కులం, మతం, ప్రాంతీయతను నమ్ముకుని రాజకీయాల్లోకి రాలేదని, మానవత్వం కోసం రాజకీయాల్లోకి వచ్చానని జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు తెలిపారు. సమాజ వికాసం కోసం జనసేన పార్టీ పనిచేస్తుంది తప్ప, కులం పేరుతో ప్రజలను విడగొట్టదని అన్నారు. సిద్ధాంతాలు లేని, కులాన్ని నమ్ముకున్న పార్టీలు కొద్ది కాలం మాత్రమే మనుగడ సాగించి నిర్వీర్యం అయిపోతాయన్నారు. పార్టీ సంస్థాగత నిర్మాణానికే పార్లమెంట్ స్థాయి కమిటీలు వేయాలని నిర్ణయించామని, దీని కోసమే జిల్లా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
జిల్లాలవారీ సమీక్షా సమావేశాల్లో భాగంగా శుక్రవారం విజయవాడలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల నాయకులు, కార్యకర్తలతో విడివిడిగా సమావేశమై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా శ్రీ పవన్కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “రాజకీయ వ్యవస్థలో అవినీతి రోజు రోజుకి పెరిగిపోతోంది. తెలుగుదేశం పార్టీ తక్కువ అవినీతితో పరిపాలిస్తుందని ఆశించి 2014లో ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కృషి చేశాను. అయితే ఆ పార్టీ కూడా నా అంచనాలకు మించిపోయి అవినీతిలో మునిగిపోయింది. చట్టాలను తమకు అనుకూలంగా మలుచుకొని రాజకీయపార్టీలు వాడుకుంటున్నాయి. దెందులూరు ఎమ్మెల్యే వేధిస్తున్నాడని నన్ను కలిసిన దళితులు చెబుతున్నారు, అటువంటి వ్యక్తిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి యాక్ట్ కింద కేసు పెట్టి అరెస్ట్ చేయాలి. అయితే ప్రభుత్వం ఆ పని చేయడం లేదు. ప్రజలు, ముఖ్యంగా మహిళలు ప్రభుత్వంపై ఎంతో ఆగ్రహంతో ఉన్నారు. వారి ఆగ్రహాన్ని మార్పు కోసం ఉపయోగించడమే జనసేన లక్ష్యం. ఇంటర్మీడియట్ తోనే చదువు ఆపేసినా చదవడం మాత్రం ఆపలేదు. రోజుకు కనీసం 8 గంటల పాటు చదువుతునే ఉంటాను. మార్క్స్ నుంచి కాన్షీరాం వరకు, నక్సలిజం, రిజర్వేషన్లు, రామజన్మభూమి వివాదం. సోవియట్ పతనం , సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అనేక విషయాలను క్షణ్ణంగా అవగాహన చేసుకున్నాను.
రాత్రికి రాత్రి పార్టీ నిర్మాణం చేయడం సాధ్యం కాదు. జనసేన నాయకుడిగా నా నడక ఎలా ఉంటుందో కార్యకర్తలకు తెలియజేసిన తర్వాత నా దారిలో నడవమని చెప్పడానికే నాలుగేళ్లు సమయం తీసుకున్నాను. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్ని అవమానాలను భరించానో, ఎంతమందిని ప్రభావితం చేశానో, ఎన్ని సమావేశాలు పెట్టానో మీ అందరికి తెలుసు. నా ఆలోచనలు, అనుభవాల నుంచి పుట్టినవే జనసేన పార్టీ ఏడు మూల సిద్ధాంతాలు . ప్రజా సంక్షేమం కోసం నేను ఎవరితో గొడవపెట్టుకోవడానికైనా సిద్ధం. విభజించు, పాలించు అనే సిద్ధాంతం ఏ రూపంలో ఉన్నావ్యతిరేకిస్తాను. మనందరం ఒకటేనన్న భావనతోనే రాజకీయాలు చేస్తాను. నా సభలకు పది లక్షల మంది ప్రజలు హాజరైన నాలో ఇసుమంతైనా మార్పు కనిపించదు. అదేదో నేను సాధించిన విజయంగా భావించను. మనం అనుకున్న భావజాలం ప్రజల్లోకి వెళ్లాలంటే కనీసం రెండు దశాబ్ధాల సమయం పడుతుంది. అందుకే నేను 25 ఏళ్ల పాటు పనిచేయడానికి, పోరాటం చేయడానికి వచ్చాను. ఈ పోరాటం కోసమే నేను తెలుగుదేశానికి మద్దతు తెలిపినప్పటికీ వారి నుంచి ఎటువంటి ప్రతిఫలం ఆశించలేదు. రాజకీయాల్లోకి వచ్చాక మనల్ని అభిమానించే వారికి విమర్శించే హక్కు ఉంటుంది. ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత నోటికి ఇష్టమెచ్చినట్లు మాట్లాడితే ప్రజల మన్నన కోల్పోతాం. రాజకీయంగా రావాల్సిన లబ్ధిని చేజార్చుకుంటాం. అందుకే నన్ను ఎంతమంది తిట్టినా ఆచితూచి స్పందిస్తాను తప్ప వారి స్థాయిలో దిగజారి మాట్లాడను. ఒక దేహానికి ఒక రక్తనాళం ఎలా సరిపోదో, ఒక దేశానికి ఒక నది ఎలా సరిపోదో, ఒక పార్టీకి ఒక నాయకుడు సరిపోడు. అందువల్ల పార్టీలోకి వచ్చేవారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిద్దాం.
నాయకులు మాట్లాడుతున్న మాటలకు, యువత మాట్లాడుతున్న మాటలకు చాలా తేడా కనిపిస్తుంది. నన్ను మూడు దశాబ్దాలు ముఖ్యమంత్రి చేయండని ఒకరు, నన్ను మరోసారి ముఖ్యమంత్రి చేయండి, నా తర్వాత మా అబ్బాయిని ముఖ్యమంత్రిని చేయండని మరొకరు అడుగుతుంటే .. మాకు 25 కిలోల బియ్యం అక్కర్లేదు, 25 ఏళ్ల భవిష్యత్తు ఇవ్వండని యువత అడుగుతున్నారు. నాయకులు అంతా కలసి వ్యవస్థను బలహీనపరిచారు. వ్యవస్థను బలోపేతం చేయడమే జనసేన లక్ష్యం. నాయకులు బలపడితే వాళ్ల చుట్టు మనం తిరగాలి, వ్యవస్థ బలపడితే మనల్ని వ్యవస్థే కాపాడుతుంది. ప్రస్తుత సంప్రదాయ రాజకీయాలతో ప్రజలు విసిగిపోయారు. మార్పు కోరుకుంటున్నారు. ఈ మార్పునకు జనసేన ఆలంబనగా మిగలాలి. కులం, మతం, ప్రాంతీయతతో కాకుండ, బలమైన భావజాలంతోనే తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ బలపడే విధంగా కలిసి కట్టుగా పనిచేద్దామని పిలుపు నిచ్చారు.
కృష్ణాజిల్లా నాయకులు, కార్యకర్తలతో..
మధ్యాహ్నం కృష్ణా జిల్లాకి చెందిన కో ఆర్డినేటర్లు, నాయకులు, కార్యకర్తలకి విడివిడిగా శ్రీ పవన్కళ్యాణ్ గారు దిశానిర్దేశం చేశారు. వారితో మాట్లాడుతూ “రాజకీయాల్లో నిలబడాడానికి ముందు గుండెల నిండా ధైర్యం కావాలి. సమాజంలో మార్పు రావాలంటే కనీసం 10 సంవత్సరాల సమయం కావాలి. ఈ ప్రస్థానం ప్రారంభించే ముందు నన్ను నేను ప్రశ్నించుకున్నా, నిలబడగలనా లేదా అని నన్ను నేను పరీక్షించుకున్నా. వ్యవస్థని వాడుకుని వ్యక్తులు బలపడుతున్నారు. వ్యవస్థని నాశనం చేస్తున్నారు. వారికి వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. క్షేత్ర స్థాయిలో ప్రజలు పడుతున్న కష్టాలు మాత్రం వీరికి అవసరం లేదు. నేను పార్టీ పెట్టి పోటీ చేసే ముందు క్షేత్ర స్థాయిలో ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రయత్నించా. 25 కేజీల బియ్యం వద్దు 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలి అన్న మాట క్షేత్ర స్థాయిలో ఓ సామాన్యుడి కడుపు మంట నుంచి పుట్టిందే. నేను సినిమాల్లో డబ్బు సంపాదిస్తున్న సమయంలో ఎవరైనా ఇబ్బంది అంటూ వస్తే నాకు తోచిన సాయం చేస్తూ వచ్చా. కానీ రాను రాను సమస్యలతో వచ్చే వారి సంఖ్య పెరుగుతూ వచ్చింది. అందరి సమస్యలకీ పరిష్కార మార్గం చూడాలంటే పొలిటికల్ ప్రాసెస్తోనే అది సాధ్యమనిపించింది. 2009 పీఆర్పీ వైఫల్యం తర్వాత అసలు నేను నిలబడగలనా లేదా అన్న ఆలోచన వచ్చినా, రాష్ట్ర విభజన తర్వాత వ్యవస్థలో మార్పు కోసం నిలబడి తీరాలి అనిపించింది.
రాష్ట్రాన్ని అడ్డదిడ్డంగా విడగొడుతుంటే, అందరినీ అవమానిస్తుంటే ఏ ఒక్కరూ కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గెలుస్తామా.? లేదా అని ఆలోచిస్తూ పార్టీ పెట్టలేదు. పోరాటం చేసేందుకే జనసేనని స్థాపించా. మన సమాజంలో కుల వ్యవస్థ బలంగా పెనవేసుకుపోయింది. కులాల ఆలోచనలు, కులాల మధ్య ఘర్షణలు అధిగమించకపోతే సామాజిక వినాశనం తప్పదు. రాజకీయ పార్టీ నడపడానికి కోట్ల రూపాయల పెట్టుబడి అవసరం లేదు. ఆశయాలు, భావజాలం బలంగా ఉంటే చాలు. పార్టీ కోసం పని చేస్తామని ముందుకు వచ్చిన వారిని చేసుకోమని వదిలేశా. ఎవరి సత్తా ఏంటో వారికి తెలియాలనే అలా చేశా. పార్టీ బలపడిన తర్వాత ఇప్పుడు కమిటీలు వేయాలన్న నిర్ణయానికి వచ్చా. పార్టీ బలం పెరిగిన నేపధ్యంలో జిల్లా స్థాయి కమిటీల మీద భారం పడుతుంది. అందుకే ఇప్పుడు పార్లమెంటరీ స్థాయి కమిటీలు వేయాలన్న నిర్ణయానికి వచ్చా. గతంలో జనసేన పార్టీకి స్థానాలు రావని చెప్పిన వారే, ఇప్పుడు కలసి రావాలని ఆహ్వానిస్తున్నారు. టిఆర్ఎస్ నేతలతో మాట్లాడిస్తున్నారు. ఇది మన బలానికి నిదర్శనం. రాజకీయాల్లోకి.. దెబ్బ తిన్నా నిల్చునే ధైర్యం, తెగింపు ఉన్నవారు కావాలి. నేను అలాంటి తెగింపుతోనే వచ్చా. దెబ్బతిన్నా కూడా మళ్లీ రాజకీయ పార్టీ పెట్టా. వ్యవస్థపై పోరాటం చేస్తున్నా. మనది రాజధాని సంబంధింత ప్రాంతం, కాబట్టి మీరు ఇంకా బలంగా పనిచేయాలి. రాజధాని అభివృద్ది అంటే లక్ష కోట్ల రూపాయల వ్యవహారం. అలాంటి అభివృద్ధిని సమంగా పంచరు. అడగాలి, పోరాటం చేసి సాధించుకోవాలి. అందుకు బలమైన వ్యక్తుల సమూహం అవసరం. ఇది మనలో మనం పోట్లాడుకునే సమయం కాదు. ప్రత్యర్ధులతో పోరాటం చేసి పార్టీని గెలిపించాల్సిన సమయం. నేను ఎంతో బలంగా పోరాడటానికి వచ్చాను, నాలాగా బలంగా ఉండే వారికోసం ఇన్నాళ్లు వేచి చూశాను. అందుకే పార్టీ నిర్మాణం నెమ్మదిగా చేస్తున్నాను. ప్రస్తుత ఎమ్మెల్యేల మధ్య సంభాషణలు మొత్తం దోచుకోవడం అనే అంశం మీదే సాగుతున్నాయి. వాళ్లు ఎంత తిన్నారు. మనం వస్తే ఇంకా ఎంత బాగా తినొచ్చు అనే అంశాల మీదే చర్చించుకుంటున్నారు తప్ప ప్రజా సమస్యలని మాత్రం వారు పట్టించుకోవడం లేదు.
ఎన్నికల గుర్తు కోసం దరఖాస్తు చేసినప్పుడు కూడా ఎన్నికల సంఘం వారు చూపించిన వాటిలో సామాన్యుడికి ప్రతిబింబించే “టీ గ్లాస్” కనిపించింది, అనుకోకుండా అదే మనకు గుర్తుగా వచ్చింది. చిన్ననాటి నుంచి నేను టీ అంటే ఎక్కువగా ఇష్టపడే వాడిని. ఇప్పుడు అదే టీ గ్లాస్ మన పార్టీ గుర్తయ్యింది. మన ఆలోచన ఎంత బలంగా ఉంటే అంత బలంగా మనకు అన్నీ కలిసి వస్తాయి. ఇది గాలి మన వైపు వీస్తుందన్న విషయాన్ని చెబుతోంది. అందరి ఆశీస్సులు మనకి ఉండబట్టే మనకు గాజు గ్లాసు గుర్తు వచ్చింది. వ్యవస్థ మీద ఉన్న కోపాన్ని ఉద్యమాలు వ్యక్తపరుస్తాయి. ఆ ఉద్యమ శక్తిని మంచి కోసం ఉపయోగించడమే జనసేన లక్ష్యం. కొంతమంది నాకు మీ దగ్గర డబ్బు లేదు పార్టీ నడపలేరు అని చెప్తున్నారు.. పార్టీ నడిపేందుకు డబ్బు అవసరమే కానీ అంతకంటే ముందు గుండె ధైర్యం కావాలి. దెబ్బ తినడానికి, తట్టుకోవడానికి సిద్ధంగా ఉండాలి. నేను ఒకరిని నమ్మి భాద్యతలు ఇచ్చాను అంటే నేను వెనుకడుగు వేయను. నాయకులు కొత్తవారు రావచ్చు. వారి వర్గం వారు రావొచ్చు కానీ ముందు నుంచి పనిచేస్తున్న జనసైనికులే పార్టీకి వెన్నెముక లాంటి వారు. మిమ్మల్ని పార్టీ తప్పకుండా గుర్తిస్తుంది. ప్రజాబలం లేని పార్టీలకి నిర్మాణం ఉన్నా ఉపయోగం ఉండదు. జనబలం ఉన్న పార్టీ నిర్మాణానికి ఎంతో సమయం పట్టదు. అయితే నేను పోరాడేతత్వం, చిత్తశుద్ధి ఉన్నవారి కోసం చూస్తున్నా..అందుకే సమయం తీసుకున్నా అన్నారు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్కళ్యాణ్ గారు.