
• అమరావతిపై మరోసారి వైసీపీ విషం కక్కింది
• రాష్ట్ర రాజధాని అంశంపై పార్లమెంటులో వైసీపీ తీరు సరికాదు
• ప్రజాభీష్టాన్ని జగన్ ఎన్నడూ గౌరవించలేదు
• అలజడి, అశాంతి నెలకొల్పడమే వైసీపీ లక్ష్యం
• బెంగళూరులో ఉండే జగన్ కు శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత లేదు
• జనసేన పార్టీ అమరావతికి కట్టుబడి ఉంది
• తెనాలిలో మీడియాతో మాట్లాడిన రాష్ట్ర మంత్రి, జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
‘ప్రజలకు అవసరమైంది.. ప్రజాభీష్టం మేరకు జరిగేది.. ప్రజావసరాలను తీర్చే ఏ ప్రక్రియ జగన్ కు పట్టదు.. ఇష్టముండదు. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం, అధికారం కోసం అలజడులు సృష్టించడం మాత్రమే ఆయనకు తెలిసిన పని. ఓ బాధ్యతగల పార్టీ అధినేతగా ఆయన ఎప్పుడూ ప్రవర్తించలేదు. రాష్ట్రానికి సంబంధించి అమరావతి రాజధానిగా చట్టంలో గుర్తించే అంశం పార్లమెంటులో చర్చకు వచ్చినపుడు అంతా ఏకమై బలపర్చాలనే కనీస ఇంగితాన్ని వైసీపీ ప్రజాప్రతినిధులు పార్లమెంటులో మరిచిపోయార’ని రాష్ట్ర ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సమయంలో తన స్వలాభం, అధికార కాంక్షతో వ్యవహరించిన మాదిరిగానే నేడు రాష్ట్ర రాజధాని విషయంలో కూడా జగన్ తన స్వార్థపూరిత ఆలోచనలని బయటపెట్టారని చెప్పారు. తెనాలిలో బుధవారం పింఛన్ల పంపిణీలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ… ‘‘వైసీపీ అమరావతిపై మొదటి నుంచి విషం కక్కుతోంది. రాజధానిగా అమరావతిని గర్వించేలా రూపొందిస్తున్న తరుణంలో మరోసారి వైసీపీ తన నైజాన్ని బయటపెట్టుకుంది. అమరావతి సింగపూర్ తరహాలో ఉండాలనే బలమైన కాంక్షతో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారు డిజైన్లు, మాస్టర్ ప్లాన్ వంటివి అంతర్జాతీయ సంస్థలతో తయారు చేయిస్తున్నారు. ప్రజలు అద్భుతమైన అవకాశాన్ని జగన్ కు ఇచ్చినపుడు అయిదేళ్లలో పరిపాలన చేతకాక, అమరావతిని అంగుళం కూడా ముందుకు తీసుకెళ్లడం ఇష్టం లేక మూడు రాజధానులు అంటూ నాటకం ఆడారు. తుగ్లక్ నిర్ణయాలు తీసుకున్నారు.
•అయిదేళ్లూ విధ్వంసమే సృష్టించారు
ప్రజా జీవితంలో రాష్ట్ర ప్రజలు వైసీపీకి ఓ గొప్ప అవకాశాన్ని ఇచ్చారు. దాన్ని వారు విధ్వంసం కోసం వినియోగించుకున్నారు. పాలనను ప్రజా వేదిక కూల్చి మొదలుపెట్టారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత అమరావతిని రాజధానిగా కొనసాగించిన అప్పటి తెలుగుదేశం ప్రభుత్వ స్ఫూర్తిని, తర్వాత వచ్చిన వైసీపీ నాయకులు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. ప్రజలను, పెట్టుబడిదారులను బెదిరించేలా, సంస్థలను వెళ్లగొట్టేలా పాలించారు. అమరావతి రైతుల్ని, మహిళల్ని తీవ్రంగా అవమానించారు. దుర్మార్గంగా ముందుకు వెళ్లారు. అప్పటి వైసీపీ విధానాలు, ప్రవర్తనతోనే నేడు విభజన చట్టంలో రాజధానిపై మార్పు తీసుకువచ్చే అగత్యం పట్టింది.
•ప్రెస్ మీట్ అవ్వగానే బెంగళూరు వెళ్లేదెవరు?
రాజధాని విషయం మాట్లాడేటపుడు వ్యక్తిగత దూషణలు, విమర్శలు చేయకూడదనే విషయాన్ని జగన్ మరిచిపోయారు. ప్రతిసారీ హైదరాబాద్ కు గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్తున్నారని జగన్ అర్ధం లేకుండా మాట్లాడుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్ రాజధానిగా ఉండేది. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది. మా కుటుంబాలకు సంబంధించి వృత్తిగతంగా, వ్యక్తిగతంగానూ హైదరాబాద్ తో ఉన్న అనుబంధం దృష్ట్యా మేం హైదరాబాద్ వెళితే తప్పు ఏముంది..? ప్రెస్ మీట్ అయిపోగానే బెంగళూరులో వాలిపోయే జగన్ దీని గురించి మాట్లాడటం హాస్యస్పదంగా ఉంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెందిన ఓ కీలకమైన బిల్లు తీసుకొచ్చినపుడు అంతా ఐక్యంగా గళం వినిపిస్తే ఎంతో బాగుండేది. కానీ వైసీపీ నాయకుడు ఓట్లు కోసం, విద్వేషాలను రెచ్చగొట్టాలనే కుట్రతో, పైశాచిక ఆనందం కోసం రాజధాని మీద మళ్లీ విషం చిమ్మడం మొదలుపెట్టారు.
•జనసేన పార్టీ అమరావతికి కట్టుబడి ఉంది
జనసేన పార్టీ అమరావతి రాజధాని నిర్మాణానికి కట్టుబడి ఉంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులకు వచ్చారు. సుమారు రూ.50 వేల కోట్లతో పనులు వేగంగా జరుగుతున్నాయి. జగన్ తన దుర్మార్గమైన ఆలోచనలు మానుకోవాలి. మళ్లీ తాము వస్తే ఏదో చేస్తామనే బెదిరింపులు, నీచమైన మాటలు ఆపాలి. రాజధాని మీద చట్టంలో మార్పు చేసినందుకు గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారికి, కేంద్ర ప్రభుత్వానికి జనసేన పార్టీ తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలిపుతున్నాం. అమరావతి నిర్మాణానికి, దానిని రాష్ట్ర అభివృద్ధికి మూలకేంద్రంగా చేయడానికి జనసేన పార్టీ సంపూర్ణంగా సహకరిస్తుంది’’ అన్నారు.