ఉపాధి కల్పనలో ఏపీ ఊపు!

* జాతీయ స్థాయిలో మెరిసిన రాష్ట్రం
* ఆరేళ్ల తర్వాత మొదటి స్థానం కైవసం
* ఢిల్లీలో పుంజుకున్న రాష్ట్ర ప్రతిష్ఠ
* కూటమి ప్రభుత్వ కార్యాచరణ
* ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధ

కేవలం కబుర్లు చెప్పే వాడి వాలకాన్ని ఆ కబుర్లే బయటపెడతాయి…
పని చేసే వాడి తీరును ఆ పనులే చాటి చెబుతాయి…
రాష్ట్రంలో గత వైకాపా ప్రభుత్వానికి, ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి పై వాక్యాలు సరిగ్గా అతికినట్టు సరిపోతాయి.
‘నా ప్రజలు… నా జనం… ’ అంటూ కల్లబొల్లి మాటలు వల్లిస్తూ కాలక్షేపం చేసి రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన జగన్ ప్రభుత్వం క్రీనీడలు ఇప్పుడిప్పుడే తొలగిపోతున్నాయి. వైకాపా హయాంలో పడకేసిన అనేక పథకాలు ఇప్పుడు శరవేగంతో ముందుకు సాగడమే కాదు, జాతీయ స్థాయిలో రాష్ట్రాన్ని మెరిసేలా చేస్తున్నాయి. అన్నం ఉడికిందో లేదో మెతుకు పట్టుకుని చూస్తే చాలన్నట్లు, ఏ పథకం అమలు చూసినా కూటమి ప్రభుత్వ కార్యచరణ తేటతెల్లం చేస్తోంది. ఇందుకు ఎన్నో ఉదాహరణలు. అందులో మచ్చుకు కొన్ని చూద్దాం…
* ఉపాధి హామీలో ముందంజ
జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి మెటీరియల్ పనుల అమలులో ప్రభుత్వం
టాప్‌లో నిలిచింది. ఆరేళ్ల తర్వాత జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రతిష్ఠ మళ్లీ పుంజుకుంది.
జగన్‌ ప్రభుత్వ హయాం కేసి దృష్టి సారిస్తే ఈ పథకం ఎలా భ్రష్టు పట్టిందో అర్థం అవుతుంది. దొంగ మస్టర్లకు అవకాశం ఇవ్వడం, పనులు చేయకుండానే వైసీపీ కార్యకర్తలు మెటీరియల్‌ నిధులు పంచుకోవడం లాంటి అవకతవకలతో ఢిల్లీలో రాష్ట్ర ప్రతిష్ఠ మసకబారింది. కేంద్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహిస్తే ఇక్కడి అధికారులు సమాధానం చెప్పలేని దుస్థితి ఉండేది. ఒక దశలో రాష్ట్రానికి ఉపాధి పని దినాలు నిలిపేశారు. ఏ నిధులు విడుదల చేయాలన్నా అనేక తనిఖీలు నిర్వహించి మంజూరు చేసేవారు. అయితే కూటమి సర్కారు వచ్చిన తర్వాత సీఎం శ్రీ చంద్రబాబు, డిప్యూటీ సీఎం శ్రీ పవన్‌ కల్యాణ్‌ ప్రోత్సాహంతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ శశిభూషణ్‌ కుమార్‌, కమిషనర్‌ శ్రీ కృష్ణతేజ గ్రామీణాభివృద్ధి, పీఆర్‌ శాఖలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి చేశారు.
నిజానికి మొదటినుంచీ ఉపాధి పథకం వినియోగంలో ఏపీ ముందు వరుసలో ఉండేది. 2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో మెటీరియల్‌ కాంపోనెంట్‌ వినియోగంలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. అనేక రకాల వినూత్న కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆ ఐదేళ్లలో సుమారు 120 అవార్డులు కైసవం చేసుకుంది. ఆ తర్వాత వైసీపీ హయాంలో అంతా తారుమారు అయింది. మెటీరియల్‌ నిధులు దుర్వినియోగమయ్యాయి. ఉపాధి పథకంలో అనుమతి లేని పనులు ప్రారంభించడంతో కన్నెర్ర చేసిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సచివాలయాల భవనాలు, జగనన్న కాలనీల్లో లెవలింగ్‌ పనులను నిలిపివేసింది. ఈ పనుల పేరుతో వైసీపీ కార్యకర్తలకు రూ.1,500 కోట్లు దోచిపెట్టినా అవి ఎక్కడా ఉపయోగపడలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెపండుగ 1.0 పేరుతో 4 వేల కి.మీ. సిమెంట్‌ రోడ్లతో పాటు 25 వేల మినీ గోకులాలు నిర్మించారు. పల్లెపండుగ 2.0 కింద ఇప్పటికే 50 శాతం సిమెంట్‌ రోడ్లు, మినీ గోకులాలను పూర్తి చేశారు. తాజాగా రూ.1,884 కోట్ల మెటీరియల్‌ బిల్లులను అప్‌లోడ్‌ చేసి దేశంలోనే ఏపీ టాప్‌లో నిలిచింది. ఉత్తరప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్ర వరుసగా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
* స్వర్ణ పంచాయతీతో సరికొత్త రికార్డు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంచాయతీరాజ్ వ్యవస్థలో పారదర్శకతను పెంచడానికి, డిజిటలైజేషన్‌ను ప్రోత్సహించడానికి ‘స్వర్ణ పంచాయతీ’ అనే సరికొత్త పోర్టల్‌ను, మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. గ్రామ పంచాయతీల ఆర్థిక లావాదేవీలలో జవాబుదారీతనాన్ని పెంచడం, పౌరులకు ప్రభుత్వ సేవలను ఇంటి వద్దకే చేర్చడం ఈ పోర్టల్ యొక్క ప్రధాన లక్ష్యం. ముఖ్యంగా ఇంటి పన్ను ఇతర స్థానిక పన్నుల వసూళ్లలో అవినీతిని అరికట్టడానికి దీనిని రూపొందించారు. దీని ద్వారా ప్రజలు పంచాయతీ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా తమ ఇంటి పన్నును ఆన్‌లైన్‌లో నేరుగా చెల్లించవచ్చు. పన్ను చెల్లించిన వెంటనే డిజిటల్ రశీదును డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయం ఉంది. రాష్ట్రంలోని సుమారు 13 వేల పంచాయతీల్లోని 88 లక్షల ఆస్తులను ఈ పోర్టల్‌లో నమోదు చేశారు. పంచాయతీకి ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు అవుతుందనే వివరాలు ఆన్‌లైన్‌లో పక్కాగా నమోదవుతాయి. కార్యదర్శులను సంప్రదించకుండానే సెల్ ఫోన్ ద్వారా పన్ను వివరాలు తెలుసుకోవచ్చు. ఇలా 88 లక్షల అసెస్మెంట్లతో పంచాయతీల ఆదాయం రూ.450 కోట్ల నుంచి రూ.1,000 కోట్లకు చేరింది. ఇప్పటికే రూ.500 కోట్లకు పైగా పన్నులు జమయ్యాయి. ఆర్థిక సంఘం నిధుల వ్యయం, సిబ్బంది డేటాబేస్‌ను పోర్టల్‌లో ఉంచడం ద్వారా పంచాయతీరాజ్‌ శాఖ సరికొత్త చరిత్రను సృష్టించనుంది. స్వర్ణ పంచాయతీల విధానం ఇప్పుడు దేశానికి ఆదర్శంగా మారింది. మరోవైపు ఘన వ్యర్థాలను సంపదగా మార్చే వినూత్న కార్యక్రమానికి ఈ శాఖ శ్రీకారం చుట్టింది. ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి ప్రతిఫలంగా కుటుంబానికి నిత్యావసరాలు అందజేసేందుకు గ్రామాల్లో స్వర్ణ రథాలు సంచరిస్తున్నాయి. అడవితల్లి బాట లాంటి పథకాల ద్వారా ఏజెన్సీలో సిమెంట్‌ రోడ్ల నిర్మాణాలు చేపట్టారు.
* ఆర్‌జీఎస్ఏలోనూ టాప్‌లోకి
ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ (ఆర్‌జీఎస్‌ఏ) పథకాన్ని అత్యంత ప్రాధాన్యతతో అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా 2024-25, 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో ఏపీ ఈ పథకం అమలులో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గడచిన కొద్ది నెలల్లో ఆంధ్రప్రదేశ్ ఈ పథకం అమలులో అసాధారణమైన వృద్ధిని సాధించింది. వైకాపా నిర్వాకం వల్ల ఈ పథకం అమలులో రాష్ట్రం, దేశవ్యాప్తంగా 24వ స్థానానికి పడిపోయింది. కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో… ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ తీసుకున్న ప్రత్యేక శ్రద్దాసక్తుల వల్ల ప్రస్తుతం టాప్ లోకి చేరుకుంది. ఇది రాష్ట్రంలో గ్రామీణ పాలన మెరుగుపడిందనడానికి నిదర్శనం. ప్రస్తుత పరిస్థితిని సమీక్షిస్తే ప్రస్తుతం సుమారు 617 గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి,10 జిల్లా పంచాయతీ వనరుల కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం లభించింది.
సుమారు 500 పంచాయతీలకు కంప్యూటర్లు మరియు ఇతర పరికరాల సరఫరాకు నిధులు కేటాయించారు. ఇటీవల కేంద్రం నుంచి ఈ పథకం కింద ₹50 కోట్లు విడుదలయ్యాయి, దీనికి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా మరో ₹33 కోట్లు జత చేసింది. ఈ పథకం ముఖ్యోద్దేశానికి అనుగుణంగా సర్పంచులు, వార్డు సభ్యులు, పంచాయతీ సిబ్బందికి శిక్షణ ఇచ్చే కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. 2024-25 లో 3 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే 1.36 లక్షల మందికి పైగా శిక్షణ పూర్తి చేసుకున్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధన, ఇ-గవర్నెన్స్, పంచాయతీల సొంత ఆదాయ వనరులను పెంచుకోవడంపై శిక్షణ ఇస్తున్నారు. గ్రామ స్థాయిలో 9 ప్రధాన అంశాలపై దృష్టి సారించి అభివృద్ధి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పేదరికం లేని, ఆరోగ్యవంతమైన, శిశుహితమైన, జల సమృద్ధి కలిగిన, పరిశుభ్రమైన పచ్చని గ్రామాలను మౌలిక సదుపాయాలతో సామాజిక భద్రత, సుపరిపాలనతో, అభివృద్ధిలో మహిళా భాగస్వామ్యం ఉండేలా చేయాలనేవి లక్ష్యాలు. జగన్ పరిపాలన కాలంలో ఈ పథకాన్ని కూడా అటకెక్కించారు. ఒక్క ప్రజాప్రతినిధికి కూడా శిక్షణ ఇవ్వకపోవడంతో అప్పట్లో రాష్ట్రానికి ఈ పథకం కింద కేంద్రం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.