వేసవి నీటి సమస్యలపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్ష

రాజోలు: రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రాజోలు నియోజకవర్గంలో త్రాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడం కోసం ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ సమీక్షా సమావేశాలు నిర్వహించారు. సఖినేటిపల్లి, మలికిపురం మండలాలకు మలికిపురం ప్రజా పరిషత్ కార్యాలయంలో, రాజోలు, మామిడికుదురు మండలాలకు రాజోలు ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ సమావేశాలు జరిగాయి.

ఈ సమావేశాలలో ఆర్.డబ్ల్యు.ఎస్ & ఎస్ శాఖ, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎం.పి.డి.ఓలు, పి.ఆర్ & ఆర్.డి అధికారులు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఈసారి ఎల్ నినో ప్రభావంతో ఎండలు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని, వర్షపాతం తక్కువగా ఉండవచ్చని తెలిపారు. అందువల్ల గ్రామ స్థాయిలో ముందస్తు త్రాగునీటి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు.

ప్రతి గ్రామంలో నీటి సమస్యలు ఉన్న ప్రాంతాలను గుర్తించి, ఎన్ని ఇండ్లు ప్రభావితమవుతున్నాయో వివరాలతో పంచాయతీ స్థాయిలో ప్రత్యేక తీర్మానాలు రూపొందించాలని ఆదేశించారు. అవసరమైతే ట్రాక్టర్లు, ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయడానికి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేయాలని చెప్పారు.

అమరజీవి జలధార (వాటర్ గ్రిడ్) ప్రాజెక్ట్ పనుల పురోగతిని సమీక్షిస్తూ, అవసరమైన చోట కొత్త పైప్‌లైన్లు వేయడం, పాడైన పైప్‌లైన్లు మార్చడం, ట్యాపులు ఏర్పాటు చేయడం, అవసరమైన చోట నీటి ట్యాంకులు ఏర్పాటు చేయడం వంటి వివరాలను సమగ్రంగా సమర్పించాలని అధికారులకు సూచించారు.

ఇరిగేషన్ శాఖకు సంబంధించి కాలువల పూడికలు తొలగించడం, చెట్ల కొమ్మలు కత్తిరించడం, అక్రమ ఆక్రమణలను తొలగించడం వంటి పనులను పూర్తి చేసి చివరి ప్రాంతాల రైతులకు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

అదేవిధంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా, ట్రాన్స్‌ఫార్మర్లు, రహదారులు, శానిటేషన్ వంటి అంశాలపై కూడా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు బాధ్యతగా వ్యవహరించి గ్రామాల్లో శానిటేషన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

వేసవికాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులకు సూచించారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.