చెత్త నుంచి సంపద సృష్టి!

• ఆకట్టుకుంటున్న స్వచ్ఛ రథాలు
• చెత్తకు బదులుగా నిత్యావసర వస్తువుల పంపిణీ
• రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్న 434 స్వచ్ఛ రథాలు
• రథాలు కావాలని కోరుతున్న గ్రామాలు
• స్వచ్ఛ రథాల సంఖ్యను 660కి పెంచే ప్రణాళిక
• ఇప్పటి వరకు 995 టన్నుల వ్యర్థాల సేకరణ
• ప్రతిగా రూ.1.40 కోట్ల విలువైన వస్తువుల అందజేత

ఇంటి నుంచి ఇంటర్నేషనల్ స్థాయి వరకు ‘చెత్త’ ఒక సమస్యే. మనుషుల వినియోగం తర్వాత బయటకు వచ్చి పడుతున్న వ్యర్థ పదార్థాల నిర్వహణ, గ్రామాల స్థాయి నుంచి దేశాల వరకు ఓ పెద్ద అనివార్య కార్యక్రమం. ప్రభుత్వ పరంగా ఎంత చెత్తను సేకరిస్తున్నా ఎప్పటికప్పుడు వీధిల్లోకి వ్యర్థాలు చేరుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో ఓ వినూత్న ప్రయత్నంగా ఆంధ్ర ప్రదేశ్ లో ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన ‘స్వచ్ఛ రథాల’ ఆలోచన ఘనంగా విజయవంతమవుతోంది. అటు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచుతూ, ఇటు ప్రభుత్వ పరమైన పరిష్కారం చూపిస్తూ ఈ ప్రయోగం ముందుకు దూసుకుపోతోంది. 
• ఏమిటీ స్వచ్ఛ రథాలు?
రోజూ చెత్త నిర్మూలన జరుగుతున్నప్పటికీ ప్రజలు విరివిగా వాడే ప్లాస్టిక్ వస్తువులు, ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, ఇతర పదార్థాలు లాంటివి ఎక్కడికక్కడ పోగుపడుతూనే ఉంటాయి. ఈ నేపథ్యంలో కార్యరూపం దాల్చినవే ‘స్వచ్ఛ రథాలు’.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని ఇళ్లలో పోగయ్యే వ్యర్థాలను సంపదగా మార్చే ఉద్దేశంతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ చేపట్టిన వినూత్న ప్రాజెక్టు ఇది. ప్రజల నుంచి వ్యర్థ పదార్థాలను సేకరించి, అందుకు బదులుగా వారికి అవసరమయ్యే నిత్యావసర వస్తువులను అందించాలనేది ప్రధాన ఉద్దేశం.
తొలుత ప్రయోగాత్మకంగా కొన్ని ప్రాంతాల్లో పరిమిత సంఖ్యలో ప్రవేశ పెట్టిన స్వచ్ఛ రథాలకు ప్రజల నుంచి మంచి ప్రతిస్పందన లభించింది. దాంతో వాటి సంఖ్యను పెంచుతున్నారు. జనం స్వచ్ఛందంగా తమ ఇంట్లో వాడుతున్న వ్యర్థ పదార్థాలను పోగు చేసి పెట్టుకుని స్వచ్ఛ రథాలు రాగానే స్వయంగా అందిస్తున్నారు. బదులుగా తమకు కావలసిన సరకులను ఆనందంగా తీసుకెళుతున్నారు. ప్రస్తుతం ‘స్వచ్ఛ రథం’ పేరుతో 434 వాహనాల ద్వారా ఇళ్లలో టన్నుల కొద్దీ నిరుపయోగంగా ఉన్న ప్లాస్టిక్‌, ఇతర రకాల వస్తువుల ఘన వ్యర్థాలను సేకరిస్తున్నారు. పాత ఇనుము, పేపర్లు, పుస్తకాలు, అట్టపెట్టెలు, ప్లాస్టిక్‌ బాటిళ్లు, స్టీల్‌ వస్తువులను సేకరించి.. బదులుగా గ్రామీణులకు పప్పు, ఉప్పు, చింతపండు, సబ్బులు వంటి నిత్యావసర వసువులను అందజేస్తున్నారు.
• ఎలా మొదలైంది?
ఉపముఖ్యమంత్రిగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా శ్రీ పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చడంలో విశేష కృషి చేస్తున్నారు. “చెత్తను 12 గంటల్లోపు సేకరిస్తే అది సంపదగా మారుతుంది” అనే నినాదంతో ఆయన గ్రామాల్లో చెత్త నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. గుంటూరు జిల్లా నంబూరు వంటి గ్రామాల్లో ఆయన స్వయంగా చెత్త సేకరణ వాహనాన్ని నడిపి, పారిశుధ్య కార్మికులతో కలిసి పనిచేసి ప్రజల్లో స్ఫూర్తి నింపారు.
శ్రీ పవన్‌ కల్యాణ్‌ ఆదేశాలతో గుంటూరు రూరల్‌ మండలం లాలుపురంలో పైలట్‌ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఇప్పుడు చాలా గ్రామాలకు విస్తరించింది. ఆర్నెల్ల కిందట పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ శ్రీ కృష్ణతేజ గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్యం పెరగడంతో పాటు గ్రామీణులకు అంతో ఇంతో ఆదాయం కల్పించవచ్చనే ఉద్దేశంతో ‘స్వర్ణ రథం’ ప్రణాళికను ముందుకు తెచ్చారు. ‘మీ ఇంట్లో ఏ వస్తువూ వృథా కాదు. అవసరం లేదని పారవేసే ప్రతి వస్తువుకూ విలువ ఉంది. ఎంతో కొంత ఆదాయం వస్తుంది’ అనే ప్రచారం చేశారు. ఇది పూర్వ కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వస్తు మార్పిడి విధానానికి అనుగుణంగా ఉంటుంది.
• పెరుగుతున్న ప్రజా స్పందన
ఒక ప్రత్యేక సమయానికి, ప్రత్యేక ప్రాంతానికి వచ్చేలా ఏర్పాటు చేసిన ఈ వాహనాల దగ్గరకు వచ్చి తమ వద్ద ఉన్న పనికిరాని వాటిని ఇస్తే, తమకు పనికొచ్చే మరో సరుకును తీసుకోవచ్చనే ఆలోచన గ్రామీణులకు బాగా నచ్చింది. దాంతో ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఈ స్వచ్చ రథాలు తమ ప్రాంతానికి వచ్చే సమయానికి ముందే తమ దగ్గరున్న వ్యర్థాలను పోగుచేసి ఉంచుకుని, అవి రాగానే వాటికి బదులుగా కావలసిన సరుకులు తీసుకుంటున్నారు. ఇందువల్ల గ్రామాల్లో రోడ్ల మీద, మురికి కాలువల్లోకి చేరే వ్యర్థాల్లో చాలా వరకు తగ్గిపోయినట్టు గమనించారు. ఇలా ఇది సత్ఫలితాలను ఇవ్వడంతో ఈ స్వచ్ఛ రథాలను మరిన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది.
• ఓ వినూత్న మార్పునకు ఇది ప్రారంభం
రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన “స్వచ్ఛ రథం” కార్యక్రమం కేవలం ఒక పారిశుధ్య కార్యక్రమంగానే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ఒక వినూత్న మార్పుగా నిలుస్తోంది. “చెత్త నుండి సంపద” అనే సూత్రంపై ఆధారపడి ఇది పనిచేస్తుంది.
కొన్ని రకాల వ్యర్థాల సేకరణకు స్క్రాప్ డీలర్లు ఇచ్చే ధర కంటే ప్రభుత్వం ఇక్కడ మెరుగైన ధరను కల్పించడం విశేషం. ఇందువల్ల వస్తు మార్పిడి విధానం అమలవుతుంది. ప్రతి మండలంలో ఒక ‘స్వచ్ఛ రథం’ వాహనం నిర్ణీత సమయాల్లో (సాధారణంగా ప్రతి 10-15 రోజులకు ఒకసారి) గ్రామాలకు వెళ్తుంది. ప్రజలు తమ ఇళ్లలోని ప్లాస్టిక్ కవర్లు, గాజు సీసాలు, ఇనుము, పాత పేపర్లు, ఈ-వేస్ట్ (ఎలక్ట్రానిక్ వ్యర్థాలు) వంటి పొడి చెత్తను ఈ వాహనానికి అందించాలి. సేకరించిన వ్యర్థాల బరువును బట్టి నిర్ణీత ధరను లెక్కించి, దానికి సమానమైన నిత్యావసర వస్తువులను (నూనె, పప్పులు, సోపులు, కూరగాయలు) అక్కడికక్కడే ఉచితంగా అందజేస్తారు.
ఈ కార్యక్రమం ద్వారా ప్లాస్టిక్ వ్యర్థాలు భూమిలో కలవకుండా రీసైక్లింగ్‌కు వెళ్లడం వల్ల భూగర్భ జలాలు, నేల కలుషితం కాకుండా నివారించవచ్చు. చెత్తకు విలువ కట్టడం వల్ల ప్రజల్లో బాధ్యత పెరుగుతుంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు తమ ఇంటి వ్యర్థాలను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. పరిసరాలు శుభ్రంగా ఉండటం వల్ల దోమల పెరుగుదల తగ్గి, సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది.
• భవిష్యత్తు లక్ష్యం…
మొదట్లో గుంటూరు, విజయవాడ, నెల్లూరు వంటి ప్రాంతాల్లో ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో, ప్రభుత్వం దీన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తోంది. స్వర్ణ రథాల సంఖ్యను 660కి పెంచాలని ప్రణాళికలు సిద్ధం చేశారు.
• రూ. 1.40 కోట్ల విలువైన వస్తువుల అందజేత
పైలట్‌ ప్రాజెక్టు సఫలం కావడంతో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 434 స్వచ్ఛ రథాలను గ్రామాలకు పంపి వ్యర్థాల సేకరణను ప్రారంభించింది. ఇంతవరకు దాదాపు 995 టన్నుల వేస్ట్‌ను సేకరించి, గ్రామీణులకు రూ.1.40 కోట్ల మేర విలువైన వస్తువులను అందించింది. ఈ నేపథ్యంలో స్వచ్ఛ రథాల కోసం పలు గ్రామ పంచాయతీలు అభ్యర్థిస్తున్నాయి. నెల్లూరు జిల్లా వింజమూరు గ్రామ పంచాయతీలో గత వారంలో ఒకే రోజు 1,116 కిలోల ప్లాస్టిక్‌ వ్యర్థాలను సేకరించి, గ్రామీణులకు రూ.24 వేలకు పైగా విలువ చేసే వస్తువులను పంపిణీ చేశారు.
కొన్ని రాష్ట్రాలు చేపట్టే కొన్ని కార్యక్రమాలు బాగా ప్రాచుర్యం పొందుతూ ఉంటాయి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో ‘ఎవర్‌ ఎన్విరో బయో ఎనర్జీ ప్లాంట్‌’ ఆదర్శంగా నిలుస్తోంది. నగర వ్యర్థాలను సీఎన్‌జీ గ్యాస్‌గా మార్చే ఈ ప్రాజెక్టు దేశంలోని అతి పెద్ద బయోగ్యాస్‌ ఉత్పత్తి కేంద్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇతర రాష్ట్రాలకు చెందిన అధికారులు, స్థానిక సంస్థల నేతలు దీనిపై అధ్యయనం కోసం ఇండోర్‌ను సందర్శిస్తున్నారు. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రారంభించిన ‘స్వచ్ఛ రథం’ కూడా ఇతర రాష్ట్రాలకు ఆదర్శం కానుందని పలువురు పేర్కొంటున్నారు.

Leave a Reply

Your email address will not be published.

This site is protected by reCAPTCHA and the Google Privacy Policy and Terms of Service apply.