వైసీపీకి ఓట్లు వేయకపోతే ప్రజల్ని కూడా జగన్ తిడతారేమో? – జనసేనాని…

‘రాయలసీమ నుంచి ముఖ్యమంత్రులు అయ్యారు… ప్రస్తుత ముఖ్యమంత్రి రాయలసీమవారే… అయినా ఈ సీమ అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు… తమ బిడ్డల భవిష్యత్ చూసుకున్నారే తప్ప ప్రజలను పట్టించుకోలేదు’ అని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. సర్వం వదులుకొని వచ్చాను… ప్రజలంతా నా కుటుంబంగా భావిస్తున్నాను అని స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రతిపక్ష నేత జగన్ లకు రాయలసీమ పౌరుషం ఉంటే గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు తెరిపించి, కార్మికుల బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. గురువారం రాత్రి అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణంలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. జ్వరం, దగ్గుతో ఇబ్బందిపడుతున్నా నిర్దేశించిన ప్రకారం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “ప్రతిపక్ష నేత తనను ముఖ్యమంత్రిని చేస్తేనే ప్రజా సమస్యలను చూస్తాను అంటారు. తనని మరోసారి సీఎం చేస్తే సమస్యలు తీరుస్తాను అంటారు చంద్రబాబు. వీళ్ళు వచ్చే యేడాది ఎన్నికల గురించి తప్ప ప్రజలకి రాబోయే పాతికేళ్లలో ఏం చేయాలి అనే దృష్టి మాత్రం లేదు. అధికార ప్రతిపక్షాలకి ప్రజల ఆకాంక్షలు, ఆశలు పట్టడం లేదు. అందుకే సరికొత్త, బలమైన రాజకీయ వ్యవస్థను నిర్మించేందుకు వచ్చింది జనసేన. ప్రజలకు జరిగే అన్యాయాన్ని ఎదుర్కొంటాం. రౌడీలు, గూండాలకు భయపడేది లేదు. సీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు ఈ ప్రాంతం కరవు, వలసలను ఏ మాత్రం పట్టించుకోలేదు. కనీసం గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు తెరిపించలేకపోయారు. ఆ నాయకులు మాత్రం వేల ఎకరాలు సంపాదించుకున్నారు. రాయలసీమ నుండి అనేక మంది నాయకులు, ముఖ్యమంత్రులు వచ్చారు చంద్రబాబు గారితో సహా, కానీ ఎవరూ కూడా మన గుంతకల్లు స్పిన్నింగ్ మిల్ తెరిపించలేకపోయారు. అవినీతితో నిండిపోయిన అధికారపక్షాన్ని, ప్రతిపక్షాన్ని తరిమేయాలి. రాజకీయంలో కొత్త మార్పు తీసుకొద్దాం. గుంతకల్లుని పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తాం, ఉపాధి కోసం వేరే ప్రదేశాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఈ పట్టణాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసే బాధ్యతను జనసేన తీసుకుంటుంది.

నాకు సంస్కారం అడ్డొస్తుంది

వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అసెంబ్లీకి ఎందుకు వెళ్లరు అని అడిగితే – పవన్ కల్యాణ్ పెళ్లిళ్లు చేసుకున్నాడు అని తిడుతుంటారు. నా పెళ్లిళ్ల వల్లే రాష్ట్ర విభజన జరిగింది, నా పెళ్లిళ్ల వల్లే అవినీతి జరిగింది, నా పెళ్లిళ్ల వల్లే పాపం జగన్ జైలుకు వెళ్ళి కేసుల్లో ఉన్నారు మరి. ఏం మాట్లాడుతున్నారయ్యా.. వైసీపీ నాయకులకి తమాషాగా ఉందా? మేం మాట్లాడుతున్నది అంబేడ్కర్ గారిచ్చిన రాజ్యాంగ స్ఫూర్తిని అసెంబ్లీకి తీసుకువెళ్ళమని. మాట్లాడేవాళ్లు లేరు కదాని ఇష్టానుసారం నోళ్ళు పేలుతున్నాయి… జాగ్రత్తగా ఉండండి. మీది ముఠా సంస్కృతి. మీ ముఠాలకు భయపడతామా? మేం చేగువెరా స్పూర్తి ఉన్నవాళ్లం. వైసీపీ నాయకులు నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడితే నేను మీ ఒక్కొక్కరి వ్యక్తి గత జీవితాన్ని రోడ్డు మీదకి లాగగలను, కానీ మా అమ్మ గారు నన్ను చాలా సంస్కారం తో పెంచారు. అలా చెయ్యడానికి నా సంస్కారం అడ్డువస్తోంది. మేం పాలసీల గురించీ, రాయలసీమ కరవు గురించి, వలసల గురించి మాట్లాడుతుంటే మీరు వ్యక్తిగతంగా మాట్లాడుతున్నారు. జగన్ గారి మీద కోడి కత్తి దాడి ఆయన తల్లిగారు విజయమ్మగారు చేయించారు అని టీడీపీవాళ్లు అంటే మేం వాళ్ళను తిట్టాం. మీ అమ్మగారిని గౌరవించాం. అదీ మా సంస్కారం. రేపు వైసీపీకి ఓట్లు వేయకపోతే ప్రజల్ని కూడా జగన్ తిడతారేమో?

వైసీపీ, టీడీపీకి ఓట్లు వేసినవాళ్లు ఇప్పుడు జనసేనతో ఉన్నారు. ఎందుకంటే ఓట్లు వేయించుకున్న ఆ పార్టీలు ప్రజలను గాలికి వదిలేశాయి. ప్రజలకు జనసేన అండగా నిలుస్తుంది. పట్టుమని పది మందికి కూడా ఈ పార్టీలు ఇళ్ళు మంజూరు చేయలేదు. వాళ్ళకు బానిసత్వం చేస్తేనే ఇస్తారా? ముఠా సంస్కృతితో ఉన్నాయి. అవినీతితో నిండిపోయిన ఈ పార్టీలను తరిమేయాలి. కులాలు, మతాలకు అతీతంగా చూసుకొనే పార్టీ జనసేన. ఆడపడుచులకు గ్యాస్ భారం కారాదని ఉచితంగా ఇస్తామని జనసేన మాట ఇస్తుంది. రేషన్ బదులుగా మహిళల ఖాతాల్లోకే సొమ్ములు బదిలీ చేస్తాం.

కళలకు, విద్యకీ నిలయమైన సీమ 

వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమయ్య, తరిగొండ వెంగమాంబ, కట్టమంచి రామలింగా రెడ్డి, తరిమెల నాగిరెడ్డి లాంటివారు పుట్టిన గడ్డ ఇది. సినిమాల్లో చూపించినట్లు చంపేస్తా, నరికేస్తా కల్చర్ కాదు. ఈ ప్రాంతం కళలకీ, చదువులకీ నిలయమైన సీమ ఇది. వీరబ్రహ్మేంద్ర స్వామికి ముస్లిం సిద్దయ్య శిష్యుడు. మతసామరస్యం చాటిన సీమ ఇది. ఈ ప్రాంతంలో కరవు తరిమికొట్టేందుకు ఇజ్రాయెల్ విధానాలు అనుసరించాలి. అలాగే విండ్ మిల్స్ పేరుతో వేల ఎకరాలు తీసుకున్నారు. వాటికి భూమి అంతా వాడరు. మిగిలి ఉన్న భూమిలో సాగుకు ఇచ్చేలా విండ్ మిల్ యజమాన్యాలతో మాట్లాడతాం. ఈ ప్రాంతాల్లో పారిశ్రామికాభివృద్ధి చేసి మన పిల్లలు ఉద్యోగాల కోసం బెంగళూరుకో ఇతర ప్రాంతాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా చేస్తాం. 

గుంతకల్లు స్పిన్నింగ్ మిల్లు విషయంలో పాలకులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఈ కార్మికులకు రూ.5 కోట్ల బకాయిలు ఇవ్వాల్సి ఉంది. ఈ మిల్లు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును తక్షణం అమలు చేయాలి. పరిశ్రమలుపెట్టేది బతికించడానికి. ఈ మిల్లు మూసేయడంతో 60 మంది ఆకలిచావులకు గురయ్యారని తెలిసి బాధ కలిగింది. ఈ మిల్లు కార్మికులకు మేం అండగా నిలుస్తాం” అన్నారు. స్పిన్నింగ్ మిల్ కార్మిక నాయకుడు శ్రీ టి.సి.నారాయణ రెడ్డి ఈ మిల్లు సమస్యలకు సంబంధించిన సమస్యలను శ్రీ పవన్ కల్యాణ్ గారికి వివరించారు. 

మీరు ఆలోచించుకోండి

ఈ కార్యక్రమానికి ముందు గుంతకల్లులో ‘జనసేన తరంగం’లో పాల్గొన్నారు. శ్రీమతి తిక్కమ్మ ఇంటి తలుపు తట్టి ఆ ఇంట్లోవాళ్లతో సంభాషించారు. ఆ ఇంట్లోనే లారీ డ్రైవర్ శ్రీ పురుషోత్తం, ఆటో డ్రైవర్ శ్రీ వెంకటేశ్వర్లు కుటుంబాలు ఉంటున్నాయి. వారితో మాట్లాడుతూ “ఇళ్లు లేని వారంద‌రికీ ఓకే చోట ఇళ్లు క‌ట్టించి ఇస్తాం. మౌలిక సదుపాయాలు కల్పిస్తాం. పిల్లలు ఆడుకోవ‌డానికి ఆట స్థ‌లం, ప్రాథమిక పాఠ‌శాల‌లు గృహాల‌కి స‌మీపంలో ఉండేలా ప్లాన్ చేస్తాం” అన్నారు. ప్ర‌స్తుతం గ్యాస్ సిలిండ‌ర్ ధ‌ర ఎంత ఉందని అడిగి తెలుసుకున్నారు. మీకు ఎలాంటి ఇళ్లు కావాలి. ఎలాంటి సౌక‌ర్యాలు కావాలి అని మ‌హిళ‌ల‌ని అడిగి తెలుసుకున్నారు. రేష‌న్ దుకాణాల్లో ఇచ్చే బియ్యం నెల మొత్తానికి స‌రిపోవ‌డం లేద‌ని ఆవేదన వ్యక్తం చేశారు. అనంత‌రం శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ.. “గ్యాస్ ధ‌ర సామాన్యుడికి భారం కారాద‌న్న ఉద్దేశంతోనే ఉచిత గ్యాస్ ప‌థ‌కం పెట్టాం. రేష‌న్‌కి బ‌దులుగా రూ. 2500 నుంచి రూ. 3500 నేరుగా మీ అకౌంట్ల‌కి వేస్తాం. మీకు కావ‌ల్సిన స‌రిప‌డా మీరే కొనుక్కోవ‌చ్చు. మీకు ఎక్కువ ఆశ‌లు క‌ల్పించ‌ను. నేను చెయ్య‌గ‌లిగిందే చేస్తాను. న‌న్ను న‌మ్మ‌మ‌ని చెప్ప‌డం లేదు. మీరు ఆలోచించుకోండి. నాయ‌కులు ఎలా త‌యార‌య్యారంటే, దోచుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నారు. వేల కోట్లు సంపాదించుకుంటారు. వాటిని ఏం చేసుకుంటారో తెలియ‌దు. వీరు మ‌న‌లా క‌ష్ట‌ప‌డి సంపాదించ‌రు. అడ్డ‌గోలుగా దోచేస్తారు. ఉన్న‌వారే ఇంకా ఇంకా సంపాదించుకుంటున్నారు. పేదవారు అలాగే ఉండిపోతున్నారు. రాజు నీతి త‌ప్పితే నేల సారం త‌ప్పుతుందంటారు. రాష్ట్రంలో ప‌రిస్థితులు అలాగే ఉన్నాయి. నా మాట గుడ్డిగా న‌మ్మ‌వ‌ద్దు. ఎవ‌రికి ఓటేయాలి అనేది మీరు అంతా క‌ల‌సి మాట్లాడుకుని నిర్ణ‌యించుకోండి. నేను ముఖ్య‌మంత్రి అవ్వాల‌ని రాలేద‌”న్నారు. అనంత‌రం పార్టీ సిద్ధాంతాలు వివ‌రించి, మిస్డ్ కాల్ ఇప్పించారు. కుటుంబ స‌భ్యుల‌ని పేరు పేరునా ప‌లుక‌రించి అంద‌రితో సెల్ఫీలు దిగారు.


Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.