
* విజయవాడలో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘ఉద్యమి టు ఉన్నతి’ ఎగ్జిబిషన్-2026 సందర్శన
* ప్రతి ఇంటి నుండి ఒక పారిశ్రామికవేత్త రావాలన్నదే కూటమి ప్రభుత్వ ఆశయమని పేర్కొన్న మంత్రి దుర్గేష్
విజయవాడ, మహిళా పారిశ్రామికవేత్తల అభివృద్ధి మరియు వారి ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ అవకాశాలను కల్పించడమే కూటమి ప్రభుత్వ ప్రాధాన్యత అని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ మద్దతుతో అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంట్రప్రెన్యూర్స్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో విజయవాడ సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్లో ఏర్పాటు చేసిన “ఉద్యమి టు ఉన్నతి” – ఎగ్జిబిషన్ 2026ను బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ ఎగ్జిబిషన్‌లోని వివిధ స్టాళ్లను సందర్శించి, ఉత్పత్తుల తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అరకు ఆర్గానిక్ మిల్లెట్స్, వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ కింద హస్తకళలు, ఆర్గానిక్ వ్యవసాయ ఉత్పత్తులు, చేనేత వస్త్రాలు మరియు ఈవీ ఛార్జింగ్ వంటి సాంకేతిక ఆధారిత స్టాళ్లను మంత్రి ఆసక్తిగా పరిశీలించారు.
అనంతరం మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ చిన్నతరహా పరిశ్రమలను పబ్లిక్ సెక్టార్ యూనిట్లు (పి.ఎస్.యు), బి2బి మరియు బి2సి మార్కెట్లతో అనుసంధానించడం ద్వారా మహిళా పారిశ్రామికవేత్తలకు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆశయం మేరకు ఆంధ్రప్రదేశ్‌లో “ప్రతి ఇంటికొక పారిశ్రామికవేత్త”ను తయారు చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ‘వన్ ఫ్యామిలీ – వన్ ఎంట్రప్రెన్యూర్’ కార్యక్రమం ద్వారా లక్షలాది మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్ది, ప్రతి కుటుంబంలో ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకురావడానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల స్థాపన మరియు పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు.