
మార్కాపురం నియోజకవర్గంలో సీఎం సహాయనిధి కింద 145 మంది లబ్ధిదారులకు సుమారు రూ.1.24 కోట్ల విలువైన చెక్కులు, ఎల్ఓసీలను పంపిణీ చేశారు. సోమవారం మార్కాపురంలోని టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు.
అదేవిధంగా ఎమ్మెల్యే కుమారుడు విగ్నేష్రెడ్డి తర్లుపాడు, గొట్లగట్టు, పొదిలి ప్రాంతాల్లో లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మాట్లాడుతూ సీఎం సహాయనిధి పేదల పాలిట వరంగా నిలుస్తోందన్నారు. ఖరీదైన వైద్య చికిత్సలు చేయించుకున్న అనంతరం పేద కుటుంబాలు అప్పులపాలు కాకుండా ఆర్థికంగా అండగా నిలిచేందుకు సీఎం సహాయనిధి ఉపయోగపడుతోందని తెలిపారు.
నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 2,000 మందికి సీఎం సహాయనిధి అందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. సహాయనిధి ద్వారా ఆర్థిక తోడ్పాటు అందడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు.