
ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది” అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు పేర్కొన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థలలో ఉపరితల, భూగర్భ జల వనరుల స్థిరత్వంపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నీటి సంరక్షణ చేయకపోతే భవిష్యత్ తరాలకు అన్యాయం చేసినట్లే అవుతుందని ఆయన హెచ్చరించారు. నీటి లభ్యత ఉన్న చోట అభివృద్ధి సాధ్యమవుతుందని, ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలిపారు.
గోదావరి, కృష్ణ, పెన్నా, వంశధార వంటి నదులు ఆంధ్రప్రదేశ్‌కు జీవనాధారమని, వ్యవసాయాధారిత ఆర్థిక వ్యవస్థకు ఇవి కీలకమని పేర్కొన్నారు.
భూగర్భ జలాలు వేగంగా తగ్గిపోతున్న నేపథ్యంలో వాటిని రక్షించడం అత్యవసరమని, ముఖ్యంగా గిరిజన మరియు కొండప్రాంతాల్లో వేసవికాలంలో నీటి కొరతను నివారించేందుకు వాటర్‌షెడ్ పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు తెలిపారు.
నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ఆధునిక సాంకేతికతలను వినియోగిస్తూ, నీటి సంరక్షణ చర్యలను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.