
పెద్దాపురం: పెద్దాపురం పట్టణంలోని 20, 21 వార్డుల్లో నిర్వహించిన ‘ఇంటింటికి కూటమి ప్రభుత్వం’ కార్యక్రమానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు పాల్గొనగా వార్డు ప్రజలు వారికి ఘన స్వాగతం పలికారు.
నాయకులు ఇంటింటికీ వెళ్లి ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై వివరించి, ప్రజల నుంచి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్తిబాబు, కాకినాడ పార్లమెంట్ టీడీపీ ఉపాధ్యక్షుడు నిమ్మకాయల రంగా నాగ్, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబు రాజు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ ప్రజల ఆశయాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పారదర్శక పాలన అందిస్తోందని, ఎన్నికల హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అభివృద్ధి ఫలాలు ప్రతి ఇంటికీ చేరేలా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.
డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి బాబు మాట్లాడుతూ ప్రజల వద్దకే వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని పేర్కొన్నారు. సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోందని, ప్రజల నుంచి లభిస్తున్న ఆదరణ సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న వార్డు ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు. తమ సమస్యలను తెలుసుకునేందుకు ఇంటి వద్దకే వచ్చిన ప్రజాప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ జనసేన అధ్యక్షుడు పోలమరశెట్టి సత్తిబాబు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఓబిలిశెట్టి గున్ని, తూర్పు కాపు కార్పొరేషన్ డైరెక్టర్ గడ్డం పెద్దకాపు, టీడీపీ పట్టణ అధ్యక్షుడు రంది సత్యనారాయణ, జనసేన నాయకులు, టీడీపీ, బీజేపీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మహిళలు, యువత, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.