
* వీరమహిళ కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం!
* జనసేన పార్టీ సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి ఆధ్వర్యంలో ఘనంగా మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదిన వేడుకలు
చిలకలూరిపేట, జనసేన పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు వెన్నుముకగా, మార్గదర్శిగా నాదెండ్ల మనోహర్ నిలిచారని జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి అన్నారు. రాజకీయాల్లో విలువలు, హుందాతనం ఎలా ఉండాలో ఆయన ప్రతి అడుగులో ప్రతిఫలిస్తాయని తెలిపారు. జనసేన పార్టీ నేత, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ జన్మదినం సందర్భంగా పెంటేల బాలాజి ఆధ్వర్యంలో ఆయన కార్యాలయంలో సోమవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. జన్మదిన కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. ఇటీవల మరణించిన యడ్లపాడు ప్రాంతానికి చెందిన జనసేన వీర మహిళ చెమిటిగంటి అమరేశ్వరి కుటుంబానికి అండగా రూ. 1 లక్ష ఆర్థిక సహాయం అందజేశారు. ఇప్పటికే ఆమె కుమార్తె లక్ష్మీ ప్రసన్న విద్యాభ్యాసానికి పూర్తి బాధ్యత తీసుకున్నట్లు ప్రకటించిన బాలాజి, ఈ సందర్భంగా కుటుంబానికి మరింత చేయూత అందించారు.
* సమాజం మెచ్చే నాయకులుగా ఎదగాలి
ఈ సందర్భంగా బాలాజి మాట్లాడుతూ నాదెండ్ల మనోహర్ పార్టీ వ్యూహకర్తగా, క్లిష్ట సమయాల్లో సమతూకం పాటిస్తూ జనసేనను ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసే దిశగా నడిపించడంలో ఆయన కృషి అమోఘమని కొనియాడారు. రాజకీయాల్లో ఆవేశం కంటే ఆలోచన, భావోద్వేగాల కంటే బాధ్యత ముఖ్యమని మనోహర్ ఎప్పుడూ కార్యకర్తలకు సూచిస్తారని తెలిపారు. అదే బాటలో నడుస్తూ పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే నిజమైన జన్మదిన కానుక అని పేర్కొన్నారు. పౌర సరఫరాల మంత్రిగా రాష్ట్రంలోని పేద ప్రజలకు అందాల్సిన రేషన్ వ్యవస్థలో తీసుకువస్తున్న సంస్కరణలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. మనోహర్ నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ ఆశయ సాధన కోసం అందరూ ఏకతాటిపై నడవాలని, క్రమశిక్షణ గల కార్యకర్తలుగా, సమాజం మెచ్చే నాయకులుగా ఎదగాలని బాలాజి పిలుపునిచ్చారు.