

* కొత్త నేతతో కాంగ్రెస్ గట్టి ప్రయత్నాలు
* కింగ్ మేకర్ కావాలనుకుంటున్న ఏఐయూడీఎఫ్ ఒంటరి పోరాటం
ఈశాన్య భారతంలో పెద్ద రాష్ట్రం అయిన అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వరుసగా మూడోసారి విజయం సాధించి హ్యాట్రిక్ సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నికల సభల్లో ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ఇదే విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏప్రిల్ 9న అస్సాంలోని మొత్తం 126 సీట్లకు పోలింగ్ జరగనుంది. 2016 నుంచి గత పదేళ్లుగా బీజేపీ ప్రభుత్వాలు పాలన సాగిస్తున్నాయి. గత రెండు ఎన్నికల్లోనూ (2016, 2021) సాధారణ మెజారిటీకి అవసరమైన 64 స్థానాలు కాషాయపక్షానికి లభించలేదు. రెండుసార్లూ బీజేపీ 60 సీట్లతో సరిపెట్టుకోవాల్సివచ్చింది. పూర్వ అధికార ప్రాంతీయపక్షం అస్సాం గణ పరిషద్ (ఏజీపీ) వంటి ఒకటి రెండు పార్టీలతో కలిసి రెండు సందర్భాల్లోనూ సంకీర్ణ సర్కార్లను విజయవంతంగా నడుపుకుంటూ వస్తోంది బీజేపీ. మొదటి ఐదేళ్లూ ఆదివాసీ నేత శ్రీ సర్బానంద సోనోవాల్ అస్సాం మొదటి బీజేపీ ముఖ్యమంత్రి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి విజయం సాధించాక శ్రీ సోనోవాల్ మంత్రివర్గంలో పనిచేసిన కాంగ్రెస్ మాజీ నేత, కేబినెట్ మంత్రి శ్రీ హిమంతా బిశ్వ శర్మ బీజేపీ తరఫున సీఎం పదవి చేపట్టారు. 2001 నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా, తర్వాత కొన్నేళ్లు మంత్రిగా పనిచేసిన శ్రీ శర్మ 2015లో కాంగ్రెస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. 2016 నుంచి ఐదేళ్లు బీజేపీ మంత్రిగా కొనసాగి సమర్ధునిగా పేరు తెచ్చుకున్నారు. సీఎంగా గడచిన ఐదు సంవత్సరాలూ సంక్షేమ కార్యక్రమాలు కట్టుదిట్టంగా అమలు చేస్తూ, విదేశీ చొరబాటుదారులను గుర్తించి వారిపై చర్యలు తీసుకుని గట్టి నేతగా ఆయన నిరూపించుకున్నారు. మతం ఆధారంగా ప్రజలను చీలుస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నా శ్రీ హిమంతా శర్మ అత్యంత జనాదరణ గల అస్సాం నేతగా ఎదిగిపోయారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న అస్సాం శాసనసభ 16వ ఎన్నికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. వరుసగా 2001, 2006, 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ పదిహేనేళ్లు అస్సాంలో అధికారంలో ఉంది. ఈ మూడుసార్లూ ప్రస్తుత పీసీసీ నేత, సీఎం అభ్యర్థి, లోక్‌సభలో ఉప ప్రతిపక్ష నేత శ్రీ గౌరవ్ గోగోయ్ తండ్రి శ్రీ తరుణ్ గోగోయ్ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా అధికారంలో కొనసాగి కొత్త రికార్డు సృష్టించారు. ఆయన పాలనపై విసుగెత్తిన జనం 2016లో బీజేపీకి మొదటిసారి అత్యధిక స్థానాలు (60) ఇవ్వడంతో కాషాయ సర్కార్ల పాలన మొదలై దిగ్విజయంగా కొనసాగుతోంది.
* అంచెలంచెలుగా బీజేపీకి పెరిగిన ఆదరణ
2016లో తొలి ఆదివాసీ నేత శ్రీ సర్బానంద సోనోవాల్ నాయకత్వాన అధికారంలోకి వచ్చిన బీజేపీ మొదటి సర్కారు పాలనలో 2019 డిసెంబర్‌లో కేంద్రంలోని శ్రీ నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలు చేయడంలో చూపించిన పట్టుదల అస్సామీలను ఆకట్టుకుంది. అయితే, బీజేపీ తన బలాన్ని 60 సీట్లకు మించి పెంచుకోలేకపోయింది. కాని, మళ్లీ 2021 ఎన్నికలయ్యాక శ్రీ హిమంతా శర్మ బీజేపీ రెండో సీఎం కావడంతో పార్టీ బలోపేతం కావడానికి మంచి పునాదులు పడ్డాయి. శ్రీ శర్మ హయాంలో చేసిన అస్సాం పశువుల సంరక్షణ చట్టం–2021, అస్సాం ముస్లింల వివాహాలు, విడాకుల నమోదు చట్టం (1935) రద్దు–2024 వంటి చట్టాలు వివాదాస్పదమైనా ఇవి హిదువులను ఆకట్టుకున్నాయి. ఇంకా, రాష్ట్రంలో బాల్య వివాహాల (2023–24) నివారణకు కఠిన చర్యలు తీసుకోవడం కూడా శ్రీ హిమంతా శర్మ పట్టు బిగియడానికి దోహదం చేశాయి. అంతేగాక బహు భార్యత్వం, లవ్ జిహాద్ నివారణకు ప్రతిపాదిత బిల్లులు కూడా వివాదాలు సృష్టించినా మెజార్టీ హిందువుల మద్దతు కూడగట్టగలిగాయి. సుపరిపాలన, సంక్షేమ కార్యక్రమాల ద్వారా బీజేపీ ఈ ఎన్నికల్లో గెలుపునకు ప్రయత్నిస్తోంది. మరో పక్క ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ ఈసారి కొత్త నాయకత్వంతో (శ్రీ గౌరవ్ గోగోయ్ తదితరులు) బరిలోకి దిగింది. ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను సొమ్ముచేసుకుని అధికారంలోకి రావడానికి రాయ్‌జొర్ దళ్ వంటి కొత్త పార్టీతో పొత్తు పెట్టుకోవడమేగాక నూతన సామాజిక సంకీర్ణాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావడానికి హస్తం పార్టీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది.
*నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త ఎన్నికల చిత్రం
2023లో ప్రత్యేకించి అస్సాంలో ఎన్నికల సంఘం జరిపిన నియోజకవర్గాల పునర్విభజనతో అసెంబ్లీ స్థానాల రూపురేఖలు, మత, కుల సమీకరణలు ఈ ఎన్నికల్లో మారిపోయాయి. ఈ అంశాలు తుది ఫలితాలను ప్రభావితం చేసే అవకాశముంది. ముఖ్యంగా ముస్లింల జనాభా అధికంగా ఉన్న స్థానాల్లో చేసిన మార్పులు బీజేపీకి ఎంత వరకు అనుకూలిస్తాయో ఓట్ల లెక్కింపు జరిగే మే 4న తేలిపోతుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమిలో ఏజీపీ, యూపీపీపీఎల్ వంటి ప్రాంతీయపక్షాలు ఉన్నాయి. కాంగ్రెస్ కూటమిలో ముస్లింల ఆధిపత్యంలోని ఏఐడీయూఎఫ్, సీపీఎం, కొన్ని ఇతర పక్షాలు ఎన్నికల బరిలో నిలిచాయి. ఈ ఎన్నికల్లో బీజేపీకి 60, దాని మిత్రపక్షాలు ఏజీపీకి 9, యూపీపీఎల్‌కు 6, బీఓపీఎఫ్‌కు 4 సీట్లు దక్కాయి. కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్‌కు 29, ఏఐయూడీఎఫ్‌కు 16 స్థానాలు లభించాయి. సామాజిక, రాజకీయ కార్యకర్త శ్రీ అఖిల్ గోగోయ్ నేతృత్వంలో స్వతంత్రంగా పోటీచేసిన రాయ్‌జొర్ దళ్ ఒక్క స్థానం గెలుచుకుంది.
* రెండు కూటముల్లో మారిన మిత్రపక్షాలు
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని కూటమిలో మూడు మిత్రపక్షాలు: అస్సాం గణ పరిషత్ (ఏజీపీ), బొడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (బీపీఎఫ్), రాభా హసోంగ్ జౌతా మంచా ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలోని కూటమిలో అస్సాం జాతీయ పరిషత్, సీపీఐ, సీపీఎం, రాయ్‌జొర్ దళ్ సహా ఆరు పార్టీలు పోటీ చేస్తున్నాయి. అస్సాం సన్మిలిత మోర్చా (ఏఎస్‌ఎం) పేరుతో బరిలోకి దిగిన కాంగ్రెస్ కూటమిలో కాంగ్రెస్ 94, రాయ్‌జొర్ దళ్ 11, సీపీఎం, ఏపీహెచ్‌ఎల్సీ రెండేసి స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. సీపీఐ (ఎంఎల్)కు ఈ కూటమి ఒక సీటు కేటాయించింది. శ్రీ గౌరవ్ గోగోయ్‌ను ఏఎస్‌ఎం సీఎం అభ్యర్ధిగా ప్రచారం చేస్తూ ఎన్డీఏ కూటమిని ఓడిస్తామని రాయ్‌జొర్ దళ్ నేత శ్రీ అఖిల్ గోగోయ్ ప్రకటించారు. ఎన్డీఏ కూటమిలో బీజేపీ 89, ఏజీపీ 26, బీబీఎఫ్ 11 స్థానాల్లో అభ్యర్ధులను నిలబెట్టాయి. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కూటమి మొత్తం 79 సీట్లు గెలుచుకుంది. అప్పుడు ఈ కూటమిలో భాగస్వామ్యపక్షమైన యునైటెడ్ పీపుల్స్ పార్టీ లిబరల్ (యూపీపీఎల్) ఈసారి ఎన్డీఏ నుంచి వైదొలగింది.
*అగ్రనేతల ఫిరాయింపుతో బలహీనపడిన కాంగ్రెస్
ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ, రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు శ్రీ బోర్డోలోయ్, పీసీసీ మాజీ అధ్యక్షుడు శ్రీ భూపేన్ కుమార్ బోరా, ఇంకా కొందరు బడా కాంగ్రెస్ నేతలు ఎన్నికలకు కొన్ని రోజుల ముందు బీజేపీలో చేరారు. అంతేగాక మార్చి మొదటి వారంలో కాంగ్రెస్ నుంచి సస్పెండైన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఇలా కొందరు కాంగ్రెస్ నేతలు పార్టీలో చేరడంతో బీజేపీ తన 19 మంది సిట్టింగ్ శాసనసభ్యులకు ఈసారి టికెట్లు ఇవ్వలేదు. ఫలితంగా శ్రీ బోర్డోలోయ్ వంటి కాంగ్రెస్ ఫిరాయింపుదారులకు బీజేపీ టికెట్లు లభించాయి.
*బడా నేతల స్థానాలపై అందరి దృష్టి
ముఖ్యమంత్రి శ్రీ హిమంతా శర్మ తాను 2001 ఎన్నికల నుంచి వరుసగా గెలుస్తూ వస్తున్న జలూక్‌బారీ స్థానం నుంచి బరిలో నిలబడ్డారు. కాంగ్రెస్ ఎంపీ, పీసీసీ నేత శ్రీ గౌరవ్ గోగోయ్ తొలిసారిగా జోర్హాట్ నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో జోర్హాట్ ఎంపీ సీటు నుంచి శ్రీ గౌరవ్ లోక్‌సభకు ఎన్నికయ్యారు. మరో కాంగ్రెస్ నేత, అస్సాం కాంగ్రెస్ మాజీ సీఎం శ్రీ హితేశ్వర్ సైకియా కుమారుడు శ్రీ దేబబ్రత సైకియా నజీరా నుంచి పోటీ చేస్తున్నారు. ఇటీవల పార్టీలో చేరిన కాంగ్రెస్ ఎంపీ శ్రీ బోర్డోలోయ్‌కు దిస్‌పూర్ బీజేపీ టికెట్ దక్కింది. ఆయనపై అస్సాం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి మీరా బర్తాకూర్ గోస్వామి పోటీ చేస్తున్నారు. బీజేపీలో ఎన్నికల ముందు చేరిన మరో కాంగ్రెస్ నేత శ్రీ భూపేన్ బోరాకు బిహ్‌పురియా నుంచి బీజేపీ టికెట్‌పై పోటీ చేసే అవకాశం లభించింది. కాంగ్రెస్ మిత్రపక్షం రాయ్‌జొర్ దళ్ నేత శ్రీ అఖిల్ గోగోయ్ తన పాత స్థానం శివసాగర్ నుంచి బరిలోకి దిగారు. బీజేపీ ప్రధాన మిత్రపక్షం ఏజీపీ నేత, కేబినెట్ మంత్రి శ్రీ కేశబ్ మహంతా ఈసారి కూడా కలియాబొర్ నుంచి పోటీలో ఉన్నారు. బోకాఖాట్ నుంచి ఏజీపీ అధ్యక్షుడు శ్రీ అతుల్ బోరా రంగంలో ఉన్నారు.
*కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా మైనారిటీల పార్టీ ఏఐయూడీఎఫ్ పోటీ
బెంగాలీ మాట్లాడే ముస్లింలు ప్రధానంగా ఉండే దిగువ అస్సాంలో మైనారిటీల పార్టీగా బలపడిన ప్రాంతీయ రాజకీయపక్షం ఆలిండియా యునైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (ఏఐడీయూఎఫ్). అత్తర్ వ్యాపారి, మాజీ ఎంపీ శ్రీ మహ్మద్ బద్రుద్దీన్ అజ్మల్ స్థాపించిన ఈ పార్టీ ఈ ఎన్నికల్లో దాదాపు ఒంటరిగా పోటీ చేస్తోంది. ఏఐడీయూఎఫ్‌కు ఏఐఎంఐఎం మద్దతు ప్రకటించింది. గతంలో కాంగ్రెస్‌తో ఉన్న ఎన్నికల పొత్తును రద్దు చేసుకుని ఏఐడీయూఎఫ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమిలో ఉన్న ఏఐయూడీఎఫ్ 20 సీట్లకు పోటీచేసి 16 కైవసం చేసుకుంది. ఈ పార్టీ శాసనసభ ఎన్నికల్లో ఇన్ని స్థానాలు గెల్చుకోవడం ఇదే మొదటిసారి. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాల్లో ఈసారి 27 సీట్లకు ఈ పార్టీ పోటీపడుతోంది. 2024 పార్లమెంటు ఎన్నికల్లో శ్రీ అజ్మల్ పార్టీ కాంగ్రెస్‌తో పొత్తు లేకుండా ఒంటరిగా పోటీ చేసింది. అయితే, అంతకు ముందు మూడుసార్లు లోక్‌సభకు ఎన్నికైన పార్టీ అధ్యక్షుడు శ్రీ బద్రుద్దీన్ అజ్మల్ ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. ఒకప్పుడు ముస్లింల మద్దతు గణనీయంగా సంపాదించిన ఈ పార్టీ క్రమంగా బలహీనమౌతోంది. ముస్లింలు నెమ్మదిగా మళ్లీ కాంగ్రెస్‌కు చేరువ అవుతున్న కారణంగా ఏఐయూడీఎఫ్ పూర్వ వైభవం కోల్పోతోంది. ఈ ఎన్నికల్లో ఏ కూటమికి మెజారిటీ దక్కకపోతే ‘కింగ్‌మేకర్’ పాత్ర పోషించే అవకాశం వస్తుందని ఆశిస్తోంది.
* ‘గ్యారంటీ లెటర్’ పేరుతో కాంగ్రెస్ ఎన్నికల హామీలు
ఎన్నికల ప్రణాళికను ‘గ్యారంటీ లెటర్’ పేరుతో కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. పదేళ్ల తర్వాత అస్సాంలో అధికారంలోకి రావడానికి ఐదు గ్యారంటీలు ప్రకటించింది. ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆరోగ్య బీమా, ప్రతి మహిళకు నెలవారీ ఆర్థిక సాయం, ఇంకా వ్యాపారం ప్రారంభించాలనుకునే ప్రతి స్త్రీకి ఒకేసారి రూ.50 వేల సాయం, సీనియర్ సిటిజెన్లకు నెలకు రూ.1250 అందిస్తామని, పది లక్షల మందికి శాశ్వత భూపట్టాలు పంపిణీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఇంకా ప్రసిద్ధ అసామీ గాయకుడు శ్రీ జుబిన్ గార్గ్ అనుమానాస్సద మృతి కేసును తాము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో పరిష్కరిస్తామని కూడా కాంగ్రెస్ వాగ్దానం చేసింది.
*రెండు లక్షల ఉద్యోగాలు, ఉమ్మడి పౌరస్మృతి అమలు: బీజేపీ మేనిఫెస్టో
మళ్లీ అధికారంలోకి వస్తే ఐదేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని, ఉమ్మడి పౌరస్మృతి అమలు చేస్తామని బీజేపీ తన ఎన్నికల ప్రణాళికలో వాగ్దానం చేసింది. గువాహటిలో కేంద్ర ఆర్థికమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు. బీజేపీ పాలనలో అస్సాం చెప్పుకోదగిన ప్రగతి సాధించిందని ఆమె చెప్పారు. ఇంకా ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి శ్రీ హిమంతా శర్మ, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు శ్రీ దిలీప్ సైకియా, మాజీ సీఎం, కేంద్ర మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ పాల్గొన్నారు. వచ్చే మొదటి రెండేళ్లలో రూ.18 వేల కోట్లు వ్యయం చేసి అస్సాంలో వరదలు లేకుండా చేస్తామని, ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేస్తామని శర్మ హామీ ఇచ్చారు. ‘‘ ఒక జిల్లా, ఒక వైద్య కళాశాల, ఒక యూనివర్సిటీ, ఒక ఇంజనీరింగ్ కాలేజీ స్థాపన లక్ష్యంగా పనిచేస్తాం,’’ అని మేనిఫెస్టోలో బీజేపీ వాగ్దానం చేసింది. అంతేగాక, అస్సాంలో తరతరాలుగా నివసిస్తున్న స్థానిక జాతుల హక్కుల పరిరక్షణ, ప్రాదేశిక సమగ్రత కాపాడడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ బీజేపీ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. బంగ్లాదేశ్, ఇంకా ఇతర ప్రాంతాల నుంచి అస్సాంలోకి ప్రజల అక్రమ చొరబాట్లను అరికట్టడం ఈ ఎన్నికల్లో ప్రధాన అంశంగా కొనసాగుతోంది. చట్టవ్యతిరేకంగా అస్సాంలో స్థిరపడుతున్న ఇతరులను వెనక్కి పంపించడానికి జాతీయ పౌరుల రిజిస్టర్ (ఎన్‌ఆర్‌సీ), పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలుపై రెండు ప్రధాన కూటములైన ఎన్డీఏ, ఏఎస్‌ఎం (కాంగ్రెస్) కూటమి రాష్ట్రంలో ప్రధానంగా మైనారిటీలు ఎక్కువగా నివసించే ప్రాంతాల్లో తమ ప్రచారంలో ఎక్కువ మాట్లాడుతున్నాయి. బాల్య వివాహాలు అరికట్టడానికి పోస్కో చట్టం పకడ్బందీగా అమలు చేయడం గురించి బీజేపీ తన ప్రచారంలో ప్రస్తావిస్తోంది. అయితే, మైనారిటీలకు వ్యతిరేకంగా బీజేపీ సర్కారు ఇలాంటి చర్యలు తీసుకుంటోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. అస్సాం ప్రగతి, ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుపై బీజేపీ తన ప్రచారంలో ప్రాధాన్యం ఇస్తోంది. రోడ్లు, రైలు మార్గాలు, జల మార్గాలు వంటి మౌలిక సదుపాయాల విస్తరణ, బడా పారిశ్రామిక సంస్థల నుంచి పెట్టుబడులను ఆకర్షించడం వంటి విషయాలకు పాలక కూటమి ప్రాధాన్యం ఇస్తూ ఈ దిశగా తాను చేసిన కృషిని వివరిస్తోంది.
*బీజేపీనే విజయం వరిస్తుందని చెబుతున్న సర్వే
126 సీట్లున్న అస్సాం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ కూటమికి విజయం లభిస్తుందని వోట్ వైబ్స్ అనే సంస్థ తన సర్వేలో తెలిపింది. ఈ సర్వే ఫలితాలను మీడియా సంస్థ సీఎన్‌ఎన్–న్యూస్ 18లో ప్రసారం చేశారు. మెజారిటీకి అవసరమైన 64 స్థానాలకు మించి ఎన్డీఏ 80–90 సీట్ల వరకూ కైవసం చేసుకోవచ్చని ఈ సర్వే జోస్యం చెప్పింది. కాంగ్రెస్ కూటమికి 29 నుంచి 39 మధ్య సీట్లు వచ్చే అవకాశాలున్నాయని ఈ సర్వే అంచనా వేసింది. ముఖ్యమంత్రి పదవికి తాము మద్దతు ఇచ్చే నేత ప్రస్తుత బీజేపీ సీఎం శ్రీ హిమంతా బిశ్వ శర్మ అని ఈ సర్వేలో పాల్గొన్న 48% ఓటర్లు అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ నేత శ్రీ గౌరవ్ గోగోయ్‌కు 37 శాతం మంది మద్దతు లభించిందని ఈ సర్వే వెల్లడించింది. ఈ ఎన్నికల్లో ఎన్డీఏకు 42.7% ఓట్లు, కాంగ్రెస్ కూటమికి 36.1% ఓట్లు పడే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. తాజాగా జరిపిన ఈ సర్వే అంచనాల ప్రకారం బీజేపీ కూటమి మూడో వరుస విజయంతో హ్యాట్రిక్ సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.