రాజకీయాలు అంటే మంత్రి లోకేశ్ గారు వారసత్వంగా, ప్రతిపక్షనేత జగన్మోహన్ రెడ్డిగారు వంశపారపర్యంగా వచ్చే హక్కు అనుకుంటారు, కానీ జనసేనకు మాత్రం రాజకీయాలు అంటే సామాజిక బాధ్యతని జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. రాజకీయాలను చాలా బాధ్యతగా, బలంగా చేస్తామని, వేలకోట్లు లేకపోయినా 2019లో బలమైన వ్యూహాంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోకి జనసేన పార్టీ అడుగుపెడుతుందని అన్నారు.

శుక్రవారం విశాఖపట్నంలోని సాయిప్రియా రిసార్ట్ లో విశాఖ జిల్లా కార్యకర్తలతో సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ..”రాజకీయ వ్యవస్థలో నిలదొక్కుకోవాలంటే అందరిని కలుపుకుపోవాలి. నీతిపరులు, అవినీతిపరులు అందరూ మనచూట్టూనే ఉంటారు. వాళ్లను తప్పించుకొని రాజకీయం చేయలేం. బంగారు పళ్లెంకు కూడా గోడ చేర్పు ఉండాలి. జనసేన కూడా ఇలాంటి వ్యవస్థలోనే ఎదగాలి. రాజకీయ వ్యవస్థను ప్రక్షాళన చేయాలంటే బురదలో దిగాలి. అవినీతిపరులతో చేయిచేయి, భుజం భుజం కలపాలి తప్పదు. వీళ్లు వద్దు, వాళ్లు వద్దు అని ముందుకు వెళితే చెట్టు కింద కూర్చొని తపస్సు చేయడం తప్ప రాజకీయ పార్టీ నడపలేం. జనసేన కూడా అవినీతిమయంతో నిండిపోయిన రాజకీయ వ్యవస్థ నుంచే వస్తుంది. బురదలో కమలం వికసించినట్లు కుళ్లిన రాజకీయాలను జనసేన ప్రక్షాళన చేస్తుంది. మంత్రి గంటాలాంటి వ్యక్తులు పక్షుల్లా వచ్చి పక్షుల్లా ఎగిరిపోతారు. ఇలాంటి పక్షులను నేను నమ్మను. ఆయనపై కోపం లేదుగానీ ఆయన ఆలోచన ధోరణి మనకు సరిపడదు. అందుకే జనసేన పార్టీలోకి ఆయన్ను ఆహ్వానించను. అవినీతిపరులైన వ్యక్తులు పార్టీలోకి వచ్చినా వాళ్లు దోచేసిన ఆస్తులు ప్రజలకు పంచిపెట్టి సంస్కరించబడాలని కోరుకుంటా.
ఆవేదన ఉన్నవాడికే ఆవేశం
కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆవేశం తగ్గించుకోవాలంటున్నారు. ఆవేదన ఉన్నోడికే ఆవేశం ఉంటుంది. కడుపు నిండిన వాళ్లు మెత్తగానే మాట్లాడుతారు. అన్యాయాలు, అక్రమాలు చూస్తే నాకు కడుపు దహించుకుపోతుంది. ఒక మనిషికి కోపమొస్తే అది వ్యక్తిగతమవుతుంది, అదే కోపం ఒక సముహానికి వస్తే ఉద్యమం అవుతుంది. జనసేన ఒక రాజకీయ పార్టీ మాత్రమే కాదు. ఒక సామాజిక, రాజకీయ ఉద్యమంతో కూడిన విధానం. ఉత్తరాంధ్రలో బీసీలుగా ఉన్నవారిని తెలంగాణలో ఓసీలుగా మార్చేశారు. దాని గురించి అధికార, ప్రతిపక్షాలు మాట్లాడవు. విశాఖ కాలుష్యం, స్టీల్ ప్లాంట్ నిర్వాసితుల సమస్యలు పట్టించుకోవు. వేల ఎకరాలను దోచుకుంటే అడిగే దిక్కులేదు. నగరాల్లో నివసిస్తున్న దిగువ మధ్య తరగతి ప్రజలకు ఇళ్లు, వసతుల సమస్యలు పరిష్కరించరు. వీటన్నింటిపైనే జనసేన పోరాటం చేస్తుంది. అద్భుతాలు చేస్తామని చెప్పం కానీ, మీతో పాటే నడుస్తూ, ముందుకెళ్తూ సమస్యలను పరిష్కరిస్తాం. డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ప్రైవేటుపరం కాకుండా పీఎంవోకు లేఖలు రాసి అడ్డుకున్నాం. సుదీర్ఘమైన ప్రయాణం చేయడానికి రాజకీయాల్లోకి వచ్చాను. ఒడిదుడుకులు, జయాపజయాలు ఉంటాయని తెలుసు. నేను ముఖ్యమంత్రి అయితేనే పని చేస్తానని చెప్పను. నేను చేసే పని అత్యంత ఉన్నతమైన స్థానంలో నిలబెడితే ఆ స్థానాన్ని ప్రజల పాదాలకు నివేదన ఇస్తాను.
జనసేన పార్టీ పెట్టినప్పుడు వేలకోట్లు, అపరిమితమైన మేథోసంపతి ఉన్న వ్యక్తులు ఎవరు లేరు. నా వెనుక జనసైనికులు ఉన్నారన్న నమ్మకంతోనే పార్టీ పెట్టాను. అన్యాయాలు, అవినీతిపై ఎదురు తిరిగే బలమైన గొంతు లేకపోతే అరాచకాలు పెరిగిపోతాయి అనిపించి రాజకీయాల్లోకి వచ్చాను తప్ప, నన్ను ఎవరూ రాజకీయాల్లోకి రావాలని పిలవలేదు. ఇప్పుడిప్పుడే జనసేనలోకి నాయకులు వస్తున్నారు. కానీ పార్టీలో మొదటి నుంచి ఉన్నది మీరే, ఆఖరి వరకు ఉండేది మీరే. అందుకే పార్టీ నిర్మాణంలో జనసైనికులకు బలమైన పాత్ర ఇచ్చాను. వార్డు, గ్రామ స్థాయి నుంచి వర్కింగ్ కమిటీల్లో జన సైనికులు ఉండేలా నిర్మాణం జరుగుతోంది. ఎక్కువ బాధ్యతలు నిర్వహించే వాళ్లకు కార్యనిర్వాహక కమిటీల్లో అవకాశం ఉంటుంది. ఏ వ్యక్తి మిమ్మల్ని లీడ్ చేయాలో మీరే ఎన్నుకునేలా పార్టీ నిర్మాణం ఉంటుంది. నాయకత్వం పదవి కాదు బాధ్యత. రాత్రికి రాత్రి నాయకులు అయిపోదాం అంటే కుదరదు. ఏ నాయకులు ఎటువెళ్లిన జనసేన పార్టీ మూల సిద్ధాంతాలకు కట్టుబడి ఉండాలి. వెన్నుపోటు పొడవాలి అని చూస్తే నేను అంత బలహీనుడిని మాత్రం కాద”ని హెచ్చరించారు.
సూపర్