
• కొత్త లక్ష్యాలతో ముందుకు వెళ్దాం
• సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాధ్యతగా ముందుకు తీసుకెళ్లండి
• 25 పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
క్షేత్రస్థాయిలో జనసేన జెండా మోసే కార్యకర్తకు భరోసా కల్పించాలనే సదుద్దేశంతో ఈ నెల 26 నుంచి ప్రారంభం కానున్న “జనసేన ఉద్యమి” సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రతి నియోజకవర్గంలో పక్కా ప్రణాళికతో ముందుకు తీసుకువెళ్లాలని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. గ్రామ స్థాయి నుంచీ కొత్త నాయకత్వాన్ని గుర్తించే విధంగా పని చేయాలని సూచించారు. బాధ్యతలు అప్పగించిన ప్రతి ఒక్కరు సభ్యత్వ నమోదులో పాల్గొని మీ పరిశీలనకు వచ్చిన వివరాలు నమోదు చేసుకోవడంతోపాటు, గతంలో పార్టీ తరఫున బీమా చెక్కులు అందుకున్న కుటుంబాలను కలిసి పరామర్శించేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. సోమవారం సాయంత్రం సభ్యత్వ నమోదు కార్యక్రమం కోసం నియమించిన 25 పార్లమెంట్ నియోజకవర్గాల సమన్వయకర్తలతో సమావేశమయ్యారు. సభ్యత్వ కార్యక్రమాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ సభ్యత్వ నమోదు ఏటా భారీగా పెరుగుతోంది. ఇది పార్టీ బలాన్ని చాటి చెబుతోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో తొలుత నామ మాత్రంగా సభ్యత్వం నమోదు అయితే… నాలుగో విడతలో ఆ సంఖ్య 10 వేలు దాటింది. మన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు మేరకు చాలా మంది దిగువ మధ్య తరగతి యువత పార్టీ సభ్యత్వం తీసుకొని, కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. గతం కంటే రెట్టింపుగా పార్టీకి కొత్త సభ్యులను చేర్చాలి. అవకాశం ఉన్న చోట కొత్త లక్ష్యాలతో సభ్యత్వ నమోదును విస్తృతం చేయాలని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలో జనసేన జెండా ఎగరవేసేలా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి” అన్నారు.
• నియోజకవర్గానికి 100 మంది వరకు సాధక్ లను ఎంపిక చేస్తున్నాం : శ్రీ పిడుగు హరిప్రసాద్, ప్రభుత్వ విప్
శాసన మండలిలో ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరిప్రసాద్ గారు మాట్లాడుతూ… “గతంలో ప్రతి నియోజకవర్గానికి 25 మంది సాధక్ లకు మాత్రమే అవకాశం ఇచ్చేవాళ్లం. కొంచెం ఎక్కువ మందికి ఇవ్వాలని నియోజకవర్గాల నుంచి కోరడంతో ఆ సంఖ్యను 75 నుంచి 100 మంది వరకు పెంచే ఏర్పాటు చేస్తున్నాం. నాలుగో విడతలో 12.6 లక్షల సభ్యత్వాలు నమోదయ్యాయి. ఇప్పుడు దానికి మూడు రెట్లు పెరిగేలా మనందరం కష్టపడాల”న్నారు. కేంద్ర కార్యాలయంలో సాంకేతికంగా అంతా సన్నద్ధంగా ఉన్నాము, ఏవైనా సమస్యలు వస్తే సత్వరమే స్పందించే ఏర్పాట్లు చేశామని పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ రామ్ తాళ్లూరి గారు తెలిపారు. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారు, ప్రభుత్వ విప్ శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారు తమ పరిశీలనకు వచ్చిన విషయాలను ప్రస్తావించారు.