జల్ జీవన్ లక్ష్యాలు చేరుకునేందుకు మరింత సాయం అవసరం

• రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మరిన్ని నిధులు మంజూరు చేయండి
• కేంద్ర జల్ శక్తి శాఖకు శ్రీ పవన్ కళ్యాణ్ వినతి
• జల్ జీవన్ మిషన్ 2.0కి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం
• కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్

ప్రతి గ్రామంలో.. ప్రతి ఇంటికీ తాగు నీరు అందించాలన్న జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను నిబద్ధతతో ముందుకు తీసుకువెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందుకు కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సహకారం అవసరం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రివర్యులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలియ చేశారు. గత ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ ను పూర్తిగా నిర్వీర్యం చేసిందనీ, వారు సమర్పించిన డీపీఆర్ రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించే విధంగా ఉందని వివరించారు. కూటమి ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ మరో 13 లక్షల ఇళ్లు జల్ జీవన్ మిషన్ ఎంఓయూ లోని ఆర్టికల్ 1 లక్ష్యాలకు దూరంగా ఉంటాయని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు కేటాయించాలని కోరారు. మంగళవారం జల్ జీవన్ మిషన్ 2.0కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది. ఢిల్లీలో కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ సి.ఆర్. పాటిల్ గారి సమక్షంలో కేంద్ర ప్రభుత్వం తరఫున జల్ శక్తి మంత్రిత్వశాఖ నుంచి తాగు నీరు మరియు పారిశుధ్య విభాగం జాయింట్ సెక్రటరీ శ్రీమతి స్వాతి మీనా నాయక్, రాష్ట్ర ప్రభుత్వం తరఫున పంచయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్ ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. జల్ జీవన్ మిషన్ 2.0 లక్ష్యాలకు అనుగుణంగా 2028 డిసెంబర్ నాటికి రాష్ట్రంలో ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించే ప్రక్రియను పూర్తి చేయాలని కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ సూచించింది. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలన్న జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లేందుకు నిరంతర మద్దతు అందిస్తున్న గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికీ, గౌరవ కేంద్ర జల్ శక్తి మంత్రి శ్రీ సి.ఆర్.పాటిల్ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు. జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 డిసెంబర్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికీ కుళాయిల ద్వారా తాగు నీరు అందించే విధంగా ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తున్నాం. ఆ అశాస్త్రీయమైన డీపీఆర్ కి అనుగుణంగా మంజూరైన నిధులతో పూర్తి స్థాయి లక్ష్యాలను చేరుకోవడం సాధ్యం కాదు. కేంద్రం నుంచి వచ్చిన మొత్తం నిధులు ఖర్చు చేసినా మరో 13 లక్షల గృహాలు తాగునీటి సరఫరాకు దూరంగా ఉండిపోవాల్సిన పరిస్థితి. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించాలని కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున మా విన్నపాన్ని స్వీకరించి రాష్ట్రంలో నిర్దిష్ట లక్ష్యం దిశగా జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసేందుకు సహకరించాల”ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జల్ శక్తి మంత్రిత్వశాఖ కార్యదర్శి శ్రీ అశోక్ మీనా, జల్ జీవన్ మిషన్ డైరెక్టర్, అదనపు కార్యదర్శి శ్రీ కమల్ కిషోర్ సోన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.