
విజయవాడ: ఇంద్రకీలాద్రిపై జరిగే వసంత నవరాత్రులు, ఉగాది వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు ప్రారంభించారు. తేది 19.03.2026 నుండి 28.03.2026 వరకు జరిగే శ్రీ పరాభవ నామ సంవత్సర వసంత నవరాత్రులు, ఉగాది వేడుకలు, పుష్పార్చనలు, శ్రీ సీతారాముల కళ్యాణం, శ్రీ రామ పట్టాభిషేకం కార్యక్రమాలు భక్తులకు సౌకర్యంగా నిర్వహించేలా అన్ని విభాగాలు చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈవో వికె శీనానాయక్ ఆదేశించారు.
ఈ సందర్భంగా దేవస్థానం చైర్మన్ బొర్రా రాధాకృష్ణతో కలిసి సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఉగాది రోజున జరిగే పంచాంగ శ్రవణం, సాయంత్రం వెండి రథోత్సవం, పుష్పార్చన ఆర్జిత సేవల కోసం భక్తులకు విస్తృత ఏర్పాట్లు చేయాలని చైర్మన్ సూచించారు.
అలాగే 29.03.2026 నుండి 05.04.2026 వరకు జరిగే చైత్రమాస కళ్యాణ బ్రహ్మోత్సవాల సందర్భంగా వాహన సేవలు, నదీ విహార కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహించేలా ప్రణాళిక రూపొందించాలని ఈవో అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో వైదిక కమిటీ సభ్యులు, దేవస్థానం అధికారులు పాల్గొన్నారు.