
కదిరి: అనంతపురం జిల్లా ఆర్‌డీటీ సంస్థకు సంబంధించిన విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (ఎఫ్‌సీఆర్ఏ) నమోదు పునరుద్ధరణపై కేంద్ర ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంతో కదిరి నియోజకవర్గంలో ఆనందోత్సాహాలు వ్యక్తమయ్యాయి. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్‌లకు అభినందనలు తెలుపుతూ పాలాభిషేకం నిర్వహించారు.
అవిభక్త అనంతపురం జిల్లా ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులు, ఆర్‌డీటీ సంస్థ గ్రామీణాభివృద్ధికి చేసిన సేవలను పరిగణనలోకి తీసుకుని కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర నాయకత్వం కూడా కేంద్రాన్ని ఒప్పించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో బీజేపీ, జనసేన పార్టీల ఆధ్వర్యంలో కదిరి పట్టణంలోని శ్రీ కృష్ణదేవరాయల విగ్రహం వద్ద ప్రముఖ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేనకు చెందిన పలు స్థానిక, జిల్లా నాయకులు పాల్గొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
ఆర్‌డీటీ సంస్థను 1969లో విన్సెంట్ ఫెర్రర్ మరియు ఆయన సతీమణి స్థాపించినట్లు పేర్కొంటూ, పేదరిక నిర్మూలన లక్ష్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బోరుబావులు తవ్వడం, ఇళ్ల నిర్మాణం, వైద్య సేవలు అందించడం వంటి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని నాయకులు వివరించారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాజా నిర్ణయంతో ఆర్‌డీటీ సంస్థ మరింత బలోపేతమై ప్రజలకు విస్తృతంగా సేవలు అందించగలదని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేశారు.