మంత్రి కందుల దుర్గేష్ చొరవతో 16 నెలల చిన్నారికి చికిత్స

  1. సీఎంఆర్ఎఫ్ ద్వారా రాజమహేంద్రవరంలో తన్విక్ కార్తికేయకి లివర్ ఆపరేషన్.. అండగా నిలిచిన మంత్రి దుర్గేష్ కు కృతజ్ఞతలు తెలిపిన చిన్నారి తల్లిదండ్రులు
  2. ప్రాణాపాయం నుండి బయటపడ్డ తన్విక్ కార్తికేయ – ఇంటికి వెళ్లి ఆప్యాయంగా పరామర్శించిన మంత్రి దుర్గేష్
  3. తన్విక్ చికిత్సలో మంత్రి దుర్గేష్ చూపిన చొరవ అమోఘం అంటున్న ప్రజలు..”మేము జీవితాంతం రుణపడి ఉంటాం” అంటూ కన్నీటి పర్యంతమైన తన్విక్ తల్లిదండ్రులు.

నిడదవోలు: రాజకీయ నేత అంటే కేవలం అధికారం మాత్రమే కాదు, ఆపదలో ఉన్నవారికి అండగా నిలిచే మనసున్న వారని మంత్రి కందుల దుర్గేష్ మరోసారి నిరూపించుకున్నారు. నిడదవోలు నియోజకవర్గం పెరవలి మండలం అన్నవరప్పాడు గ్రామానికి చెందిన 16 నెలల పసికందు ఈనుగు తన్విక్ కార్తికేయకు చికిత్స అందించి ప్రాణాలను కాపాడడంలో మంత్రి దుర్గేష్ చూపిన చొరవ ఆ కుటుంబంలో వెలుగులు నింపింది. వివరాల్లోకి వెళ్తే చిన్నారి తన్విక్ కార్తికేయ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ అత్యవసర చికిత్స కావాల్సిన స్థితిలో రాజమహేంద్రవరం దానవాయిపేటలోని రెయిన్ బో చిల్డ్రన్స్ హాస్పిటల్‌లో చేరారు. ఆపరేషన్ ఖర్చు భరించలేని స్థితిలో ఉన్న ఆ పేద కుటుంబం మంత్రి దుర్గేష్ ని ఆశ్రయించింది.

చిన్నారికి కాలేయ వ్యాధి తీవ్రంగా ఉందని తెలియగానే మంత్రి దుర్గేష్ వెంటనే స్పందించి అమరావతిలోని తన పేషీకి కాల్ చేసి అక్కడి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా రూ. 2.5 లక్షల ఎల్ వోసీని యుద్ధప్రాతిపదికన మంజూరు చేయించారు. కేవలం నిధులు మంజూరు చేయడమే కాకుండా, ఆసుపత్రి యాజమాన్యంతో స్వయంగా మాట్లాడి చిన్నారికి మెరుగైన వైద్యం అందేలా చూశారు.

చికిత్స ఖర్చులు తగ్గేలా ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడారు. ఆపరేషన్ విజయవంతమై చిన్నారి ఇంటికి చేరుకున్న విషయం తెలుసుకున్న మంత్రి దుర్గేష్ సోమవారం స్వయంగా వారి ఇంటికి వెళ్లి చిన్నారి ఆరోగ్యంపై ఆరా తీసారు. అనంతరం ఆ పసివాడితో కాసేపు సరదాగా గడిపారు. చిన్నారి కోలుకుంటున్న తీరును చూసి మంత్రి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా తల్లిదండ్రులతో మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ.. భవిష్యత్తులో చిన్నారికి ఏ అవసరం వచ్చినా అండగా ఉంటామని భరోసానిచ్చారు. మంత్రి హోదాలో ఉన్నా, సామాన్యుడిలా చిన్నారి ఇంటికి వెళ్లి పసివాడితో గడపడం, తల్లిదండ్రులకు భవిష్యత్తుపై భరోసా ఇవ్వడం ఆయన చిత్తశుద్ధికి నిదర్శనమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.