంట్ పిల్లి కోటి, వివిధ హోదాల్లో ఉన్న కూటమి నాయకులు, వీర మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.