దాదాపు పదేళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉండటమే కాకుండా.. అత్యధిక రాష్ట్రాలలో తమ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడేలా చక్రం తిప్పిన బీజేపీకి తెలుగు రాష్ట్రాలు మాత్రం కొరుకుడు పడటం లేదు. తెలుగు రాష్ట్రాలలో బీజేపీ పరిస్థితి నానాటికీ తీసి కట్టు అన్నట్లుగా మారిపోతోంది. అటు ఏపీలో అధికార వైసీపీతో అంటకాగుతూ ప్రజాగ్రహాన్నిప్రోది చేసుకుంటున్న బీజేపీ, ఇటు తెలంగాణలో కూడా ప్రత్యర్థులను చీల్చి లబ్ధి పొందాలన్న వ్యూహంతో మొదటికే మోసం వచ్చే పరిస్థితులను సృష్టించుకుంది.
నిన్న మొన్నటి వరకూ తెలంగాణలో అధికార బీఆర్ఎస్ కు తామే ప్రత్నామ్యాయం అని ఘనంగా చాటుకున్న బీజేపీకి ఇప్పుడు ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా అన్న బెంగ పట్టుకుంది. తెలంగాణలో కనీసం గౌరవ ప్రదమైన స్థానాలను గెలుచుకోవాలన్నా జనసేన మద్దతు అవసరం అన్న అభిప్రాయానికి వచ్చింది. అందుకే జనసేనాని పవన్ కల్యాణ్ కు హస్తిన రావాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆహ్వానించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముంగిట పవన్ ను అమిత్ షా ఆహ్వానించడం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో జనసేన పార్టీతో సీట్ల సర్దుబాటు విషయంపై చర్చించేందుకే అమిత్ షా పవన్ కల్యాణ్ కు హస్తినకు రమ్మని ఆహ్వానం పంపారని అంటున్నారు. వాస్తవానికి జనసేనాని తమ పార్టీ ఎన్డీయే భాగస్వామ్య పక్షమేనని పదే పదే చెబుతున్నారు. అక్కడితో ఆగకుండా తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా ఏపీలో ఇప్పటికే తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణలో కూడా ఆయన అడుగులు ఆ దిశగానే పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆయన ఈ వైఖరే పొలిటికల్ స్పెక్యులేషన్స్ కు అవకాశం ఇస్తోందని కూడా అంటున్నారు.
తెలంగాణలో 36 స్థానాలలో పోటీ చేయనున్నట్లు జనసేన ఇప్పటికే జనసేన ప్రకటించేసింది. కానీ బీజేపీ మాత్రం మిత్రపక్షంగా తెలంగాణలో జనసేన పోటీకి దూరంగా ఉండి తమకు మద్దతు ఇవ్వాలని కోరుతోంది. ఈ మేరకు బీజేపీ హైకమాండ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ద్వారా జనసేనానికి రాయబారం కూడా పంపింది. అయితే ఇందుకు జనసేనాని నిర్ద్వంద్వంగా తిరస్కరించారని జేనసేన వర్గాలు చెబుతున్నాయి.
మామూలు పరిస్థితుల్లో అయితే.. జనసేన మద్దతు కోసం, తెలంగాణ ఎన్నికలలో సహకారం కోసం బీజేపీ ఇంతగా తాపత్రేయపడేది కాదు. కానీ తెలంగాణలో అధికారమే తరువాయి అనుకున్న పరిస్థితి నుంచి కనీసం నాలుగైదు స్థానాలలోనైనా విజయం సాధించగలమా అన్న పరిస్థితికి బీజేపీ దిగజారడంతో బీజేపీ డిస్పరేట్ గా తెలంగాణలో జనసేన మద్దతు కోసం ప్రయత్నిస్తున్నది. అయితే ఆ ప్రయత్నాలలో బీజేపీ స్నేహధర్మం పాటించడం మాని తన స్వార్థ ప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరించాలంటూ జనసేనానిపై ఒత్తిడికి ప్రయత్నిస్తున్నది. గతంలో జీహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా తమ పార్టీ త్యాగం చేసి బీజేపీకి మద్దతునిచ్చిందనీ, మరో సారి అదే పని చేయడానికి సిద్ధంగా లేమనీ పవన్ కల్యాణ్ కుండబద్దలు కొట్టేశారు. రాష్ట్రంలో పార్టీని కాపాడుకోవాలంటే ఈ సారి పోటీ చేసి తీరాల్సిందేనని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అదే విషయాన్ని కిషన్ రెడ్డితో భేటీలో విస్పష్టంగా చెప్పేశారు.
అదే సమయంలో ఏపీలో తెలుగుదేశంతో పొత్తు కుదుర్చుకున్న విధంగానే తెలంగాణలో కూడా ఆ పార్టీతో కలిసి వేడితే రాష్ట్రం మొత్తం మీద ప్రభావం చూపే అవకాశం ఉంటుందని ఇరు పార్టీల శ్రేణులూ అభిప్రాయపడుతున్నాయి. బీజేపీ నిర్ణయం కోసం ఇక ఎంత మాత్రం వేచి చూసే పరిస్థితి లేదని అంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే పవన్ కల్యాణ్ కు హస్తిన నుంచి పిలుపు రావడం గమనార్హం. జనసేనతో పొత్తు ద్వారా తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపుల మద్దతుతో పాటు, రాష్ట్రంలో పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ మద్దతు కూడా లభిస్తుందన్న ఉద్దేశంతోనే బీజేపీ జనసేన స్నేహహస్తం కోసం అర్రులు చాస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుతున్న సమాచరం మేరకు ఈ భేటీలో జనసేనతో సీట్ల సర్దుబాటు విషయంపై అమిత్ షా ఒక ప్రతిపాదన చేయనున్నారని తెలుస్తోంది. తెలంగాణలో జనసేనకు పొత్తులో భాగంగా 8 నుంచి పది స్థానాలను ఇచ్చేందుకు అమిత్ షా ప్రతిపాదించవచ్చని అంటున్నారు. అయితే అందుకు జనసేనాని అంగీకరించే అవకాశాలు అంతంత మాత్రమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అన్నిటికంటే మించి ఏపీలో అధికార వైసీపీ పట్ల బీజేపీ వైఖరిని నిలదీసేందుకే జనసేనాని హస్తినలో అమిషాతో భేటీకి అంగీకరించారని అంటున్నారు. అంతే కాకుండా ఏమీ మాజీ ముఖ్యమంత్రి అరెస్టు విషయంలో తమ ప్రమేయం ఇసుమంతైనా లేదన్న వివరణను ఈ సందర్బంగా అమిత్ షా జనసేనానికి ఇచ్చే అవకాశం ఉందని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలో అమిత్ షా లోకేష్ ను పిలిపించుకుని మరీ చంద్రబాబు అరెస్టు విషయంలో కేంద్రం పాత్ర లేదని చెప్పుకున్న సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.