జనసేన సభ్యత్వ నమోదుకు శ్రీకారం

• తొలి సభ్యత్వం తీసుకున్న పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్
• కార్యకర్తల బీమా కోసం రూ.2 కోట్లు విరాళం
• రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి సభ్యత్వ నమోదు ప్రక్రియ
• పిఠాపురం నియోజకవర్గంలో వారం ముందే మొదలు
• ఇక నుంచి పార్టీకి సేవ చేసే వారిని ఉద్యమి, సాధక్, ప్రదాతలుగా గుర్తింపు
• మంగళగిరి కేంద్ర కార్యాలయంలో జరిగిన క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆదివారం ఉదయం మంగళగిరి కేంద్ర కార్యాలయంలో ప్రారంభించారు. తొలి సభ్యత్వం తీసుకొని, కార్యకర్తల బీమా కోసం రూ.2 కోట్లను విరాళంగా అందించారు. ఇందుకు సంబంధించిన చెక్కును పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్ గారికి అందజేశారు. ఐదో విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 26 నుంచి మొదలవుతుందని, పిఠాపురం నియోజకవర్గంలో మాత్రం ఒక వారం ముందు నుంచే ప్రారంభమవుతుందని తెలిపారు. పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకొని, పార్టీ సిద్ధాంతాలు, ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసేందుకు ఎవరైతే ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వం తీసుకుంటారో వారిని “ఉద్యమి”గా, జనసైనికుడికి, పార్టీ నాయకులకు మధ్య సమన్వయకర్తగా, పార్టీ పోరాటానికి మరింత బలాన్ని అందించి, కొత్త రక్తాన్ని పార్టీలోకి తీసుకొచ్చి, సభ్యత్వ నమోదు చేయించే వారిని “సాధక్”గా, జనసేన పార్టీ చేస్తున్న ప్రజా, రాజకీయ పోరాటానికి పరోక్షంగా తమ వంతు సమయాన్ని, ఆర్థిక, సాంకేతిక, సేవా, మేధో సహాయ సహకారాలు అందిస్తూ పార్టీ బలోపేతానికి కృషి చేసేవారిని “ప్రదాత”గా పిలవాలని అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నారు. గత సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలు చేసిన వారి సమక్షంలో ఆదివారం ఉదయం పార్టీ కేంద్ర కార్యాలయంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఎవరైతే పార్టీలో నాయకుడిగా ఎదగాలనుకుంటున్నారో వారు క్షేత్రస్థాయిలో పని చేసే కార్యకర్త కష్టాన్ని గుర్తించాలి. పార్టీ ఉన్నతి కోసం ఉద్యమి, సాధక్, ప్రదాతగా మారి పనిచేయాలి. అప్పుడే వారు పార్టీలో సంపూర్ణ నాయకులుగా ఎదుగుతారు.
• నిబద్ధతగల నాయకత్వం చాలా అవసరం
ఏ వ్యవస్థ అయినా మనుగడ సాధించాలంటే నిబద్ధత, నిజాయతీ కలిగిన నాయకత్వం చాలా అవసరం. 1905లో అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ బెంగాల్ విభజన చేసినప్పుడు దేశమంతా ఒక్క తాటిపైకి వచ్చి పోరాడింది. దాంతో బెంగాల్ విభజన ఆగిపోయింది. తర్వాత కాలంలో అదే ప్రాంతం ముక్కలు అవుతుంటే ఆపడానికి ఎవరూ ముందుకు రాలేదు. దీని గురించి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని కొందరు అడిగితే పోరాటం చేసే యువతను తయారు చేసుకోలేకపోయామన్నారు . విలువలు, నిబద్ధత కూడిన నాయకత్వం అవసరం. జనసేన పార్టీకి వందలు, వేల మంది అవసరం లేదు. లక్షల మెదళ్లను కదిలించే వాళ్లు కావాలి. అలాంటి వాళ్లు పదిమంది ఉన్నా ఈ సమాజంలో మార్పు తీసుకురావచ్చు.
• జనసేన భావజాలం… 21వ శతాబ్దానికి రైట్ ఐడియాలజీ
జనసేన పార్టీ భావజాలం చాలా బలమైనది. 21వ శతాబ్దానికి రైట్ ఐడియాలజీ. ఈ రోజు మనల్ని తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలకు ఆహ్వానిస్తున్నారంటే దానికి కారణం మన భావజాలమే. ప్రజాస్వామ్య విలువను, రాజ్యాంగ విలువను కాపాడే వారికి సముచిత స్థానం కల్పించాలి. పదవికి లేదా ఓ సముచిత స్థానానికి ఓ వ్యక్తి కరెక్ట్ అనిపించినప్పుడు కులం, మతం, ప్రాంతాలను పక్కనపెట్టాలి. శ్రీ దామోదరం సంజీవయ్య గారు ఎస్సీ కులం నుంచి వచ్చినా… అన్ని కులాల వారు ఆయన్ను ప్రేమించారు కనుకే ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. డా.అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యారంటే దాని వెనుక అందరి సహకారం ఉంది. కులం, మతం మీదనే ముందుకు వెళ్లాలి అనుకుంటే కొంతమేరకే ప్రయోజనాలు కలుగుతాయి. దీర్ఘకాలం నిలబడాలి అంటే దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముందుకు వెళ్లాలి.
• ఉద్యమి… సాధక్… ప్రదాత
జనసేన క్రియాశీలక సభ్యుడు, జనసేన వాలంటీర్ అనే పదాలు నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదు. జనసేన పార్టీ సభ్యత్వం స్వీకరించిన వారిని ఇక నుంచి ‘‘ఉద్యమి’’గా పిలుద్దాం. ఉద్యమి అనేది సంస్కృతి పదం. శ్రీ నారాయణ పండితుల వారు చెప్పిన సుభాషితం నుంచి ఈ పదాన్ని తీసుకున్నాం. ఏదైనా సత్కార్యాన్ని సంకల్పించినప్పుడు దృఢ చిత్తంతో ఉండాలి. ఆ కార్యాన్ని కొనసాగించడానికి కృషి చేయాలి. కార్యసాధనలో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకొని లక్ష్యాన్ని సాధించేందుకు పట్టు వదలకుండా ముందుకు కదిలేవాడినే ఉద్యమి అని పిలుస్తారు. అందుకే మన పార్టీ క్రియాశీలక కార్యకర్తలకు ‘‘ఉద్యమి’’ అనే గౌరవప్రదమైన పేరును ఖరారు చేశాం. ఇక నుంచి పార్టీ క్రియాశీలక సభ్యత్వాన్ని ‘‘ఉద్యమి మెంబర్ షిప్’’ గా ప్రకటిస్తున్నాం. జనసేన చేపట్టే సభ్యత్వ నమోదులో కీలకం వాలంటీర్లు. ఈ బాధ్యతను చేపట్టే వారిని గుర్తిస్తూ వారిని ‘‘సాధక్’’లుగా పిలుద్దాం. క్షేత్రస్థాయిలో తన పరిధిలో ఉన్న సమూహంలో ప్రేరణ కలిగించి, పార్టీ సిద్ధాంతాల పట్ల, కార్యక్రమాల పట్ల ఆకర్షితులను చేసి ఉద్యమిలుగా చేసే బాధ్యత కలిగిన వారిని అభినందిస్తూ, గౌరవించాలనే ఉద్దేశంతో సాధక్ అని పేరును నిర్ణయించాం. పార్టీ అప్పగించిన బాధ్యతలను నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలనే తపన, పట్టుదల కలిగిన వ్యక్తి సాధక్. కార్యసాధనలో ఎదురయ్యే సవాళ్లను కూడా అధిగమించి ముందుకు వెళ్లే స్థైర్యం వీరిలో ఉంటుంది. జనసేన పార్టీ అంటే అంతులేని అభిమానం, పార్టీ సిద్ధాంతాల పట్ల విశ్వాసం, పార్టీ నాయకత్వం పట్ల నమ్మకం కలిగి ఉన్న వారు ఎందరో ఉన్నారు. అయితే వారికున్న పరిమితులు, పని భారం, బాధ్యతలు, ఇతర కారణాల వల్ల క్రియాశీలకంగా రాజకీయాల్లోకి రాలేకపోవచ్చు. పార్టీపరంగా ఏ పదవినీ ఆశించకపోవచ్చు. అయితే వారి మనసులో పార్టీ పట్ల అభిమానం ఉంటుంది. వారికున్న వనరులతో పార్టీకి అండగా నిలబడతారు. పార్టీకి, పార్టీ సభ్యులకు తోడ్పాటు ఇవ్వాలనే సంకల్పంతో స్పందించి భరోసా ఇస్తారు. అలాంటి వారికి పార్టీలో సముచిత గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక నుంచి వారికి ‘‘ప్రదాత’’ పేరుతో గుర్తింపు ఇస్తున్నాం. పదవుల కోసం కాకుండా దేశ విశాల ప్రయోజనాన్ని, సమాజ క్షేమాన్ని ఆకాంక్షిస్తూ సహృదయంతో జనసేనకి తోడ్పాటు ఇస్తున్న వారికి గౌరవప్రదంగా ఇచ్చే గుర్తింపే ప్రదాత.
• తెలంగాణలో ముందడుగు పడింది
మొన్న జరిగిన తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో నేను వెళ్లి ప్రచారం చేయకపోయినా… ఎన్నికల్లో జనసేన పార్టీ నిలబడాలి, మన గళం తెలంగాణలో వినిపించాలనే ఆకాంక్షతో పోటీ చేసి రెండు స్థానాల్లో గెలుపొందారు. అది చిన్న గెలుపే కావచ్చు. కానీ అది మార్పునకు బలమైన సంకేతం. జనసేన పార్టీ… ఆంధ్రప్రదేశ్ పార్టీ తెలంగాణలో పోటీ ఏంటని కొందరు విమర్శించినా… మన జనసైనికులే వారి మాటలను తిప్పికొట్టారు. కాంగ్రెస్ ఢిల్లీలో పుట్టలేదా? టీఆర్ఎస్ … బీఆర్ఎస్ గా మారలేదా? అని సమాధానం ఇచ్చారు. ప్రతి పార్టీ కూడా వాటి విస్తృతి పెంచుకుంటూ వెళుతుంది. జనసేన పార్టీ కూడా అంతే. జనసేన ఒక రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాదు. జనసేన పార్టీకి ఆయువు పట్టు యువత. వాళ్ల శక్తి అనే ఇంధనం మీదే పార్టీ నడుస్తోంది. బాధ్యతయుతమైన యువతను నాయకత్వం వైపు తీసుకెళ్లడమే మా లక్ష్యం. అందులో భాగంగానే తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో దివ్యాంగురాలైన ఎగుగంటి నీత గారు, చెప్పులు కుట్టుకునే బోరవెల్లి సత్య నగేష్ గారు, అంధుడైన కళ్యాణ్ వెంకటేష్ గారికి పోటీ చేసే అవకాశం లభించింది” అన్నారు.
• సభ్యత్వం నుంచి మొదలైన ప్రస్థానం నాయకత్వంగా ఎదగాలి : శ్రీ నాదెండ్ల మనోహర్
“26వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ 5వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈ రోజు శివరాత్రి పర్వదినాన పార్టీ అధ్యక్షులు, గౌరవ ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మొదటి సభ్యత్వం తీసుకుని కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రూ.2 కోట్లు అందించడం సంతోషదాయకం. పిఠాపురం నియోజకవర్గంలో వారం రోజులు ముందుగా ఈ కార్యక్రమం ప్రారంభం అవుతుంది. అక్కడ అధ్యక్షుల వారు సభ్యత్వ నమోదు, నాయకత్వ పెంపుపై ప్రత్యేక దృష్టి సారించారు.ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా ముందుకు తీసుకువెళ్లాలి. క్రియాశీలక సభ్యత్వం నుంచి మొదలైన మీ ప్రస్థానం నాయకులుగా ఎదిగే స్థాయికి చేరాలి. ప్రతి కార్యకర్త క్షేత్ర స్థాయిలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలకు అనుగుణంగా నడుచుకోవాలి.
• 90 వేలతో మొదలై… 13 లక్షలకు చేరాం
2020లో మొదటి విడత క్రియాశీలక సభ్యత్వం ప్రారంభించినప్పుడు 90 వేలు నమోదు చేశాం. ఎన్నికల ముందు ఆ సంఖ్య ఆరు లక్షలకు చేరింది. ఎన్నికల తర్వాత 12.98 లక్షల సభ్యత్వాలు సాధించాం. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారి నుంచి కూలి పనులు చేసుకునే వారు, చదువుకున్న వారు.. ఎంతో మంది ఈ ప్రక్రియలో భాగస్వాములయ్యారు. క్షేత్ర స్థాయిలో మీరు పడుతున్న కష్టాన్ని ముందుకు తీసుకువెళ్లే విధంగా, స్థానిక సంస్థల ఎన్నికల్లో యువతకు నాయకత్వ అవకాశాలు ఇచ్చే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నాం. జనసేన పార్టీ నూటికి నూరు శాతం రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం పని చేస్తుంది. కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు కృషి చేయాలి”.
• ఆప్యాయంగా పలకరిస్తూ…
గత ఏడాది సభ్యత్వ నమోదులో అత్యధిక సభ్యత్వాలు చేసినవారితో శ్రీ పవన్ కళ్యాణ్ గారు కాసేపు సరదాగా గడిపారు. ఆప్యాయంగా పేరుపేరునా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వారికి స్వయంగా అల్పాహారం వడ్డించారు. ఈ కార్యక్రమంలో శాసనమండలిలో ప్రభుత్వ విప్, పార్టీ అధ్యక్షుల వారి రాజకీయ కార్యదర్శి శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు, పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి, పార్టీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ శ్రీ కళ్యాణం శివ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.