
- జనసేన సభ్యత్వ మహోత్సవానికి శ్రీకారం – రాష్ట్రంలో నెంబర్ వన్ లక్ష్యం
తిరుపతి: అరణి శ్రీనివాసులు అధ్యక్షతన నిర్వహించిన జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం, జనసేన ఉద్యమి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్, జనసేన పార్టీ పిఏసి సభ్యుడు, జిల్లా అధ్యక్షుడు డా. పసుపులేటి హరిప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారీగా జనసైనికులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొని సభను విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇప్పటివరకు “జనసేన క్రియ వాలంటీర్”గా కొనసాగుతున్న వ్యవస్థను ఇకపై అధికారికంగా “జనసేన ఉద్యమి”గా నామకరణం చేసినట్లు వెల్లడించారు. జనసేన సాధారణ రాజకీయ పార్టీ కాదని, ప్రజల ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, పారదర్శక పాలన కోసం పుట్టిన ఉద్యమమని స్పష్టం చేశారు. “ఉద్యమి” అనే పదం ప్రతి సభ్యునిలో సేవాభావం, బాధ్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ దూరదృష్టి ఆలోచనల మేరకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరింత విస్తృతంగా చేపట్టాలని పిలుపునిచ్చారు. సభ్యత్వం అనేది కేవలం ఒక కార్డు కాదని, అది వ్యక్తిని “మెంబర్ టు లీడర్”గా తీర్చిదిద్దే మార్గమని పేర్కొన్నారు.
ఉద్యమి – పార్టీ భావజాలాన్ని లోతుగా అర్థం చేసుకుని, సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసే సభ్యుడు.
సాధక్ – పార్టీ పోరాటానికి బలం చేకూర్చుతూ, కొత్తవారిని ప్రేరేపించి సభ్యత్వాలు చేయించేవాడు.
ప్రదాత – ఆర్థిక, సాంకేతిక లేదా మేధోపరమైన సహకారం అందిస్తూ పార్టీ బలోపేతానికి తోడ్పడేవాడు.
ఈ విధానం ద్వారా పార్టీ నిర్మాణం మరింత క్రమబద్ధంగా, శక్తివంతంగా మారుతుందని తెలిపారు. ప్రతి జనసైనికుడు తన సామర్థ్యానికి అనుగుణంగా ఈ విభాగాల్లో భాగస్వామి కావాలని కోరారు.
నాయకత్వం పదవులతో కాకుండా సేవాభావంతో వస్తుందని, ఆ దిశగా ప్రతి ఉద్యమి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.