మ‌న పాల‌కులు నీతి త‌ప్పారు.. అందుకే నేల సారం త‌ప్పింది – శ్రీ పవన్ కళ్యాణ్ గారు…

కులాలు, మ‌తాలు, ప్రాంతాల‌కు అతీతంగా న్యాయం జ‌ర‌గ‌క‌పోతే వేర్పాటు ఉద్య‌మాలు వ‌స్తాయ‌ని, ఆక‌లితో యువ‌త ఉద్య‌మాల వైపు ఆక‌ర్షితుల‌వుతార‌ని జ‌న‌సేన పార్టీ అధినేత శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు హెచ్చరించారు.  ఈ ప‌రిస్థితులు మారాలంటే రాజ‌కీయ వ్య‌వ‌స్థ మారాలని, రాజ‌కీయ వ్య‌వ‌స్థ మారాలంటే యువ‌త ఆలోచ‌న విధానం మారాలని అన్నారు. పుట్ట‌ప‌ర్తి నియోజ‌క‌వ‌ర్గంలోని అమ‌డ‌గూరు మండ‌లం గుండువారిప‌ల్లి గ్రామంలో రైతుల‌తో ర‌చ్చ‌బండ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. రైతులు, సామాన్యుల స‌మ‌స్యలు అడిగి తెలుసుకున్నారు. క‌రవు తీవ్ర‌త‌కి గ్రామాల‌కి గ్రామాలు వ‌ల‌స‌ బాట ప‌ట్టాల్సి వ‌స్తోంద‌నీ, రెయిన్ గ‌న్స్ ఇస్తున్నామంటూ హ‌డావిడి చేసి, ముఖ్య‌మంత్రి వ‌చ్చి వెళ్ల‌గానే పీక్కుపోయార‌ని రైతులు వాపోయారు.

మీరు రైతుల్ని మోసం చేసిన దగ్గర నుంచే మాట్లాడుతున్నా..

ఈ సంద‌ర్భంగా శ్రీ ప‌వ‌న్ క‌ల్యాణ్ గారు మాట్లాడుతూ.. “ప‌వ‌న్ క‌ల్యాణ్ ఎక్క‌డ అని గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు అడుగుతున్నారు. మీడియాలో క‌నిపించ‌డానికి ఆయ‌న‌లా మ‌న‌కు పేప‌ర్లు, ఛాన‌ళ్లు లేవు.  జ‌న‌సైనికుల ఫేస్ బుక్ , వాట్సాప్ లే మ‌న‌కు ఛాన‌ళ్లు, పేప‌ర్లు. అయ్యా సీఎం గారు… రెయిన్ గ‌న్ల పేరు చెప్పి రైతుల‌ను ఎక్క‌డ మోసం చేశారో ఆ గుండువారిప‌ల్లి నుంచే మాట్లాడుతున్నాను. ఇక్క‌డ వ‌ర్షాలు లేవు, నీరు లేదు. పంట‌లు ఎండిపోయాయి. తీవ్ర‌మైన క‌రవు ప‌రిస్థితులు ఉన్నాయి. మీకు క‌న‌బ‌డుతున్నాయా? అమ‌రావ‌తిలో కూర్చుని రాయ‌ల‌సీమ‌ని సస్యశ్యామ‌లం చేశామంటే ఎలా..? ఇక్క‌డ యువ‌త‌కి ఉపాది లేదు. వ‌ల‌స‌లు పోతున్నారు. భార‌త‌దేశం ఎక్కువ శాతం యువ‌త ఉన్న దేశం. దానికి త‌గ్గ‌ట్టు అభివృద్ధి చేయాలంటే యువ‌త‌లో స్కిల్స్ డెవ‌ల‌ప్ చేయాలి. నైపుణ్యం లేద‌ని చెప్పి ప‌రిశ్ర‌మ‌ల్లో మ‌న యువ‌త‌కు ఉద్యోగాలు ఇవ్వ‌కుండా గుజ‌రాత్ , రాజ‌స్థాన్ వాళ్ల‌కు ఉద్యోగాలు ఇస్తున్నారు. అప్పులు చేసి చ‌దువులు చ‌దువుకున్న‌ది కూలీనాలీ చేయ‌డానికి కాదు. యువ‌త‌లో నైపుణ్యం పెంచాకే ప‌రిశ్ర‌మ‌లు పెట్టాలి. లేకపోతే ప్రాంతీయ‌ అస‌మాన‌త‌లు పెరిగి వేర్పాటువాద ఉద్య‌మాలు వ‌స్తాయి. ఈ ప్రాంతంలో 80 శాతం మంది భార్య‌బిడ్డ‌ల‌ను వ‌దిలిపెట్టి వ‌ల‌స‌లుపోయి క‌ష్ట‌ప‌డుతున్నారు. జ‌న‌సేన పార్టీ అధికారంలోకి వ‌చ్చాక ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగాల‌కు స్థానిక యువ‌త‌కే పెద్ద‌పీట వేస్తాం. 

నేను రాజ‌కీయాల్లోకి వ‌చ్చింది ఓట్ల‌ కోస‌మో,  అద్భుతాలు చేస్తాన‌ని చెప్ప‌డానికో కాదు. మ‌న స‌మ‌స్య‌లు ప్ర‌పంచానికి చెప్ప‌డానికి వ‌చ్చాను. మ‌న పాల‌కులు సీమ స‌మ‌స్య‌ను బ‌య‌ట‌కు ఎలా చెబుతున్నారంటే .. రెయిన్ గ‌న్లు పెట్ట‌డం వ‌ల్ల క‌రవు పార‌ద్రోలేశాం, వ‌ల‌స‌లు ఆగిపోయాయి, కియా మోట‌ర్స్ రావ‌డంతో స్థానికుల‌కు ఉద్యోగాలు వ‌చ్చేశాయ‌ని చెబుతున్నారు. కానీ క్షేత్ర‌స్థాయిలో చూస్తే మీరు ఎన్ని క‌ష్టాలు ప‌డుతున్నారో అర్ధ‌మ‌వుతుంది. రాజ‌కీయ నాయ‌కులకి ఓట్లు వేయించుకోవడంలో ఉన్న ఆస‌క్తి.. మ‌న స‌మ‌స్య‌లు తీర్చ‌డంలో లేదు. మట్టి శ‌క్తిని అవ‌గాహ‌న చేసుకున్న‌వాడిని క‌నుకే  రైతుల క‌ష్టాలు, క‌న్నీరు తెలుసు.  

నాయకుల్లో చిత్తశుద్ధి ఏదీ?

సీఎం వ‌స్తున్నార‌ని  రాత్రికి రాత్రే గుంట త‌వ్వి రూ. 300 కోట్లు ప్ర‌జాధ‌నం దుర్వినియోగం చేసి రెయిన్ గ‌న్లు పెట్టారు. ఆ రెయిన్ గ‌న్లు ఎక్క‌డికి వెళ్లిపోయాయో తెలియ‌దు. క‌మీష‌న్ల కోసం ఆ ప‌థ‌కానికి రూ. 1000 కోట్లు ఖర్చు పెట్టారు. పాల‌కులు ఎంత క‌క్కుర్తిగా త‌యార‌వుతున్నారంటే మంత్రి య‌న‌మ‌ల పంటి వెద్యానికి మూడు న్న‌ర ల‌క్ష‌ల ప్ర‌జాధ‌నం ఖ‌ర్చుచేశారు. ఏం ఆయ‌న‌కు ఆస్తులు లేవా..? అంత‌స్థులు లేవా..? ఒక‌ వైపు ప్ర‌జ‌లు గూడు లేక రోడ్డున ప‌డుతుంటే .. నాయ‌కులు సొంత అవ‌స‌రాల‌కు వేల‌కోట్లు ఖ‌ర్చు చేస్తున్నారు. ఇక్క‌డ చూస్తే పంట‌ని త‌డ‌పాలంటే త‌ల్ల‌డిల్లిపోయే ప‌రిస్థితి. నేను మీవాడిని..  మీ స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకే వ‌చ్చా. ఇక్క‌డ క‌రవు ప‌రిస్థితులు తెలుసుకుని అమ‌రావ‌తిలో మాట్లాడుతా. రాయ‌ల‌సీమ‌లో విప‌రీత‌మైన క‌రవు ఉంది. క‌రవు ప్రాంతానికి ప్ర‌త్యేక ప్యాకేజీ ఇవ్వాలి. క‌రవు ప్రాంతాల్లో యువ‌త‌కి ఇచ్చే నిరుద్యోగ  భృతి కూడా ఎక్కువ ఇవ్వాలి. రైతులు వ‌ల‌స‌లుపోకుండా గిట్టుబాటు ధ‌ర క‌ల్పించే ఏర్పాట్లు చేయాలి. వ‌ర్షాలు లేక‌, నీరు లేక చెట్లు చ‌నిపోతున్నాయి. కాలువ‌లు లేవు. కాలువ‌లు ఉన్న చోట నీటి విడుద‌ల‌కి సంబంధించి ప్రణాళిక‌లు ఉండ‌వు. నీటి పారుద‌లశాఖ క్యాలెండ‌ర్ ఇవ్వ‌దు. ఇలాంటి ప్రాంతాల్లో ముందుగా చెరువులు నింపాలి. క‌రవుపై పోరాటం చేసే శ‌క్తి ఉన్నా మ‌న నాయ‌కుల్లో చిత్తశుద్ధి లేదు. రైతుల బాధ‌లు వారికి అవ‌స‌రం లేదు.  ఆ కాంట్రాక్టు నాకు వ‌స్తుందా.?  లేదా.?  నా జేబు నిండిదా లేదా.? అన్న ఆలోచ‌న మిన‌హా రైతుల గురించి ఆలోచించేటంత హృద‌యం ఉన్న నాయ‌కులు మాత్రం లేరు.

రాయ‌ల‌సీమ ప్రాంతంలో వ‌ల‌స‌లు ఆప‌డానికి, యువ‌త‌కి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డానికి నేను ఎంతో మంది పారిశ్రామిక వేత్త‌ల‌తో మాట్లాడుతూ ఉంటా. గ‌తంలో యూరోపియ‌న్ బిజినెస్ సమ్మిట్‌కి వెళ్లాను. రేపు అమెరికా వెళ్తున్నా. అక్క‌డ పారిశ్రామికవేత్త‌ల‌తో మాట్లాడిన‌ప్పుడు వారు చెబుతుంది ఏంటంటే.. ప‌రిశ్ర‌మ‌లు పెడ‌తామంటే మాకు లంచం ఎంతిస్తార‌ని అడుగుతున్నారు. మాకు షేర్లు ఎంతిస్తార‌ని అడుగుతున్నారు. జ‌న‌సేన పార్టీకి అవేమీ అవ‌స‌రం లేదు. మా రాయ‌ల‌సీమ ప్రాంతానికి ప‌రిశ్ర‌మ‌లు రావాలి. వ‌ల‌స‌లు ఆగాలి. జ‌న‌సేన పార్టీ స‌ర‌దా కోసం పెట్ట‌లేదు. సామాన్యుడి కోసం పెట్టాను. మెడ‌లో ఎర్ర కండువా ఎందుకు వేస్తాను అంటే. అది సామాన్యుడి కండువా. సామాన్యుడి పక్షాన నిల‌బ‌డతాన‌ని చెప్ప‌డానికే ధ‌రిస్తాను. ఇక్క‌డ ప‌రిస్థితి ఎలా ఉందంటే, రాజు నీతి త‌ప్పితే నేల సారం  త‌ప్పుతుందంటారు. మ‌న పాల‌కులు నీతి త‌ప్పారు. అందుకే మ‌న నేల సారం త‌ప్పింది. భూములు ఎండిపోతున్నాయి. జ‌న‌సేన అధికారంలోకి వ‌స్తే బ‌ల‌మైన పాల‌నా వ్య‌వ‌స్థ‌ని తీసుకువ‌స్తామ‌”ని హామీ ఇచ్చారు.

అంత‌కు ముందు గుండువారిప‌ల్లి స‌మీపంలో 2016లో ముఖ్య‌మంత్రి ఆర్భాటంగా రెయిన్ గ‌న్లు ఏర్పాటు చేసిన పొలాల‌ని శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు పరిశీలించారు. రెయిన్ గ‌న్ల ఏర్పాటు, త‌ద‌నంత‌ర ప‌రిస్థితుల‌పై రైతుల‌తో మాట్లాడారు. రెయిన్ గ‌న్లు ఏమ‌య్యాయ‌ని ఆరా తీశారు. ఈ సంద‌ర్బంగా శ్రీ ప‌వ‌న్‌క‌ళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “రాజ‌కీయ నాయ‌కుల‌కు వారి స్వార్ధం త‌ప్ప ప్ర‌జా స‌మ‌స్య‌లు ప‌ట్ట‌డం లేదు. ప్ర‌జ‌ల‌ను కేవ‌లం ఓటు బ్యాంకుగా చూస్తూ ఎన్నిక‌ల్లో గెలిచాక మోసం చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను ఓటు బ్యాంకుగా చూసే ప‌రిస్థితి మారాల‌న్న ఉద్దేశంతోనే జ‌న‌సేన పార్టీ స్థాపించాన‌ని అన్నారు.  రైతుల సంక్షేమం కోసం రూ. 300 కోట్ల వ్య‌యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెయిన్‌ గన్‌ పథకం అటకెక్కింది. వర్షాభావ పరిస్థితుల్లో రైతుల పొలాల్లో ఉండాల్సిన పరికరాలు ఎక్క‌డున్నాయో తెలియ‌దు. రెయిన్ గ‌న్‌తో అనంత క‌రవును జ‌యించాం అని ప్ర‌పంచానికి గొప్ప‌లు చెప్పిన ముఖ్య‌మంత్రి  ప‌థ‌కం ప్రారంభించి అటు వెళ్ల‌గానే ఇటు రెయిన్ గ‌న్లు నిరుప‌యోగంగా మారాయి. నీరు లేక పంట‌లు ఎండిపోయి క‌రువుతో గ్రామంలో 80 శాతం మంది ఇళ్ల‌కు తాళం వేసి హైద‌రాబాద్, బెంగ‌ళూరుకు వ‌ల‌సపోతున్నారు. ప్ర‌జ‌ల కోసం ప‌ని చేయ‌ని రాజ‌కీయ నాయ‌కుల‌ను త‌రిమికొట్టే రోజులు వ‌చ్చాయ‌ని, యువ‌త‌, మ‌హిళ‌లు, రైతుల చేతుల్లో నాయ‌కులు దెబ్బ‌లు తింటారు.  నాలా సీఎం చంద్ర‌బాబుగారు ఇక్క‌డికి రావాలంటే ఆయ‌న ఆర్భాటాల‌కే రూ. 4 కోట్లు ఖ‌ర్చు చేస్తారు. రైతే రాజు అని చెప్పి పాల‌కులు మోసం చేస్తున్నారు. పెద్ద‌వాళ్లు న‌న్ను న‌మ్మ‌టానికి స‌మ‌యం ప‌డుతుంది.  యువ‌త మాత్రం న‌న్ను మ‌న‌స్ఫూర్తిగా  న‌మ్ముతున్నారు. క‌రవుతో అల్లాడుతున్న అనంత‌పురం జిల్లాకు న్యాయం చేసే వ‌ర‌కు పోరాటం చేస్తాను. ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ లేకుండానే చాలా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్కరించాం. అనంత‌పురం జిల్లా క‌రవు పార‌ద్రోలేందుకు చివరి వ‌ర‌కు పోరాటం చేస్తాను. ఇక్కడి నేల, వాతావ‌ర‌ణ ప‌రిస్థితితుల‌కు త‌గ్గ‌ట్టు ఏ పంట‌లు పండిస్తే లాభ‌సాటిగా ఉంటాయో శాస్ర్త‌వేత్త‌లు, వ్య‌వ‌సాయ అధికారులు రైతుల్లో అవ‌గాహ‌న క‌ల్పించాలి.  మీరు ఓట్లు వేసినా వేయ‌క‌పోయినా మీ స‌మ‌స్య‌ల‌పై జ‌న‌సేన పార్టీ పోరాడుతుంది” అన్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.