ప్రకృతి ఒడిలో అభివృద్ధి జాడలు.. గిరిజనం మధ్య ప్రగతి ప్రణాళికలు

• వినూత్నంగా జనసేన 13వ ఆవిర్భావ దినోత్సవం
• గిరిపుత్రుల మధ్య పార్టీ జెండా ఆవిష్కరించిన శ్రీ పవన్ కళ్యాణ్
• అడవి బిడ్డలతో మమేకమైన ఉప ముఖ్యమంత్రి
• కాలినడకన అడవితల్లి బాట రోడ్ల నాణ్యత పరిశీలన
• సమస్యలు తెలుసుకుంటూ.. స్పాట్ లో పరిశీలిస్తూ సాగిన శ్రీ పవన్ కళ్యాణ్
• జల్ జీవన్ మిషన్ పథకం పనుల పరిశీలన
• తాగునీటి సౌకర్యానికి నిధులిచ్చిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ధన్యవాదాలు

భారీ వేదికలు లేవు. హోర్డింగులు, డీజే శబ్దాల హోరు లేదు. పచ్చటి ప్రకృతి ఒడిలో, ప్రతి అడుగులోనూ ప్రగతి ప్రణాళికలు రూపొందిస్తూ, ఇప్పటి వరకు ప్రజలకి ఏం చేశాం? ఇంకా ఏం చేయొచ్చు అని ఆలోచనలు చేస్తూ.. పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మన్యం గ్రామాల్లో గిరి పుత్రుల మధ్య వినూత్నంగా నిర్వహించారు జనసేన పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గం పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాలు, కొత్తగా నిర్మించిన రోడ్లు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికలయ్యాయి. అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా నిర్మించిన రోడ్లు, జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన తాగునీటి కుళాయిలు, గిరిజన గూడాల్లో ఉన్న స్కూళ్లను పరిశీలిస్తూ ముందుకు సాగిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు గిరిపుత్రుల చెంతకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గిరిజన గ్రామాల్లో సౌకర్యాల కల్పన, ఉపాధి కల్పనకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. మాటా మంతి కార్యక్రమం ద్వారా ఏజెన్సీ ప్రజలతో మమేకం అయ్యారు. పాడేరు నియోజకవర్గం పరిధిలోని ఓనూరు, నందిగరువు తదితర గ్రామాలు ఈ వేడుకలకు వేదికగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర ఆహార పౌరసరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.
• ఓనూరు కూడలి వద్ద జెండా ఆవిష్కరణ
జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈసారి గ్రామ స్థాయిలో నిర్వహించాలని పార్టీ శ్రేణులకు పిలుపు ఇచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, తానూ ఓ మారుమూల గిరిజన గ్రామంలో అడవిబిడ్డల మధ్య జరుపుకొన్నారు. ఓనూరు కూడలి వద్ద నిర్మించిన నూతన జెండా స్థూపాన్ని ఆవిష్కరించి పార్టీ శ్రేణులకి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.
• పీఎం జన్ మన్ (అడవితల్లి బాట) ద్వారా నిర్మించిన రోడ్ల పరిశీలన
అనంతరం పీఎం జన్ మన్ పథకం ద్వారా ఓనూరు జంక్షన్ నుంచి నందిగరువు వరకు 2.4 కిలోమీటర్ల పొడుగున నిర్మించిన నూతన రహదారిని కాలినడకన పరిశీలించారు. రూ. 1.70 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్డు నిర్మాణ శైలి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని ఆకట్టుకుంది. కొండలను తొలచి, మార్గమధ్యంలో ఉన్న బండలను తొలగించి, ఎంతో కష్టపడి నాణ్యత వ్యవహారంలో రాజీపడకుండా నిబద్ధతతో రోడ్డును పూర్తి చేసిన అధికారులను అభినందించారు. 2.4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం కోసం మధ్యలో 8 కల్వర్టులు నిర్మించాల్సి వచ్చిందని ఈ సందర్భంగా అధికారులు తెలియజేశారు. కాలినడకన వెళ్తూ.. కల్వర్టులు, రోడ్లకు ఇరువైపులా గిరిజనుల సాగులో ఉన్న పొలాలను పరిశీలించారు. చిన్నారులతో కలసి థ్యాంక్యూ మోదీజీ అంటూ రోడ్డు నిర్మాణానికి పీఎం జన్ మన్ నిధులు కేటాయించినందుకు ప్లకార్డులు ప్రదర్శిస్తూ గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా పోడు వ్యవసాయ కమతాల్లో చేపట్టిన భూ అభివృద్ధి పనుల వివరాలు అధికారులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరించారు. కొండవాలు పోడు భూముల్లో ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన రాళ్ల గోడలను పరికించారు.
• ఆప్యాయంగా స్వాగతించిన గిరిజనం
తమ గ్రామాలకు కొత్త రోడ్డు వేయడంతో పాటు జల్ జీవన్ మిషన్ పథకం కింద శుద్ధమైన తాగునీరు అందించే ఏర్పాటు చేసిన ఉపముఖ్యమంత్రివర్యులకు గిరిజనులు అడుగడుగునా ఘనస్వాగతం పలికారు. ఓనూరు జంక్షన్ వద్ద సంప్రదాయ థింసా నృత్యంతో ఆహ్వానం పలికారు. తమ గ్రామాల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టాలని కోరుతూ వినతిపత్రాలు అందజేశారు. ఓనూరు గ్రామం వద్ద ఆడపడుచులు తాము పండించిన గులాబీలు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అందజేస్తూ స్వాగతం పలికారు.
• కొత్త కుళాయిల్లో నీటి నాణ్యత పరిశీలన
అనంతరం ఓనూరు గ్రామ పంచాయతీ పరిధిలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా చేపట్టిన తాగునీటి పథకం వివరాలను అధికారులు వివరించారు. మొత్తం రూ. 8.30 లక్షల వ్యయంతో 60 ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇవ్వగా అందులో 50 శాతం మ్యాచింగ్ గ్రాంట్ రూపంలో రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చినట్టు తెలిపారు. గ్రామంలో జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా ఏర్పాటు చేసిన కుళాయిల వద్దకు వెళ్లి బిందెతో నీటిని పట్టి నీటి స్వచ్ఛతను పరిశీలించారు. ప్రజల అవసరాలకు సరిపడా నీరు అందుతుందా అని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. స్వచ్ఛమైన తాగునీరు అందించినందుకు గ్రామస్తులతో కలసి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ ప్లకార్డు ప్రదర్శించారు.
• పాఠశాల భవనం పరిశీలన, విద్యార్ధులకు స్టేషనరీ కిట్లు
అనంతరం ఓనూరు గ్రామంలోని అంన్వాడీ కేంద్రాన్ని, మండల ప్రాథమిక పాఠశాలను పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు స్వీట్లు, పౌష్టికాహార కిట్లు అందజేశారు. గర్భిణులకు, అంగన్వాడీ వర్కర్లకు నూతన వస్త్రాలు బహూకరించారు. అనంతరం సూల్లో విద్యార్ధులను పలుకరించారు. వారితో కలిసి ఫోటోలు దిగారు. దెబ్బ తిన్న ఫ్లోరింగ్ కు తక్షణం మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. మన బడి మన భవిష్యత్ కార్యక్రమం కింద ఇప్పటికే స్కూల్ మరమ్మతులకు నిధులు మంజూరైనట్టు అధికారులు తెలిపారు. విద్యార్ధులకు స్కూల్ బ్యాగులు,పుస్తకాలు, ఇతర స్టేషనరీతో కూడిన కిట్లను బహూకరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులకు నూతన వస్త్రాలు బహూకరించారు. శ్రీమతి డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం కింద ఇస్తున్న రోజు వారీ మెనూ వివరాలను పరిశీలించారు. ఓనూరు గ్రామంలో నిర్మించిన సిమెంట్ రోడ్ల నాణ్యత పరిశీలించి, మ్యాజిక్ డ్రెయిన్ల నిర్మాణం కూడా చేపట్టాలని సూచించారు.
• స్పాట్ లో కొత్త రోడ్ల మంజూరు
ఓనూరు, నందిగరువు మార్గం మధ్యలో కొండ దిగువున ఉన్న కొత్తపొలం గ్రామస్తులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశారు. తమ గ్రామానికి రోడ్డు, తాగునీటి సౌకర్యం, పాఠశాల భవనం కావాలని కోరుతూ గిరిజన ఆడపడుచులు వినతిపత్రం అందజేశారు. సమస్య చెప్పిన వెంటనే సంబంధిత శాఖల ఉన్నతాధికారులను పిలిచి తక్షణం కొత్తపొలం గ్రామస్తులు కోరిన సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. ఎంపిక చేసిన అత్యంత దాహర్తి కలిగిన 3 వేల గ్రామాల జబితాలో కొత్తపొలం ఉన్నట్టు, కొత్తపొలంకి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ఇప్పటికే రూ. 6.90 లక్షల నిధులు మంజూరు చేసినట్టు తెలిపారు. వీబీ జీ రాం జీ పథకం కింద రోడ్డును మంజూరు చేశారు. గ్రామస్తులు చెప్పిన ప్రతి సమస్య పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
• గిరిజనుల ఆదాయం పెంచే విధంగా ప్రణాళికలు
అడవితల్లి బాట కింద గిరిజన గ్రామాలకు నిర్మించిన రోడ్లకి ఇరువైపులా పనస, సీతాఫలం లాంటి పండ్ల మొక్కలు నాటాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు అధికారులకు సూచించారు. తద్వారా గిరిజనులకు అదనపు ఆదాయం చేకూరుతుందన్నారు. కొండవాలు ప్రాంతాల్లో బ్యాంబూ కాటేజీలు ఏర్పాటు చేయడం ద్వారా ఎకో టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలనీ, హోం స్టేలు, ఫిల్మ్ షూటింగ్ స్పాట్లుగా గిరిజన గ్రామాల్లోని వ్యూ పాయింట్లను అభివృద్ధి చేయాలనీ దిశా నిర్దేశం చేశారు. ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల్లో గిరిజన యువతకు ప్రత్యేక శిక్షణ ఇప్పించాలన్నారు. ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఉన్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
• గిరిజన ఆడపడుచుల కోసం….
తమ గ్రామానికి రోడ్డు వేసి సౌకర్యం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపేందుకు నందిగరువు గ్రామ ఆడపడుచులు కాలినడకన వస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి ఓనూరు శివారు వరకు ఎదురొచ్చారు. మా గ్రామానికి తీసుకువెళ్లేందుకు వచ్చాం. మీతో కలసి నడుస్తామని అడిగారు. వారి కోరిక మేరకు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నందిగరువు గ్రామం వరకు వారితో కలసి నడక కొనసాగించారు.
• మాది కూటమి ప్రభుత్వం.. ఎవరైనా సమస్య చెప్పుకోవచ్చు
నందిగరువు గ్రామంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్లను పరిశీలిస్తూ ఉండగా ఓ మహిళ తన సమస్య చెప్పుకునే అవకాశం ఇవ్వాలని కోరగా, ఆయన స్పందించారు. మాది కూటమి ప్రభుత్వం. వైసీపీ ప్రభుత్వం మాదిరి సమస్య చెబితే వేధించే ప్రభుత్వం కాదు. మాటా మంతి కార్యక్రమం వద్దకు వచ్చి మీ సమస్య తెలియజేయండి. పరిష్కరిస్తామని అన్నారు.
• వర్థనపల్లి గ్రామస్తులతో మమేకం
అంతకు ముందు పాడేరు సమీపంలోని వర్థనపల్లి గ్రామంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పరిశీలించారు. గ్రామంలో అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థను పరిశీలించారు. డ్రైనేజీలు నిర్వహణ లేక పూడిపోయి ఉండడాన్ని గమనించారు. మ్యాజిక్ డ్రెయిన్ల ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామస్తుల కోరిక మేరకు రచ్చబండ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి హామీ ఇచ్చారు. శిధిలావస్థకు చేరిన శివాలయాన్ని పరిశీలించారు. పాడేరు పర్యటనకు వచ్చిన శ్రీ పవన్ కళ్యాణ్ గారికి దారిపొడుగునా గిరిపుత్రులు ఘనస్వాగతం పలికారు. గిరిజన సంప్రదాయాల ప్రకారం పసుపు కలిపిన అక్షతలతో నుదిటిన బొట్లు పెట్టి ఆహ్వానం పలికారు. గిరిజన ప్రాంతాల్లో పూసే పూలు, కాఫీ గింజలతో తయారు చేసిన పుష్పగుచ్చాలను అందజేశారు. దారిపొడుగునా తమ సమస్యలు తెలియజేస్తూ అర్జీలు సమర్పించారు. తిరుగు ప్రయాణంలో పాడేరు శివారులోని శ్రీ లలితా త్రిపుర సుందరి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.