
• న్యాయస్థానాల్లోనూ పోరాడవచ్చు…. దాడులే సమాధానం కాదు
• వైసీపీ చేసిన, చేస్తున్న దిగజారుడు వ్యాఖ్యలకు కూటమి పార్టీలు ఏం చేయాలి?
• ఉప ముఖ్యమంత్రి, జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ పై సాక్షాత్తు వైసీపీ అధ్యక్షుడే హద్దులు దాటి వ్యాఖ్యలు చేశారు
• ప్రజా జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరి నడతను…. మాటలను జెన్-జి గమనిస్తోంది… మరచిపోవద్దు
ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యాఖ్యానాలు ఉంటాయి. వాటిపై స్పందించడంలోను ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి. విమర్శలను స్వీకరించలేక దాడులకు తెగబడటాన్ని ఎవరూ హర్షించరు. విమర్శలకు దాడులు సమాధానం కావు. విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలపై చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో పోరాడే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించింది.
వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ, అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితిలో కూడా చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్ రెడ్డి పాఠశాల విద్యార్థుల సమక్షంలోనే హద్దులు దాటి, దిగజారుడు మాటలు మాట్లాడారు. భార్యను కారుతో పోల్చి మాట్లాడిన శ్రీ జగన్ వాచాలత్వాన్ని ప్రజలుగానీ, కూటమి నాయకులుగానీ, శ్రేణులుగానీ మరచిపోలేదు. ఉప ముఖ్యమంత్రివర్యులు, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిత్వ హననానికి పాల్పడి, ఆయన కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఎంత నీచమైనవో ప్రజలందరికీ తెలుసు. శ్రీ జగన్ రెడ్డి కార్యాలయాలపైగానీ, ఆయనకు చెందిన సంస్థలపైగానీ జనసేనగానీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులుగానీ దాడికి తెగబడ్డారా? శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రతి సందర్భంలో పార్టీ నాయకులకు, శ్రేణులకు స్పష్టంగా చెప్పేవారు – ‘ఎదుటివారు దిగజారి మాట్లాడినా, మనం వారి స్థాయికి దిగజారవద్దు. ప్రజాస్వామ్య రీతిలోనే స్పందించండి. కుటుంబంలోని మహిళలు, ఆడబిడ్డలపై ఎట్టి పరిస్థితుల్లోనూ కామెంట్స్ చేయవద్దు’ అని. ఎవరైనా హద్దు మీరితే అంతర్గతంగా వారికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్దేశించిన నియమాలను పార్టీ ముఖ్యులు తెలిపేవారు. అదీ జనసేన విధానం. ఈ తరహా నిర్దేశాలను వైసీపీ నుంచి ఎప్పుడూ ఆశించలేము.
అసెంబ్లీ సాక్షిగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి సతీమణిపై వ్యాఖ్యలు చేస్తే నవ్వుతూ ప్రోత్సహించిన వ్యక్తి శ్రీ జగన్ రెడ్డి. ఆయన పార్టీ ఎమ్మెల్యే ఒకరు కాకినాడ నడిబొడ్డున నిలబడి అసభ్య పదజాలంతో శ్రీ చంద్రబాబు గారినీ, శ్రీ పవన్ కళ్యాణ్ గారినీ, వారి కుటుంబ సభ్యులను దూషించిన ఘటనను ఇంకా జనసైనికులు, వీర మహిళలు మరచిపోలేదు. టిడిపికి చెందిన అధికార ప్రతినిధి చేసిన కామెంట్ కు వైసీపీ శ్రేణులు టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేశాయి. వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడేయవచ్చు కానీ వాళ్ళను ఎవరైనా విమర్శించినా, ఒక మాట తూలినా కండ బలాన్ని ప్రదర్శించి హింసకు దిగుతారు. వైసీపీ వాళ్ళు ఈ రోజుకీ దిగజారి, అభ్యంతరకర భాషలోనే మాట్లాడుతున్నారు. వీటిపై కూటమి శ్రేణులు ఎన్నిసార్లు వైసీపీపై కండబలాన్ని ప్రదర్శించాలి?
• శ్రీ పవన్ కళ్యాణ్ చెప్పే మాట ఒక్కటే
జనసేన నాయకులకు, వీర మహిళలకు ప్రజల ముందు, మీడియా ముందు మాట్లాడేటప్పుడు ఏ విధంగా సిద్ధం కావాలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో చెబుతూ ‘పెదవి దాటని మాట నీకు బానిస… పెదవి దాటిన మాటకు నీవు బానిస’ అన్నారు. పదాలను వాడేముందు వాటికున్న విలువలను గౌరవించండి, పదునైన, వ్యంగ్యంతో కూడిన పదాలు వాడినా ఎదుటివారు స్వీకరించేలా ఉండాలి అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెబుతారు. ఎదుటివారు హద్దులు మీరి మాట్లాడినా, సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టినా చట్టబద్ధంగా ముందుకు వెళ్ళాలి అని దిశానిర్దేశం చేశారు.
మంగళవారం హైదరాబాద్ లో ఏబీఎన్ – ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ వ్యక్తులు దాడికి యత్నించిన ఘటనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఖండించారు. ఈ అంశంపై పార్టీ ముఖ్యులతో బుధవారం ఉదయం చర్చించారు. ఆ సంస్థ ఎండీ శ్రీ వేమూరి రాధాకృష్ణ గారు పత్రికలో రాసిన కొత్త పలుకులో ఘాటైన పదాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. ఏబీఎన్ ఛానెల్ లో ప్రసారమైన వీకెండ్ కామెంట్ ను తాను వీక్షించలేదని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే నాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని చెప్పారు.
• ‘జెన్ – జి’ని తక్కువ అంచనా వేయవద్దు
శ్రీ పవన్ కళ్యాణ్ గారు పలు సందర్భాల్లో జెన్ – జి గురించి ప్రస్తావిస్తారు. జెన్ జి తరం వారి ఆలోచనలను, వారి నిశిత పరిశీలనను ప్రజా జీవితంలో ఉన్నవారు తక్కువ అంచనా వేయకూడదు అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్పారు. ప్రజా ప్రతినిధులు, నాయకులు, సెలబ్రిటీస్ నడతను, వారి నోటి నుంచి వచ్చే ప్రతి మాటను జెన్ – జి పరిశీలిస్తుంది. విశ్లేషిస్తుంది. కాబట్టి 90వ దశకం రాజకీయాలు, హద్దులు దాటే మాటలు, అభ్యంతరకర వ్యాఖ్యలను హర్షించే రోజులకు కాలం చెల్లిందనే వాస్తవాన్ని ప్రజా క్షేత్రంలో ఉన్న ప్రతి ఒక్కరూ, విశ్లేషకులు పరిగణనలోకి తీసుకోవాలనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా చెబుతున్న మాట. జనసేన నాయకులకు, వీర మహిళలకు, శ్రేణులకు కూడా ఈ విషయాన్ని ప్రస్ఫుటంగా తెలియచేయాలని పార్టీ ముఖ్యులను ఆదేశించారు.
-జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం, మంగళగిరి