
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదల తన పేరుకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. తన పుట్టినరోజు సమీపిస్తున్న సందర్భంగా వ్యక్తిగతంగా చెప్పాలనుకున్న విషయాన్ని వెల్లడిస్తూ, ఇప్పటికీ చాలామంది తనను “అన్నా లెజ్నేవా”గా సంబోధిస్తున్నారని, అయితే అది ప్రస్తుతం తన అధికారిక పేరు కాదని స్పష్టం చేశారు.
పవన్ కళ్యాణ్‌తో వివాహం జరిగిన రోజే ఆయన ఇంటి పేరును స్వీకరించి అధికారికంగా “అన్నా కొణిదల”గా మారినట్లు తెలిపారు. తమ వివాహ ధ్రువీకరణ పత్రంలో మాత్రమే “లెజ్నేవా” అనే ఇంటి పేరు చివరిసారిగా నమోదైందని, ఆ తర్వాత అన్ని అధికారిక రికార్డుల్లో తన పేరు “అన్నా కొణిదల”గానే కొనసాగుతోందని పేర్కొన్నారు.
ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ ఖాతా ప్రారంభించినప్పటి నుంచే చెప్పాలనుకున్నప్పటికీ, సరైన సందర్భం కోసం ఎదురుచూశానని వెల్లడించారు. ఇకపై తనను “అన్నా కొణిదల”గానే పిలవాలని అభిమానులను కోరుతూ, అదే తన అసలు పేరు అని, ఆ పేరుతోనే తనకు తనగా అనిపిస్తుందని చెప్పారు. తన అభ్యర్థనను అర్థం చేసుకుని గౌరవిస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
ఈ పోస్టుతో పాటు రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో పవన్ కళ్యాణ్‌తో కలిసి వెళ్లిన తొలి పర్యటనలో తీసుకున్న ఫొటోను కూడా ఆమె పంచుకున్నారు. ఈ పోస్టుకు అభిమానుల నుంచి విశేష స్పందన లభిస్తుండగా, ఇకపై “అన్నా కొణిదల”గానే సంబోధిస్తామని పలువురు కామెంట్లు చేస్తున్నారు.