
* బాణసంచా కార్ఖానాల్లో భద్రత లేమి
* వేట్లపాలెం ఘటన వెనుక యంత్రాంగం నిర్లక్ష్యం
* నీరుగారిన నిబంధనలు
* యధేచ్ఛగా చట్టం ఉల్లంఘనలు
ప్రత్యేక సందర్భాల్లో బాణసంచా కాల్పులు ఆనందాన్నిఅందిస్తాయి…
అదే ప్రమాదవశాత్తు జరిగే పేలుళ్లు విషాదాన్ని మిగులుస్తాయి…
సామర్లకోట మండలం వేట్లపాలెంలో చోటు చేసుకున్న పెను విషాదం వెనుక ఉన్నది కేవలం బాణసంచా పేలుళ్లు మాత్రమే కాదు…
అక్కడ పేలింది… అధికారుల నిర్లక్ష్యం! నిబంధనల డొల్లతనం!!
కాగితాలకే పరిమితమైన చట్టం చేతకానితనం!!!
పొట్టకూటి కోసం వచ్చిన 21 మంది అమాయక కార్మికుల దేహాలు ఛిన్నాభిన్నమయ్యాయి. వాళ్ల కుటుంబాల జీవితాలు అంధకారబంధురమయ్యాయి. గాయపడి నెత్తురోడి ఆసుపత్రిపాలైన 13 మంది బాధితుల బతుకులు గాలిలో దీపాల్లా కొట్టుమిట్టాడుతున్నాయి.
అయిదు కిలోమీటర్ల వరకు వినిపించిన ఈ పెను విస్ఫోటం తీవ్రత గురించి కాదు ఇప్పుడు మాట్లాడుకోవలసింది.
మృతుల కుటుంబాలకు, బాధితులకు అందే పరిహారం గురించి కూడా కాదు…
ఇలాంటి విషాదకర ప్రమాదాలు ఇక ముందు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేదే అసలైన ప్రశ్న. ఎలాంటి చర్యలు తీసుకోవాలనేదే అసలైన చర్చ.
ఆ ప్రశ్నకు సరైన సమాధానం దొరికే వరకు, ఆ చర్చలు చర్యలుగా మారేవరకు ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. గతంలో జరిగిన ప్రమాదాలను విశ్లేషించి, సరైన కారణాలను అన్వేషించి, అసలైన చర్యలను తీసుకుని ఉంటే వేట్లపాలెం లాంటి భారీ ప్రమాదం జరిగేది కాదనేదే ఇప్పుడు అందరినీ వేధిస్తున్న విషయం. ఎందుకంటే గత 12 ఏళ్ల కాలాన్ని వెనక్కి తిరిగి చూసుకుంటే ఇలాంటి ప్రమాదాల్లో 70 మందికి పైగా మరణించారనే చేదు నిజం కళ్లముందు కనిపిస్తుంది.
చట్టాలు ఉన్నాయి… కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి.
నిబంధనలు ఉన్నాయి… కానీ అవి తనిఖీలు లేక నీరుగారిపోయాయి.
నిరుడు ఏప్రిల్‌లో అనకాపల్లి జిల్లాలో జరిగిన ప్రమాదం మరవక ముందే… అక్టోబరులో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ విస్ఫోటనం చోటుచేసుకుని పలువురు మరణించారు. వాటి ప్రభావం నుంచి బయటపడకముందే ఇప్పుడు కాకినాడ జిల్లా వేట్లపాలెంలో జరిగిన ఘోర దుర్ఘటన మరోసారి వ్యవస్థాగత లోపాల్ని ఎత్తిచూపుతోంది.
అగ్నిమాపక, పోలీసు, రెవెన్యూ, కార్మిక శాఖలు, స్థానిక సంస్థలు, కాలుష్య నియంత్రణ మండలి సహా సంబంధిత విభాగాలన్నింటి నుంచి నిరభ్యంతర పత్రాలు అందిన తర్వాత బాణసంచా తయారీ కేంద్రాల ఏర్పాటుకు ఐదేళ్ల కాలపరిమితితో జిల్లా కలెక్టర్ లైసెన్సులు జారీ చేస్తున్నారు. ఒకసారి ఈ లైసెన్సు ఇచ్చేసిన తర్వాత ఇక ఆ తయారీ కేంద్రాల వైపు అధికారులు కన్నెత్తి చూడట్లేదు. లైసెన్సు జారీ చేసిన సమయంలో నిర్దేశించిన నిబంధనలు పాటిస్తున్నారా? భద్రతా చర్యలు అమలవుతున్నాయా? అనేది పరిశీలించే దిక్కే ఉండట్లేదు. ఎప్పటికప్పుడు తమకు అందాల్సిన లంచాలు అందుతున్నాయా? లేదా? అనేది మాత్రమే చూసుకుంటున్నారనే ఫిర్యాదులున్నాయి. దీంతో బాణసంచా తయారీ కేంద్రాల నిర్వాహకులు నిబంధనలకు పాతరేస్తున్నారు.
అధికారులందరూ కలిసి ఎప్పటికప్పుడు ఉమ్మడి తనిఖీలు నిర్వహించాలి. రాష్ట్రంలోని ఏ ఒక్క జిల్లాలోనూ ఈ ఉమ్మడి తనిఖీలు సరిగ్గా నిర్వహించట్లేదు. నిజంగా తనిఖీలు చేసి ఉల్లంఘనలు గుర్తిస్తే ప్రారంభంలోనే అడ్డుకట్ట వేసి ప్రమాదాలు నియంత్రించేందుకు వీలుంటుంది. అధికార యంత్రాంగానికి అవేవీ పట్టకపోవటం పెను ప్రమాదాలకు దారితీస్తోంది.
అనుమతులు పొందే సమయంలో ఒక్కో బాణసంచా తయారీ కేంద్రాల్లో 5-6 మంది కార్మికులే పనిచేస్తున్నట్లు నిర్వాహకులు చెబుతుంటారు. కానీ ఒక్కో చోట కనీసం 20 నుంచి 40 మంది వరకూ ఈ కేంద్రాల్లో పనిచేస్తుంటారు. 10 మందికి మించి కార్మికులుంటే కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలి. కానీ వారు పట్టించుకోవట్లేదు.
బాణసంచా తయారీ కేంద్రాల్లో గరిష్ఠంగా అన్ని రకాల ముడిపదార్థాలు కలిపి 50 కిలోల వరకే నిల్వ ఉంచాలనే నిబంధన ఉంది. అది పూర్తిగా ఖాళీ అయిపోయిన తర్వాతే మళ్లీ ముడిసరుకు తెచ్చుకోవాలి. నిర్వాహకులెవరూ ఈ నిబంధన పాటించట్లేదు. ఒకేసారి వందల కిలోల ముడిపదార్థాలు కొనుగోలు చేసేసి నిల్వ చేస్తున్నారు. ప్రమాదం జరిగినప్పుడు తీవ్రత పెరగటానికి, భారీ ప్రాణనష్టానికి ఇదే కారణమవుతోంది.
బాణసంచా పేల్చేటప్పుడు భారీ శబ్దాలు రావాలనే ఉద్దేశంతో చాలా మంది నిర్వాహకులు కొన్ని రకాల ప్రత్యేక రసాయనాలు వాడుతున్నారు. బాణసంచా తయారీలో ఏయే ముడి పదార్థాలు, ఎంతెంత మోతాదులో వాడుతున్నారో గుర్తించే వ్యవస్థ అందుబాటులో లేకపోవటంతో నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు.
ఈ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్మికులంతా నైపుణ్యం లేని వారే. వారు రోజు కూలీలు.. ఏ రసాయనాన్ని ఎంత మోతాదులో, ఎలా మిశ్రమంలో దట్టించాలో తెలియని పరిస్థితి. ఈ క్రమంలో చిన్న తేడా వచ్చినా భారీ ప్రమాదానికి దారితీస్తోంది.
– కఠిన చర్యలు తీసుకుంటేనే….
రాష్ట్ర వ్యాప్తంగా 93 బాణసంచా తయారీ యూనిట్లు, 152 గోదాములున్నాయి. వీటిల్లో అత్యధికం డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, అనకాపల్లి జిల్లాల పరిధిలోనే ఉన్నాయి. ఇవి అధికారికంగా అనుమతి పొందినవి. అసలు అనుమతులే లేకుండా నడుస్తున్నవి అనేకమున్నాయి. వాటిల్లో ఇంకా దారుణ పరిస్థితులున్నాయి. ఇప్పటికైనా మేల్కొని.. కఠిన చర్యలు తీసుకుంటేనే ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి.
– మూలాలు గుర్తించాలి…
అధికార యంత్రాంగాన్ని వేలెత్తి చూపే ముందు వాళ్లకు ఉన్న సాధకబాధకాలు కూడా పరిగణించాల్సి ఉంటుంది. ఉదాహరణకు వందలాదిగా పెరిగిపోతున్న బాణసంచా యూనిట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయడానికి తగినంత మంది సిబ్బంది ఉన్నారో లేదో చూడాలి. వారికి తగిన రవాణా సౌకర్యాలు, నిబంధనల్లో లొసుగులను గుర్తిస్తే అప్పటికప్పుడు చర్యలు తీసుకోగలిగే వెసులుబాటు ఉందో లేదో కూడా గమనించాలి. నిజానికి చట్టాలు ఉన్నాయి. వాటి నిబంధనలను ఇప్పటి కాలానికి చెందినట్లు మార్చుకోవలసిన అవసరం కూడా ఉంది. అలా 141 ఏళ్ల నాటి చట్టాన్ని మార్చి 2025 నుంచి కొత్త నిబంధనలను తీసుకువచ్చారు. అయితే ఆ నిబంధనలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాల్సి ఉంది. బాణసంచా లాంటి ప్రమాదకర విస్ఫోటాలు జరిగే అవకాశం ఉన్న ప్రతి కార్ఖానాలోను ఆధునిక సాంకేతిక పరికరాలను అందుబాటులోకి తీసుకురావాలి. ప్రభుత్వంతో పాటు స్వతంత్ర నిపుణుల పర్యవేక్షణ కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలి. కార్మికుల భద్రతకు బీమా సౌకర్యాల లాంటి పథకాలు అమలయ్యేలా చూడాలి. ఇలాంటి పరిశ్రమల్లో కార్మికులు తప్పనిసరిగా ధరించాల్సి ఉన్న ప్రత్యేక దుస్తులు, మాస్కులు, పాద రక్షల లాంటి సామగ్రిని ఆయా పరిశ్రమల యజమానులే సమకూర్చేలా చూడాల్సి ఉంది.
– ఉపముఖ్యమంత్రి ఆగ్రహం…
నిబంధనల ఉల్లంఘనలే వేట్లపాలెం పేలుడు ప్రమాదానికి కారణమని ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 8 మంది పని చేయాల్సిన చోట 31 మందితో పని చేయించారని గుర్తించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిబంధనలు కఠినతరం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు. వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల కుటుంబాలు, క్షతగాత్రులను పరామర్శించడంతో పాటు, ప్రమాదం గురించిన వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో క్షతగాత్రులకు అందుతున్న వైద్య సదుపాయాలను పరిశీలించారు.
‘‘ఇది అత్యంత విషాదకరమైన సంఘటన. అనుమతులు తీసుకున్న మేరకు యాజమాన్యాలు నిబంధనలు పాటించడం లేదు. ఇలాంటి సంఘటనలకు యాజమాన్యాలే బాధ్యత వహించాలి. ఇక్కడికి వచ్చే ముందు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడాను. నిబంధనలు మరింత కఠినతరం చేయడంపై చర్చించాం. ఈ ఘటనలో మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున పరిహారం అందజేస్తున్నాం. క్షతగాత్రులకు చికిత్సకయ్యే పూర్తి ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది’’ అంటూ ప్రకటించారు.
ప్రభుత్వ నేతల భరోసా కార్యరూపం దాల్చి బాణసంచా పరిశ్రమలో పొట్టకూటి కోసం పనిచేసే కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపగలిగితే అంతకన్నా కావలసినదేముంటుంది?