
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. పాలనలో వేగం పెంచడం, నిర్ణయాలను త్వరితగతిన అమలు చేయడం ప్రధాన లక్ష్యాలుగా చర్చలు సాగాయి.
సమావేశం అనంతరం కార్యదర్శుల పనితీరుపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలు ప్రజలకు సులభంగా సేవలు అందించే విధంగా ఉండాలని, పనులను క్లిష్టంగా మార్చకుండా చూసుకోవాలని స్పష్టం చేశారు. పాలనా వ్యవహారాల్లో ఎలాంటి జాప్యం చోటుచేసుకోకూడదని అధికారులకు కఠిన సూచనలు చేశారు.
అజెండా తయారీలో జాప్యం జరిగిన విషయాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రస్తావించారు. ముందుగానే అజెండా అందితే మంత్రులు అంశాలను సమగ్రంగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, వ్యవస్థలను గాడిలో పెట్టి నిర్ణీత గడువులో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.