
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
* వడ్డెర సామాజిక వర్గీయులకు ఆర్థిక, సామాజిక భరోసే మా లక్ష్యం
* వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల్లో 15 శాతం కేటాయింపులు
* సీనరేజీలో 50 శాతం మినహాయింపు బిల్లుకు కేబినెట్ లో ఆమోదం
* ఈ బిల్లుతో వడ్డెర్లకు ఆర్థిక మేలు అంటూ మంత్రి సవిత హర్షం
* సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి నారా లోకేష్‌లకు ధన్యవాదాలు
అమరావతి: వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే సీఎం చంద్రబాబు సంకల్పమని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్. సవిత స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు.
దీనిలో భాగంగానే వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజుల కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నామని తెలిపారు. సీనరేజీ ఫీజులో 50 శాతం మినహాయింపు ఇవ్వాలని కూడా కూటమి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సీఎం చంద్రబాబు నాయకత్వంలో జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ బిల్లుకు మంత్రిమండలి ఆమోదం తెలిపిందని వెల్లడించారు.
ఎన్నికల ముందు నిర్వహించిన యువగళం పాదయాత్ర సందర్భంగా మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నెరవేర్చడంపై ఆమె హర్షం వ్యక్తం చేశారు. మాట నిలబెట్టుకున్నందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.
యువగళం పాదయాత్ర సమయంలో వడ్డెర సామాజిక వర్గీయులు తమ సమస్యలను లోకేష్‌కు వివరించారని గుర్తుచేశారు. రాళ్లు కొట్టడం, మట్టి పనులు చేసుకోవడం తమ జీవనోపాధి అయినందున, ప్రభుత్వ ఆధీనంలోని కొండ పోరంబోకు భూముల్లో మైనింగ్ లీజులు కల్పిస్తే గౌరవప్రదమైన జీవనం సాగించగలమని అప్పట్లో వినతిపత్రం అందజేశారని తెలిపారు.
వారి వినతికి సానుకూలంగా స్పందించిన లోకేష్, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీకి కట్టుబడి వడ్డెర సొసైటీలకు మైనింగ్ లీజులు కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
దీనిలో భాగంగా మైనింగ్ లీజుల్లో వడ్డెర సొసైటీలకు 15 శాతం రిజర్వేషన్లు కల్పించడంపై మంత్రిమండలి ఆమోదం తెలిపిందని తెలిపారు. సీనరేజీ ఫీజులో 50 శాతం మినహాయింపు కూడా ఈ నిర్ణయంలో భాగమని పేర్కొన్నారు.
మైనింగ్ లీజుల కేటాయింపులు, సీనరేజీ మినహాయింపులపై ప్రభుత్వం త్వరలోనే జీవో జారీ చేయనుందని వెల్లడించారు. త్వరలో ప్రారంభం కానున్న ఆదరణ 3.0 పథకంలో వడ్డెర్లకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మైనింగ్ కార్యకలాపాల్లో వినియోగించేందుకు వడ్డెర్లకు ఆధునిక యంత్రాలను అందించనున్నట్లు పేర్కొన్నారు.
వెనుకబడిన వడ్డెర్లను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని, అందుకనుగుణంగా మైనింగ్ లీజుల కేటాయింపుల్లో వారికి ప్రాధాన్యం ఇస్తున్నామని మంత్రి సవిత స్పష్టం చేశారు.