
గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ముందుకొచ్చే వారికి కూటమి ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందిస్తుందని సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. శనివారం గుంటూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన కీలక విషయాలు వెల్లడించారు.
రాష్ట్రం సహజసిద్ధమైన లొకేషన్లకు నిలయమని, ప్రస్తుతం షూటింగ్‌లు సజావుగా జరుగుతున్నాయని చెప్పారు. సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు వేగంగా ఇస్తున్నామని తెలిపారు. షూటింగ్‌లతో పాటు శాశ్వత మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు.
తిరుపతి, వైజాగ్, అమరావతి ప్రాంతాల్లో స్టూడియోలు నిర్మించేందుకు భూములు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. రికార్డింగ్, డబ్బింగ్ థియేటర్ల నిర్మాణానికి ముందుకొచ్చే వారికి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు.
భారీ సినిమాలకు టికెట్ ధరల పెంపు, చిన్న సినిమాలకు ప్రత్యేక రాయితీలు అందిస్తున్నామని తెలిపారు. సినీ, రంగస్థల కళాకారులను గౌరవిస్తూ త్వరలో నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించనున్నట్లు చెప్పారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌కు సినీ రంగంపై ప్రత్యేక అవగాహన ఉందని, పరిశ్రమ అభివృద్ధికి వారు కృషి చేస్తున్నారని మంత్రి దుర్గేష్ పేర్కొన్నారు. సినీ పరిశ్రమ రాష్ట్రానికి వచ్చి అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.