
మార్కాపురం నియోజకవర్గం: మార్కాపురం మండలం, రాయవరం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. గురువారం ఆమె డీజీపీ హర్షి కుమార్ గుప్తా, రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ పి. రాజబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలో 13 మంది మరణించగా, 28 మంది గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రుల్లో కొంతమందిని మెరుగైన వైద్యం కోసం ఒంగోలు, గుంటూరు ప్రాంతాలకు తరలించినట్లు చెప్పారు. ప్రమాదంపై సమగ్ర విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
రవాణా శాఖ మంత్రి ఎం. రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో బస్సు ప్రమాదాలను నివారించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కఠిన నిఘా పెట్టనున్నామని, త్వరలో యజమానులతో సమావేశం నిర్వహించి భద్రతా చర్యలను కఠినతరం చేస్తామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు.
కలెక్టర్ పి. రాజబాబు మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. గాయపడిన వారికి పూర్తిగా కోలుకునే వరకు అవసరమైన వైద్య సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పలు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని బాధిత కుటుంబాలకు తమ సంఘీభావాన్ని తెలియజేశారు.