అనంతపురం జిల్లా నుంచి కరవుని తరిమేందుకు ఇజ్రాయిల్ తరహా వ్యవసాయ విధానం అమల్లోకి తెస్తామని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు. ఇజ్రాయిల్‌లో నేల సారం ఉండదు. అయినా వారు టెక్నాలజీని వినియోగించుకుని కరువుని జయించారు. వెయ్యి గజాల్లో నలుగురికి సరిపడా ఆహారం పండిస్తున్నారు. అదే తరహా టెక్నాలజీతో ఇక్కడ తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు సాధించే అవకాశాలు ఉన్నాయి. నిరుపయోగంగా ఉన్న సెజ్ భూముల్లో ప్రత్యేక వ్యవసాయ క్షేత్రాలు ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. గురువారం అనంతపురం శ్రీ సెవన్ కన్వెన్షన్ హాల్లో శ్రీ పవన్‌కళ్యాణ్ గారు అనంతపురం కరవు, వలసలపై మీడియాతో మాట్లాడారు.
జిల్లాలో ఉన్న దుర్భర పరిస్థితులపై జనసేన రూపొందించిన డాక్యుమెంటరీ ప్రదర్శించారు. అనంతరం శ్రీ పవన్‌కళ్యాణ్ గారు మాట్లాడుతూ.. “ప్రతి చోటా డాక్యుమెంటరీలు చేయించడానికి కారణం, ఉద్దానం సమస్య జనసేన పార్టీ దృష్టికి వచ్చినప్పుడు ఆ సమస్య తీవ్రత పక్కనే ఉన్న శ్రీకాకుళం టౌన్‌కి కూడా తెలియదు. ఆ సమయంలో అక్కడ విపరీతమైన నిర్లక్ష్యం, కనీస సౌకర్యాలు లేవు, ప్రైమరీ హెల్త్ సెంటర్లు లేవు. అనంతపురం జిల్లాకి సంబంధించి కూడా వలసలు అతి తీవ్రమైన సమస్య. వలస కార్మికులు దళారులని నమ్మి దుబాయ్ లాంటి ప్రదేశాలకి వెళ్లి పోలీసులకి దొరికిపోవడం చాలా సందర్బాల్లో నా దృష్టికి వచ్చింది. రాయలసీమలో బలమైన నాయకులు ఉన్నారు. కానీ కరవుని మాత్రం పారద్రోల లేకపోతున్నారు. అనంత ఆధిపత్య పోరు కూడా కరవుకి కారణం. శింగనమల నియోజకవర్గం నుంచి వస్తున్నప్పుడు పంట పొలాలని పరిశీలిస్తే, పక్కనే కాలువ ఉన్నా నీరు ఎప్పుడు వస్తుందో రైతులకి తెలియదు. క్యాలెండర్ అందుబాటులో ఉండదు. ఇక్కడి నుంచి పులివెందుల నీరు వెళ్తుంది. మరో ఎమ్మెల్యే భూములు ఉన్న చోటుకి నీరు వెళ్తుంది. పక్కన ఉన్న భూములకి మాత్రం నీరు ఉండదు.
ఇక్కడ సమస్యలు, కరవు దుస్థితి బయటికి రాకుండా ప్రభుత్వాలు వాస్తవాలు దాచిపెడుతున్నాయి. అలా దాచడం వలనే ప్రజలు కష్టాల పాలవుతున్నారు. రెయిన్ గన్లు పెట్టేశాం.. అనంతపురం జిల్లాని సశ్య శ్యామలం చేసేశాం అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జాతీయ మీడియాని ఏ స్థాయిలో నమ్మించారంటే, చాలా అద్భుతంగా ఉందంటూ అభూతకల్పన చేసి చూపారు. రూ. 300 కోట్లు ఖర్చు చేసి రెయిన్‌గన్ మెటీరియల్స్ కొన్నారు, రూ. 700 కోట్లతో గుంటలు తవ్వారు. కానీ రైతుల దగ్గర ఆ రెయిన్‌గన్లు లేవు. అక్కడ వాస్తవాలు ప్రపంచం దృష్టికి తీసుకు వెళ్దామని అక్కడికి వెళ్తే, చంద్రబాబు గారు రెయిన్ గన్స్ ఓపెన్ చేసిన పొలం తాలూకు రైతుని స్థానిక నాయకులు దాచేశారు. వాస్తవాలు ఎక్కడ బయటికి వస్తాయోనన్న భయమే అందుకు కారణం.
ప్రజలని ఓట్లుగా చూస్తున్నారు
ప్రజల్ని కేవలం ఓటు బ్యాంకుగా చూస్తే అభివృద్ది జరగదు, వలసలు ఆగవు. మోసపూరిత చర్యలు కాకుండా కరవును పారద్రోలడానికి దీర్ఘకాలిక చర్యలు తీసుకోవాలి. అనంతపురం కరవుని తరిమేందుకు కింగస్టన్ యూనివర్శిటీ తరహా విధానాలు, ఇజ్రాయిల్ తరహా వ్యవసాయ పద్దతులు అమలు చేయాలి. పరిస్థితులు ఇలాగే కొనసాగితే 20 ఏళ్లకి ఎడారిగా మారిపోయే పరిస్థితులు ఉన్నాయి. కరవుపై పోరాటానికి జనసేన పార్టీ ఓ దశాబ్దకాలపు ప్రణాళికకి రూపకల్పన చేస్తుంది. ఓటు బ్యాంకు రాజకీయాలు కాకుండా దీర్ఘకాలిక ప్రణాళికలపై దృష్టిపెడుతుంది. చేనేతలపై లోతైన అధ్యయనం చేసి, అందరికీ ఉపయోగపడే విధివిధానాలు రూపొందిస్తుంది. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కోట్లాది రూపాయిల బిల్లులు పెండింగ్‌లో ఉన్న విషయం దృష్టికి వచ్చింది. జనసేన పార్టీ కంటి తుడుపు చర్యలు చేపట్టదు. పరిశ్రమలు స్థాపించక ముందే యువతలో నైపుణ్యం కల్పించాలి. కియ మోటార్స్ పెట్టారు. స్థానికులకి 30 శాతం ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ యూపీ, గుజరాత్‌ల నుంచి తీసుకువస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రాంతీయ విద్వేషాలకి దారి తీస్తాయి. పారిశ్రామికవేత్తల్ని కలిసినప్పుడు పరిశ్రమలు పెట్టాలి అని అడిగాం. ఇక్కడ పరిశ్రమలు పెట్టించే దిశగా సీరియస్‌గా ఆలోచిస్తున్నాం.
ప్రతిపక్ష నేత నన్ను వ్యక్తిగతంగా దూషించడం మాని అనంతపురం జిల్లా కరవుపై పోరాటం చేయాలి. అసెంబ్లీకి వెళ్లి మాట్లాడాలి. వైసీపీ నాయకులు జనసేనని గుర్తించకున్న ఫర్వా లేదు. సమస్యల్ని గుర్తిస్తే చాలు. మా జనసేనను ప్రజలు గుర్తించారు. జనసేన పార్టీ ఉన్నది వైసీపీ గుర్తింపు కోసం కాదు. ప్రజా సమస్యలపై పోరాటం చేసేందుకే ఉన్నాం. ఎమ్మెల్యేలని కొన్నారని పంతానికి పోయి అసెంబ్లీకి వెళ్ళం అంటే ఎలా.? పంతాలు పట్టింపులకి ఇదేం సినిమా కాదు. ఎమ్మెల్యేలని కొనడం చంద్రబాబు చేసిన నీచమైన పనే. అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కూడా అదే పని చేశారు. ఎమ్మెల్యేలు మొత్తాన్ని కొనేసినా ఒక్కడే అసెంబ్లీకి వెళ్లాలి. ప్రజా సమస్యల మీద పోరాటం చేయాలి.
నేను ఎక్కడి నుంచి పోటీ చేయాలి అనే విషయంపై జనవరి లేదా ఫిబ్రవరిల్లో స్పష్టత ఇస్తాను. జనసేన పార్టీ ఆంధ్రప్రదేశ్‌లోని 175 స్థానాల్లో పోటీ చేస్తుంది. బలం ఉన్న చోట మాత్రమే కాదు లేకపోయినా 175 స్థానాల్లో పోటీకి దిగుతాం. పార్టీలో యువతకి అవకాశాలు ఇస్తాం రాజకీయాల్లో డబ్బు ప్రభావం పనిచేస్తే జగన్ సిఎం అయ్యేవాడు. చంద్రబాబు జనసేనతో పని లేకుండా సిఎం అయ్యేవాడు. రాజకీయాల్లో డబ్బు ప్రభావం అనేది సెకండరీ” అన్నారు.