
నిడదవోలు: గోదావరి కాటన్ ఆనకట్ట పరిధిలోని విజ్జేశ్వరం ఆర్మ్ వద్ద ఉన్న వశిష్ఠ మహర్షి విగ్రహం దిమ్మె ఒక వైపునకు ఒరిగినట్లు సమాచారం అందడంతో రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఘటనాస్థలికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
విగ్రహం ప్రస్తుత స్థితిని పరిశీలించిన అనంతరం సంబంధిత వివరాలను ఇరిగేషన్ శాఖ అధికారులకు పంపించారు. అనంతరం ఇరిగేషన్ శాఖ సూపరింటెండింగ్ ఇంజినీర్‌తో ఫోన్‌లో మాట్లాడి, విగ్రహాన్ని తక్షణమే సరిచేసి యథాస్థానంలో భద్రంగా పునఃప్రతిష్ఠ చేయాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఇటువంటి పరిస్థితులు తలెత్తకుండా నిర్వహణపై నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు.
వశిష్ఠ మహర్షి సప్తరుషుల్లో ప్రముఖుడని, ఆయన పేరిట ప్రవహించే గోదావరి పాయ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగినదని మంత్రి పేర్కొన్నారు. ఈ వారసత్వాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని అన్నారు.
మంత్రి ఆదేశాల మేరకు విగ్రహ పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపదికన చేపట్టి, మరుసటి రోజుకల్లా పూర్తి చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.